Suryaa.co.in

Andhra Pradesh

ఎక్కడ తగ్గాలో…ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్

-స్పీకర్ గా అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్న పాత్రుడి ఎంపిక హర్షణీయం
-శాసనసభ విలువలను గత ప్రభుత్వం మంట గలిపింది….దూషణలకు, వ్యక్తిత్వ హననానికి వేదిక చేసింది
-నేతలు, వారి కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో అసెంబ్లీని నాడు కౌరవ సభలా నడిపారు
-ప్రజల ఆశీర్వాదంలో మళ్లీ గౌరవ సభలో అడుగుపెట్టాను.
-నాడు అహంకారంతో ప్రతిపక్షాన్ని హేళన చేశారు….23 సీట్లే అని వ్యాఖ్యలు చేశారు
-మాకు వచ్చిన 164 లో….1+6+4 కలిపితే 11…. ఇవీ వైసీపీ కి వచ్చిన సీట్లు
-పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమన్నారు…ఆయన పోటీచేసిన అన్ని స్థానాల్లోను గెలిచారు
-వైనాట్ 175 అన్నవాళ్లకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు..ఇది దేవుడి స్క్రిప్ట్ అనుకోవాలా?
-అహంకారంతో వ్యవహరించడం మంచిది కాదు…సభలో ప్రజల సమస్యలపై చర్చించాలి
-పోరాట యోధుడు, బీసీ నేత అయ్యన్నను సభాధ్యక్షులుగా చూస్తుంటే గర్వంగా ఉంది
-శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-స్పీకర్ ఎన్నికపై అయ్యన్న పాత్రుడుకు అభినందనలు తెలుపుతూ సిఎం చంద్రబాబు తొలి ప్రసంగం

అమరావతి :– శాసన సభ సాంప్రదాయాలను వికృత పోకడలతో గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి సభలో సమస్యలపై మాట్లాడటానికి మైక్ ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వలేదని…..దూషణలు, బూతులు, వెకిలి చేష్టలతో సభ విలువలను దెబ్బతీశారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సభలో దాడికి పాల్పడటంతో పాటు నీచంగా మాట్లాడి వ్యక్తిత్వం హననానికి పాల్పడ్డారిని ఆవేదన వ్యక్తం చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో నేడు ప్రజలు తమకు ఘన విజయం అందించడంతో పాటు పెద్ద బాధ్యత అప్పగించారని…ప్రత్యర్థి పార్టీలకు చెందిన శాసననభ సభ్యులను ఎగతాళి చేసి అవమాన పరచకూడదని సభలోని సభ్యులకు సూచించారు. శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడును చంద్రబాబు నాయుడు అభినందించారు. అనంతరం…స్పీకర్ స్థానం వరకూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ తో వెళ్లి అయ్యన్నపాత్రుడుని స్పీకర్ చైర్ లో కూర్చోబెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రసంగించారు.

బీసీ నేతను స్పీకర్ చూస్తుంటే సంతోషంగా ఉంది
‘‘తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ శాసనసభ్యులు, బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడటం సంతోషంగా ఉంది..గర్వంగా ఉంది. సభ్యులందరి ఆమోదంతో 16వ శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతున్నా. యువత రాజకీయాల్లోకి రావాలని నాడు ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుతో 23 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 7సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీగా, మంత్రిగా తెలుగురాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. ఏ పదవిచ్చినా దానికి వన్నె తెచ్చారు. నర్సిపట్నంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయనే పని చేస్తున్నారు. 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించారు. అయ్యన్న రాజీపడని నేత…విలక్షణ నేత. ఇప్పటికీ ఆయన ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారు. కరుడుకట్టిన పసుపు యోధుడిగా ఆయనకు పేరుంది. నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆయన పుణికిపుచ్చుకున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ అభివృద్ధికి కృషి చేశారు. కానీ అయ్యన్న పాత్రుడు తన రాజకీయ జీవితంలో ఏనాడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లు అనుభవించారు. ఆయన ఇంటిపై పోలీసులు దాడులు చేశారు…అక్రమంగా 23 కేసులు పెట్టారు. అయినా భయపడలేదు.’’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
అన్నట్లుగానే నేడు గౌరవ సభకు వచ్చాను.

‘‘చట్టసభలకు రావడం అరుదైన అవకాశం. ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయాలో గుర్తుపెట్టుకోవాలి. గెలిచి వచ్చిన మనందరిపై పవిత్రమైన బాధ్యత ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన సరిగా ఉండాలి. మనం మాట్లాడే విషయాలన్నీ రాష్ట్రమంతా చూస్తుంది. ఆనాడు మేము 23 మంది సభ్యులం…జనసేన, బీజేపీ సభ్యులు సభలో లేరు. ఇదే సభలో నేను కూడా ఎంతో బాధపడ్డాను. నన్నూ, నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే నిరసన వ్యక్తం చేసేందుకు మైక్ కూడా ఇవ్వలేదు. ఇది గౌరవ సభ కాదు..మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదని నేను చెప్పాను.

‘‘నేను స్టేట్ మెంట్ ఇవ్వాలనుకున్నా….మీరు మైక్ ఇవ్వలేదు… అయినా నాకు బాధలేదు. మళ్లీ చెపుతున్నా ముఖ్యమంత్రిగానే సభకు వస్తాను…ఇది కౌరవసభ…గౌరవ సభ కాదు…ఇలాంటి సభలో ఉండనని చెబుతున్నా…నా అవమానం ప్రజలు అర్ధం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని’’ అని చెప్పి 2022 నవంబర్ 19న సభ నుండి బయటకు వచ్చాను. ఇప్పుడు ప్రజలు, మీ అందరి ఆశీస్సులతో అసెంబ్లీలో సీఎంగా అడుగుపెట్టాను.’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఏ మహిళకూ అవమానం జరగనివ్వను
‘‘నేను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను…నాకొచ్చినన్ని అవకాశాలు తెలుగురాష్ట్రాల్లో ఎవరికీ రాలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను…15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. తిరుపతిలో నాపై బాంబు దాడి చేశారు…ఆరోజు కూడా నాకు కన్నీళ్లు రాలేదు. కానీ సభతో, రాజకీయాలతో సంబంధం లేని నా సతీమణిపై నీచంగా మాట్లాడారు. రాష్ట్రంలో గౌరవంగా బతికే ప్రతి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో నీచంగా పోస్టులు పెట్టారు. ఎంతో మంది ఆడబిడ్డలు ఆ బాధ తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

అలాంటి వ్యక్తులు, నేతలు, పార్టీ రాష్ట్రానికి అరిష్టమని ప్రజలు భావించి మమ్మల్ని గెలిపించారు. గతంలో నాకు, రాష్ట్రంలోని మహిళలకు జరిగిన అవమానం మరెవరికీ జరగనివ్వను. నా జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటాను. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై పుట్టి రుణం తీర్చుకుంటాను. ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్లు వచ్చి మొన్నటి ఎన్నికల్లో ఓటేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉపాథి కోసం వెళ్లిన పేదలు కూడా వచ్చి ఓటు వేశారు. ఏపీని కాపాడుకోవాలని ఎన్డీఏ ఇచ్చిన పిలుపుతో వచ్చారు. వారందరి రుణం తీర్చుకోవాలి. ఆ తరహా చర్చలకు, కార్యక్రమాలకు ఈ సభ వేదిక కావాలి’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రజలు ఇచ్చింది అధికారం కాదు…బాధ్యత
‘‘2019 ఎన్నికల్లో మాకు 23 సీట్లు వచ్చాయి…నాకు బాధేసింది. 2019లో 23వ తేదీన ఫలితాలు వస్తే…. 23 సీట్లు వచ్చాయని ఎగతాళి చేశారు. ఇప్పుడు కూటమికి 164 సీట్లొచ్చాయి….విడదీసి కూడితే 11 వస్తుంది. రాజధాని కోసం 1136 రోజులు అమరావతిలో ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ నెంబర్లు కలుపుకున్నా 11 వస్తుంది. నేడు వైసీపీ గెలిచింది 11 చోట్లమాత్రమే. పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఆయన పార్టీ అభ్యర్థులు 21 సీట్లలో పోటీ చేస్తే 21 గెలిచారు.

వై నాట్ 175 అన్నారు…ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఎక్కడ తగ్గాలో కాదు…ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది 16వ శాసనసభ…నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా 15వ సభ జరిగింది. జరిగిన పరిణామాలతో అది కౌరవ సభగా మనం భావించాం. 16వ సభను అత్యున్నత సభగా మనం నిర్వహించాలి. 24 గంటలూ మనం ప్రజలతో ఉండాలి. ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలి. ప్రజలు మనకు అధికారం ఇవ్వడం కాదు… రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ముఖ్యమైన బాధ్యత ఇచ్చారు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

రాజధాని కట్టాలి…పోలవరం పూర్తి చేయాలి
‘‘ప్రజా జీవితాన్ని మార్చే శక్తి ప్రభుత్వ విధానాలకు ఉంటుంది. ఆ విధానాలకు రూపకల్పన చేసేది మన చట్టసభలే. భారతదేశంలో పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆదర్శంగా తీసుకుని ఉమ్మడి ఏపీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. 25 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాల ప్రభావం మనకు కనపడుతోంది.

హైదరాబాద్ నగరం బెస్ట్ సిటీగా ఉందంటే మనం తీసుకున్న నిర్ణయాలే కారణం. నేడు భారత్ ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంది….మరో నాలుగైదేళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. 2047 వికసిత భారత్ మన కల కావాలి. అందుకు అగుణంగా సభలో చర్చలు, నిర్ణయాలు, పాలసీలు రావాలి. సభలో దూషణలు, వెకిలి చేష్టలు లేకుండా హుందాగా ముందుకుపోవాలి.

16 సభలు గమనిస్తే టంగుటూరి ప్రకాశం పంతులు, మెటూరి హనుమంతురావు, ఎంజీ రంగా, కాళేశ్వరరావు, కాసాని వెంకటరత్నం లాంటి వారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు..వారందరూ మనకు ఆదర్శం కావాలి. నేను కోరుకునేది ఒకటే…రాజ్యాంగస్పూర్తి నిలుస్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని, ఈ సభ హుందాగా నడుస్తుందని నమ్ముతున్నాను. మనం రాజధాని కట్టుకోవాలి…పోలవరం పూర్తిచేసుకోవాలి.

నదుల అనుసంధానం చేసుకోవాలి…పెట్టుబడులు రావాలి…యువతకు ఉద్యోగాలు రావాలి. బడుగులకు న్యాయం చేయాలి. ఈ లక్ష్యాల సాథన కోసం సభను సజావుగా నడిపించుకోవాలి. మీ ఆధ్వర్యంలో జరిగే సభ ద్వారా ఏపీ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండేందుకు, పేదరికం లేని రాష్ట్రంగా తయారుచేసేందుకు, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అడుగులు పడాలని, ఆ తరహా చర్చలు సాగానలి కోరుకుంటున్నాను. సభను సమర్థవంతంగా నడిపేందుకు మీకు దేవుడు శక్తిని ఇవ్వాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నాను’’ అని సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో అన్నారు

LEAVE A RESPONSE