అమరావతి: ఈనెల 26వతేది ఆదివారం 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర అసెంబ్లీ మరియు సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అత్యంత సర్వాంగ సుందరంగా అలంకరించడంతో ఆభవనాలన్నీ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.ముఖ్యంగా సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలో గల సచివాయ ఐదవ భవనాన్ని మువ్వన్నెల జాతీయ జెండా నమూనా రంగులతో కూడిన విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆభవనం అత్యంత ఆకర్షణీయంగా జాతీయత ఉట్టిపడేలా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రాష్ట్ర అసెంబ్లీ భవనంతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సచివాలయం మొదటి భవనంతో పాటు మిగతా నాలుగు భవనాలన్నిటినీ వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంక రించడంతో ఈభవనాలన్నీమిరిమిట్లు గొలిపే రీతిలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అంతేగాక గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగానే రాష్ట్ర సచివాలయం,అసెంబ్లీ ప్రాంగణాల్లో గణతంత్ర శోభ నెలకొంది.