– జగన్‌తో పిల్లి సుభాష్ భేటీ
-మంత్రి చెల్లుబోయిన వేణుపై పిల్లి ఫిర్యాదు
అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం వైసీపీ నేతల పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్నాయి. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలు, దాడులు చేసుకున్నారు. విబేధాల పరిష్కారం కోసం సీఎం కార్యాలయం నుంచి పిల్లి సుభాష్‌కు పిలుపు వచ్చింది. దీంతో ఆయన మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి చెల్లుబోయిన వేణుపై ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. పిల్లి సుభాష్‌తో సీఎం జగన్ సమావేశం అరగంట పాటు జరిగింది. కాగా క్యాంపు కార్యాలయానికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో సమావేశమై మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎం జగన్‌తో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. మంత్రి వేణుగోపాలకృష్ణపై సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన వర్గీయుల వ్యవహారశైలిని బోస్ వివరించారు. తన అనుచరుడు శివాజీపై మంత్రి అనుచరుడి దాడిపై జగన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది.
రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు ఆదివారం ద్రాక్షారామలో సమావేశమై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణపై అసమ్మతి గళం వినిపించారు. బోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు కాకుండా వేణుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆయనను ఓడించి తీరతామని హెచ్చరించారు.
మరోవైపు సోమవారం మంత్రి సమక్షంలోనే ఆయన అనుచరుడు ఉదయ్, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ శివాజీపై దాడికి పాల్పడ్డాడు. రామచంద్రపురం పట్టణ పరిధిలోని ముచ్చుమిల్లి సచివాలయం వద్ద సోమవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతుండగా వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ కోలమూరి శివాజీని మంత్రి వేణు ప్రధాన అనుచరుడు జుత్తుక ఉదయ్‌కాంత్ నిలదీశాడు.
నీకు వైస్ ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చిన మంత్రి వేణుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తావా అని దూషిస్తూ కాలర్ పట్టుకుని చేయిచేసుకున్నాడు. మంత్రి వారించే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శివాజీ కాసేపటి తర్వాత చీమల మందు నీటిలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్‌ను పిల్లి సుభాష్ కలిసి మంత్రి వేణుపై ఫిర్యాదు చేశారు.