ఫాఫం.. విజయశాంతి!

Spread the love

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఫాఫం విజయశాంతి ఇంకా బీజేపీ ఫాలిటిక్స్ అర్ధం చేసుకున్నట్లు లేదు. పార్టీల చేరిక విషయంలో బీజేపీ-టీఆర్‌ఎస్‌కూ ఫెద్దగా ఫరాక్ ఉండదు. ఎవరైనా టీఆర్‌ఎస్‌లో చేరాలనుకున్నా, లేదా వారినే టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాలన్నా దానికో లెక్కంటుంది. సదరు నాయకుడిని కేసీఆర్ స్వయంగా ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని ‘కూర్చుని’ మాట్లాడతారు. ఇంకేముంది? కేసీఆర్ అంత లావు సీఎం తనను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించారని, సదరు నాయకుడు సంబరపడిపోతాడు. ఆ జోష్‌లో మందీ మార్చలమేసుకుని కారెక్కేస్తాడు. ఇక తర్వాత కేసీఆరన్న ఆపాయింట్‌మెంట్ గురించి మర్చిపోవడమే. పార్టీలో ఎందుకు చేరాను భగవంతుడా అని సదరు నేత తలపట్టుకోవటం అలవాటయిపోతుంది. తుమ్మల, మండవ వెంకటేశ్వరరావు, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి లాంటి పెద్ద నేతలు ఇప్పటివరకూ ఖాళీగానే ఉన్నారు.

బీజేపీలో కూడా సేమ్ టు సేమ్. బీజేపీలో చేరాలనుకునే లీడర్లు, ఢిల్లీకి వెళ్లి అధ్యక్షుడు నద్దా సమక్షంలో కాషాయం కప్పేసుకుంటారు. ఇక ఆ తర్వాత సదరు నాయకుడికి నద్దా అపాయింట్‌మెంట్ దొరకడం దుర్లభం. ముందు అమిత్‌షా సమక్షంలోనే చేర్పిస్తామని ఢిల్లీకి తీసుకువెళతారు. తర్వాత పార్టీ ఆఫీసుకుvijayashanthi-bjp తీసుకువెళ్లి నద్దా సాబ్‌తో కండువా కప్పిస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ కండువా కప్పేస్తారు. తర్వాత ఆయనా కలవరు. అసలు పార్టీలో తమ పాత్రేమిటో తమకే అర్ధం కాదు. ఏ పని చేయాలో తెలియదు. ప్రెస్‌మీట్ పెట్టాలంటే పార్టీ ఆఫీసులో కుదరదంటారు. చివరాఖరకు ఏ ప్రెస్‌క్లబ్‌లోనో ప్రెస్‌మీట్ పెట్టి, తన జిహ్వచాపల్యం తీర్చుకుంటారు. సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి వాళ్లకు గతంలో జరిగిన చేదు అనుభవం ఇదే.

ఇతర పార్టీలో బోలెడు గౌరవ మర్యాదలు పొంది, బీజేపీలో చేరిన వారికి పార్టీ ఆఫీసులో సీటు ఇచ్చే దిక్కు కూడా ఉండదు. కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వరు. సమావేశాల్లో వేదికపైకి పిలవరు. పొలిట్‌బ్యూరో, మాజీ మంత్రులుగా పనిచేసిన వారికి బీజేపీలో త్వరగా పదవులివ్వరు. చివరాఖరకు తలుపులేసుకుని, అసలు ఈ పార్టీలో ఎందుకు చేరానా భగవంతుడా అని తన తల తానే పట్టుకుని, ఇంకో పార్టీలో చేరిపోతారు. ఆ రకంగా పార్టీ నుంచి బయటకొచ్చేస్తారు. అయితే బయటకొచ్చేస్తారనే కంటే.. పార్టీ నాయకులే బయటకు వెళ్లేలా చేస్తారంటేనే బాగుంటుంది.

నాగం, మోత్కుపల్లి వంటి ప్రముఖులు ఆ విధంగా నిష్క్రమించిన వారే. ఆ తర్వాత పార్టీ నేతలు, రాష్ట్ర అధ్యక్షుల వద్దకు వెళ్లి, ‘మేం చెబితే మీరు విన్నారా? బయటనుంచి వచ్చిన వాళ్లు మన పార్టీలో ఉండలేరు. మీరేమో మొదటి నుంచీ పార్టీలో ఉన్న మమ్మల్ని గుర్తించరు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. అంటే కొత్త వారిని బీజేపీ ముదుర్లు రానీయరు. ఒకవేళ వచ్చినా వారంతట వారే విజయవంతంగా వెనక్కి వెళ్లేలా చూస్తారన్నమాట.

ఇప్పుడు విజయశాంతి వ్యాఖ్యలు చూస్తే ఇక విజయశాంతి బీజేపీలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమనిపిస్తోంది. ‘పని చెప్పకుండా ఎలా పనిచేయాలి? పని చెబితే కదా పార్టీ పని చేసేది? పని ఇవ్వకుండా చేయమంటే నేనేం చేయాలి? రాష్ట్ర నాయకత్వం నన్ను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. సీనియర్లను సమన్వయం చేసుకోకపోతే పార్టీకే నష్టం. నేనెక్కడ నుంచి పోటీ చేయాలని పార్టీ స్పష్టత ఇవ్వడం లేదు. దానిపై వారికే స్పష్టత లేదు. పార్టీలో మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో అర్దం కావడం లేద’ని విజయశాంతి చేసిన వ్యాఖ్యలు, ఆమె బీజేపీలో సంతృప్తిగా లేరని మెడ మీద తల ఉన్న ఎవరికయినా స్పష్టమవుతుంది.

నిజానికి విజయశాంతి బీజేపీ జాతీయ నాయకురాలు. ఆ మేరకు ఆమెకు ఆ హోదా కూడా ఉంది. కానీ ఆమెను కోర్ కమిటీ సమావేశాలకూ పిలవరు. ముఖ్యమైన భేటీలకూ సమాచారం ఇవ్వరు. ఆమె ఒక్కరే కాదు. చాలామందిని మీటింగులకు పిలవరు. ఆస్థాన విద్వాంసులైన ఆ ఆరుగురేడుగురు మినహా, మిగిలిన ఎవరినీ రెగ్యులర్‌గా సమావేశాలకు పిలవరు.

సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఇలా ఓ అరడజను మంది మాత్రమే పర్మినెంట్‌గా హాజరవుతుంటారు. గతంలో ఈ విధానంపై ఎమ్మెల్యే రఘునందరన్‌రావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు పార్టీలో శాసనసభా పక్ష నేత రాజాసింగ్‌కే దిక్కులేదంటే, పార్టీ వ్యవస్థ ఎవరి కనుసన్నలలో నడుస్తోందో ఊహించుకోవచ్చు. కాబట్టి విజయశాంతి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుని, పార్టీ తనను గౌరవించాలని కోరుకోవడం అత్యాశ కిందే లెక్క.

అధ్యక్షుడు బండి సంజయ్‌పై పార్టీ వర్గాల్లో వ్యతిరేకత లేకపోయినా, సీనియర్లను గౌరవించడం లేదన్న విమర్శలు మాత్రం బాగా ఉన్నాయి. కేవలం తన పబ్లిసిటీ గురించి తప్ప, మిగిలిన విషయాలు పట్టించుకోవడం లేదన్నది మరో విమర్శ. పార్టీ ఆఫీసును అసమర్ధుల చేతికి అప్పగించారన్న విమర్శలయితే తీవ్రంగా ఉన్నాయి. ఆర్గనైజేషన్‌ను వదిలేసి, మీడియాలో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని సీనియర్లు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పటివరకూ అనుబంధ సంస్థల కమిటీలను పూర్తి చేయలేదని, సెల్స్‌పై దృష్టి సారించడం లేదని, జిల్లా స్థాయిల్లో పదవులు కోల్పోయిన వారికి రాష్ట్ర కమిటీలో అవకాశం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. సంజయ్ అధ్యక్షుడయిన తర్వాత, సీనియర్లకు పూర్తి స్థాయిలో పాతర వేశారన్న విమర్శలయితే కింది స్థాయిలో సైతం చర్చనీయాంశంగా మారింది.

దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికే దిక్కూ దివాణం లేని పరిస్థితిలో, విజయశాంతి తన సంగతేమిటని ప్రశ్నించడం పార్టీకి సంబంధించినంత వరకూ జోకేనన్నది సీనియర్ల ఉవాచ. విజయశాంతి ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ కావచ్చు. కానీ ఇప్పుడామె పార్టీలో ఒక సాధారణ నాయకురాలు మాత్రమే. కాకపోతే జాతీయ కార్యవర్గంలో ఆమెకో హోదా ఇచ్చారంతే. అలాంటి వారూ చాలామంది ఉన్నారు. ఆమెతోపాటు పనిలేకుండా, పార్టీ పనిచెప్పకుండా ఖాళీగా కూర్చున్న లీడర్లు చాలామంది ఉన్నారు.
అసలు విజయశాంతి పార్టీ తత్వం తెలుసుకోవడంలోనే విఫలమయ్యారు. పార్టీకి తాను అవసరం అని ఆమె ఫీలవడం తప్ప, ఆమె పార్టీకి అవసమని పార్టీ ఫీలవడం లేదు. అసలు చిక్కంతా అదే. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి లాంటిgarikapati-sujanaప్రముఖులనే పార్టీ పట్టించుకోనప్పుడు.. తనను పిలిచి పెద్దపీట వేయాలని విజయశాంతి కోరుకోవడం అత్యాశ. విజయశాంతి బాగా మాట్లాడగల నాయకురాలు కావచ్చు. జనాలను సమ్మోహనపరిచే నాయకురాలే కావచ్చు. సినిమా గ్లామరు దానికి అదనపు ఆకర్షణ కూడా కావచ్చు. కానీ.. పార్టీ నాయకత్వం ఆమె వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని అనుకోవాలి. ఆ తత్వం ఇంకా మేడమ్ ఇంకా అర్ధం చేసుకున్నట్లు లేదు.
ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి రకరకాల కారణాలు, పెద్దల హామీలతో బీజేపీలోకి చేరిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది. కోర్టులో గెలిచిన వాడు తలుపేసుకుని ఏడిస్తే, ఓడిపోయిన వాడు బయటే ఏడుస్తాడట. ఇప్పుడు బీజేపీలో చేరిన ఇతర పార్టీల వారి పరిస్థితి, కోర్టులో కేసు గెలిచిన వాడి పరిస్థితి మాదిరిగా ఉందన్నది తత్వం బోధపడిన వారి ఉవాచ. హలో మేడమ్… మీకు అర్ధమవుతోందా?

Leave a Reply