– మంత్రి సవిత
పెనుకొండ : ఫ్యాక్షనిస్టుల అరాచకాలతో బలవుతున్న ప్రజల పక్షాన నిలిచి, సమాజ సమానత్వ సాధన కోసం కృషిచేస్తూ, తాను అభిమానించిన ప్రజల మధ్యనే దివంగత మాజీ మంత్రి, పెనుకొండ శాసన సభ్యుడు పరిటాల రవీంద్ర తుది వీడ్కోలు తీసుకున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. పరిటాల వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆఖరి శ్వాస వరకూ పేద ప్రజల కోసం పోరాడిన ధీరుడు పరిటాల రవీంద్ర. తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి. పరిటాల రవీంద్ర అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని తెలిపారు. వచ్చే ఏడాదిలో పెనుకొండలో పోరాటాల యోధుడు పరిటాల రవీంద్ర విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.