– హైదరాబాద్ నుంచి పూర్తిగా ఏపీకి మారిన పవన్
– పార్టీ ఆఫీసు సిబ్బంది కూడా అక్కడికే
– షూటింగులకే బయటకు
– ఇక మంగళగిరిలోనే నివాసం
– ఇప్పటి హైదరాబాద్ ఆఫీసు తెలంగాణకే
– చెరగనున్న ‘టూరిస్ట్ లీడర్’ ముద్ర
– ఇక ఏపీలోనే పూర్తి స్థాయి పాలిటిక్స్
– పవన్ నిర్ణయంపై జనసైనికుల ఖుషీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం జనసైనికులకు ఖుషీనిచ్చింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌లో ఉంటూ, పార్టీ కార్యక్రమాలకు ఏపీ వెళుతున్న పవన్.. ఇకపై పూర్తి స్థాయిలో మంగళగిరిలోనే ఉండబోతున్నారు. ఆ మేరకు పవన్ సహా, ఆయన పార్టీ కార్యాలయ సిబ్బంది మంగళగిరికి మారారు. ఇకపై పవన్ తన సినిమా షూటింగులు మినహా.. పూర్తికాలం మంగళగిరిలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్‌కల్యాణ్ తనపై ఉన్న ‘టూరిస్టు లీడర్’ అన్న ముద్ర చెరిపేసుకున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఉన్న పార్టీ సెంట్రల్ ఆఫీసును, మంగళగిరికి పూర్తి స్థాయిలో షిఫ్టు చేశారు. ఇకపై అక్కడ కేవలం తెలంగాణ పార్టీ కార్యకలాపాలు మాత్రమే జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్టీ ఆఫీసు సిబ్బంది కూడా మంగళగిరికి తరలివెళ్లారు.
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఇకపై, మంగళగిరిలోనే పూర్తి స్థాయిలో కొలువుతీరనున్నారు.అక్కడే నివసించబోతున్నారు. షూటింగులు ఉన్న సమయంలో మినహా, మిగిలిన సమయంతా మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకే కేటాయించనున్నారు. దీనితో ఆయన ఇకపై అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఇది ప్రధానంగా జనసైనికులకు సంతోషం కలిగించేదే. పవన్ ల్యాణ్ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్ప, మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు రారు. దానితో పార్టీ నేతలు, కార్యకర్తలు నాదెండ్ల మనోహర్‌ను, అప్పుడప్పుడు వచ్చే నాగబాబును మాత్రమే కలవాల్సి వస్తోంది. ఇప్పుడు పవన్ పూర్తి స్థాయిలో మంగళగిరికి షిఫ్టు కావడంతో, ఆయన తమకు అందుబాటులో ఉంటారని జనసైనికులు సంబరపడుతున్నారు.
అటు పవన్‌ను.. టూరిస్టు లీడర్ అంటూ విమర్శిస్తున్న అధికార వైసీపీ నేతలకు సైతం, ఈ పరిణామం తగిన సమాధానం ఇచ్చినట్లయిందని, జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘పవన్ అప్పుడప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటేనే, వైసీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక పూర్తిగా ఇక్కడే ఉంటే, ఇక జగన్ సహా వైసీపీ నేతలెవరికీ నిద్ర కూడా పట్టదేమో’’నని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధానంగా పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాలు చేసేందుకు సమయం కేటాయిస్తే, ఏపీ రాజకీయ పరిణామాల్లో పెను మార్పులు ఖాయమన్న అభిప్రాయం, చాలాకాలం నుంచి వ్యక్తమవుతోంది. స్థానికంగా ఉంటూ స్పందించే దానికి, అప్పుడప్పుడూ వచ్చి మాట్లాడేదానికి తేడా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పవన్ ఫుల్‌టైమ్ రాజకీయాలు చేస్తే, ప్రజాదరణ కూడా పెరుగుతుందని చాలామంది అప్పటినుంచే సూచిస్తున్నారు.