– మంత్రి అనం రామనారాయణ రెడ్డి
– టీడీపీ కేంద్ర కార్యాలయంలో పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి కార్యక్రమం
అమరావతి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. పరిటాల రవీంద్ర తుది శ్వాస వరకూ పేద ప్రజల కోసం పోరాడిన ధీరుడు అని కొనియాడారు. ఆయన ఆస్తమించి రెండు దశాబ్ధాలైనా నేటీకి ప్రజల గుండెల్లో వినిపిస్తున్న పేరు పరిటాల రవీంద్ర అన్నారు . తనదైన శైలిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని సమర్థవంతంగా నడిపించిన నాయకుడు పరిటాల రవీంద్ర అని అన్నారు.
స్వీర్గీయ నందమూరి తారక రామరావు కు సన్నిహితుడిగా, ముఖ్యుడిగా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి పరిటాల రవీంద్ర అని గుర్తు చేశారు. పరిటాల కుటుంబం తెలుగుదేశంపార్టీకి అంకితమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనాయకుడు నారా లోకేశ్ తో కలిసి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. నేడు రవీంద్ర మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని మంత్రి భావోద్వేగం వ్యక్తం చేశారు. పరిటాల రవీంద్రకి నివాళులర్పించడం మనందరి బాధ్యత అని ఆయన తెలిపారు. పరిటాల రవీంద్ర పార్టీకి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేము అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, సీనియర్ నాయకులు ఏవి రమణ, రాష్ట్రమీడియా కొఆర్టినేటర్ దారపనేని నరేంద్ర, బొద్దులూరి వెంకటేశ్వరరావు, పర్చూరి కృష్ణ, హాసన్ బాషా పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.