ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా

– ఏ స్థాయి పోరాటానికైనా మేం సిద్ధం!
* ఇక వైసీపీతో బహిరంగ యుద్ధమే
* ఇప్పటి వరకు నా సహనమే మిమ్మల్ని కాపాడింది
* జనసేన శ్రేణులు పోరాటాలకు సిద్ధంగా ఉండండి
* అన్ని కులాలకు రాజకీయమే జనసేన అంతిమ లక్ష్యం
* వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా
* రంగా ని కాపాడుకోలేకపోయారు
* వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేద్దాం
* జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతుందని, ఆంధ్రప్రదేశ్ లో జనసేన జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మంచితనం, సహనాన్నే చూశారని, ఇక నుంచి యుద్ధమేనని వైసీపీ నాయకులను హెచ్చరించారు. ప్యాకేజీ స్టార్ అని మొరిగే ప్రతి వెధవకి ఒకటే చెబుతున్నాను.. ఇక నుంచి ఆ పదం పలికితే చెప్పుతో కొడతానని.. చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలతో మంగళవారం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ ఛైర్మన్ నాందెండ్ల మనోహర్ , పీఏసీ సభ్యులు నాగబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఇక మీతో యుద్ధమే.. మీ ఇష్టం ఎలాంటి పోరాటానికైనా నేను సిద్ధం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, బాధ్యతలతో యుద్ధం చేస్తాను. సభ్యత, సంస్కారం, మంచి, మర్యాద వైసీపీ నాయకులకు పనిచేయదు. బూతులు తిట్టే ప్రతి వైసీపీ నాయకుడికి ఇదే చెబుతున్నాను ఇక నుంచి నుంచోబెట్టి తోలు తీస్తాను. క్రిమినల్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు మీవి. మావి బలమైన సిద్ధాంతపరమైన రాజకీయాలు. వైసీపీ గూండా నాయకులను ఛాలెంజ్ చేస్తున్నాను.. ఎవరూ వస్తారో రండి. ఏ పద్ధతిలో యుద్ధం చేద్దామో చెప్పండి.

నేను కూడా గొడ్డుకారం తిని పెరిగిన వ్యక్తినే. వీధిబడిలో చదువుకున్న సగటు విద్యార్ధినే. మీకన్న దారుణమైన భాష మాట్లాడగలను. పోరాడగలను. మర్యాద నిలబెట్టుకునే వరకే అవకాశం ఇస్తాం. అది తప్పితే చొక్కా పట్టుకొని ఇళ్ల నుంచి బయటకు లాక్కొచ్చి మరి కొడతాం. పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంకండి. వైసీపీ నాయకులతో అవసరమైతే పాలసీల మీద చర్చించండి. వారు ఎలా సమాధానం చెబితే మీరు కూడా అదే విధంగా స్పందించండి. దీనిలో వెనక్కి తగ్గొద్దు. ఎలాంటి పోలీసు కేసులకైనా, దమనకాండలకైనా సిద్ధంగానే ఉన్నం. తేల్చుకుందాం రండి.

పార్టీ నిధులు ఇవి
స్కార్పియో వాహనం కొంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటూ వ్యాఖ్యానాలు చేశారు. గత ఎనిమిదేళ్ల కాలంలో మొత్తం 6 సినిమాలు చేశాను. రూ. 100 నుంచి రూ. 120 కోట్లు సంపాదించాను. జీఎస్టీ మినహాయించి ఆదాయపన్నును రూ. 33,37,04,701 లను ప్రభుత్వానికి చెల్లించాను. పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్న ఫిక్స్ డిపాజిట్ సొమ్ము బ్రేక్ చేసి పార్టీ కార్యాలయం పెట్టాను. 2021 – 22 సంవత్సరాల్లో రూ. 5 కోట్లను పార్టీ ఫండ్ గా ఇచ్చాను.

సైనిక బోర్డుకు, తెలంగాణ, ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్ల కు, ఇతర అవసరాలకు రూ. 12 కోట్ల మేర ఫండ్ గా ఇచ్చాను. రూ. 30 లక్షలు అయోధ్య రామాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చాను. 2014లో పార్టీpk1 స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీకి ఉన్న ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ. 17,58,06, 383 ల కార్పస్ ఫండ్ ఉంది. రైతు భరోసా కోసం రూ. 3,50,78,221ల విరాళాలు వచ్చాయి. అలాగే ఇటీవల నా పుట్టిన రోజు సందర్భంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమానికి రూ. 4,32,19,395 చొప్పున విరాళాలు అందాయి. ఇది మొత్తంగా పార్టీ ఆర్థిక బలం. ఒక స్కార్పియో వాహనం కొంటేనే వాళ్లు ఇచ్చారు.. వీళ్లు ఇచ్చారు అని ఏడ్చే వైసీపీ నాయకులకు ఇది నేను చెప్పే లెక్క.

వైసీపీ… ఎక్కువమంది నీచుల సమూహం
వైసీపీ పార్టీ ఎక్కువ మంది నీచుల సమూహం. అయితే ఆ పార్టీలోనూ మంచి నేతలు ఉన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి వంటి నేతలను ప్రత్యేకంగా గౌరవిస్తాను. యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటగా నాకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భీమ్ రావు బాడ కూల్చివేత అంశం ప్రభావితం చేసింది. బాధితులతో మాట్లాడుతున్నప్పుడు ఓ తల్లి చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించాయి. మూడు దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నామని, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలని కన్నీటి పర్యంతం అయ్యింది.

అంతే కాకుండా తన కూతురు స్నానం చేస్తుంటే చుట్టుపక్కల ఆకతాయిలు ఆసభ్యంగా చూస్తుంటే వాళ్లను ఎలా ఎదుర్కొవాలని ఆ తల్లి వేసిన ప్రశ్న నన్ను కుదురుగా కూర్చోనియలేదు. ఆ ఆవేదనతోనే అప్పట్లో కాంగ్రెస్ నాయకులను పంచెలు ఊడదీసి తరిమికొట్టాలని చెప్పాను. అయితే జనసేన పోరాట యాత్ర సమయంలో గోదావరి జిల్లాకు చెందిన నాకు ఇష్టమైన ఒక కాంగ్రెస్ నాయకుడు ఆ మాటను గుర్తు చేసి, పంచెలు కట్టుకున్నప్పుడల్లా నువ్వన్న మాట గుర్తుకొస్తుందని చెప్పినప్పుడు పశ్చాత్తాప పడ్డాను. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న నాయకుడే ఆ రోజు భీమ్ రావు బాడ నిరసనలో పాల్గొని వచ్చి, మనం చేయాల్సింది చేశాం అని చేతులు దులుపుకోవడం నాకు ఇప్పటికీ గుర్తే. కానీ బాధితులకు న్యాయం జరిగే వరకు నా వేదన తీరలేదు.

అధికారం అన్ని కులాలకు ఉండాలి
జనసేన పార్టీకి బలం, పోరాటపటిమ గల కార్యకర్తల సమూహం ఉంది. అయితే ఎన్నికల నిర్వహణ ఎలా అన్నదానిపై చాలా మందికి అవగాహన లేదు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడటం అంటే యుద్ధం చేయడమే. దానిని మనం పూర్తి స్థాయిలో నేర్చుకొని చైతన్యవంతులం కావాలి. అధికారం కేవలం రెండు కులాల వద్ద ఉండిపోతుంది అంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు. మా పార్టీలో అన్ని కులాల నాయకులు ఉన్నారు.

నాకు కులం లేదు. ఇప్పటి వరకు అధికారం చూడని అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి వారికి తగిన అధికారం అప్పగించాలనేది నా ఆకాంక్ష. ఒక కులం ఎదగాలంటే… ఎదిగిన కులాలను తొక్కేయాలని కాదు. మనం ఎదగాలని అర్ధం. అణగదొక్కిన కులాల అధికారం కోసం నా జీవితంపణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఇష్టమైన వ్యక్తి విశాఖ కు చెందిన ప్రొఫెసర్ కె.చలం గారు బహూకరించిన రామ్ మనోహర్ లోహియా రాసిన క్యాస్ట్ సిస్టమ్ పుస్తకం ఉద్దేశం ఇదే. ఒకరికి ఇబ్బంది కాకుండా నీ ఎదుగుదల ముందుకు తీసుకెళ్లాలి.

రంగా ని ఎందుకు కాపాడుకోలేకపోయారు?
కాపు కులానికి చెందిన నాయకులు మేము పెద్ద సమూహమని, మాకు తిరుగులేదని ఏవోవో మాటలు చెబుతారు. కాపులకు ఇప్పటి వరకు అధికారం కోసం ఏం చేశారో ఎందుకు చెప్పరు. రంగా బతికుండగా ఆయన సభలకు లక్షలాది మంది వచ్చేవారని చెబుతారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడకు జనం తండోపతండాలుగా వచ్చేవారని ఇప్పటికీ అంటారు. రంగా తనకు రాజ్యంతో ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు ఆయనను ఎందుకు రక్షించుకోలేకపోయారు. ప్రతి గ్రామం నుంచి పది మంది చొప్పున కీలక సమయంలో ఆయన వెంట ఎందుకు ఉండలేకపోయారు?

కాపు కులాన్ని కించపరుస్తూ మాట్లాడే వైసీపీ కాపు ఎమ్మెల్యేలకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాను.. మీరు కావాలంటే ఊడిగం చేసుకోండి. కులాన్ని అవహేళన చేస్తూ మాట్లాడితే మాత్రం సహించేది లేదు. వైసీపీలోని బంతి, కొట్టు, సన్నాసి అనే ముగ్గురు కాపు నేతలకు ఇదే చెబుతున్నాను. కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా. బంతిపూబంతి నన్ను సోదరుడు అంటారు. ఎవరూ మీకు సోదరుడు..? కొట్టు నువ్వు కావాలంటే నీ కొట్లో కూర్చొ.. రాజకీయం నాకు తెలియదని నీకు ఎవరు చెప్పారు. ఎప్పుడు ఎలాంటి రాజకీయం చేయాలో నాకు బాగా తెలుసు.

వెధవ వాగుడు వాగే కాపు వైసీపీ ఎమ్మెల్యేలకు స్వయంగా చెబుతున్నాను. మీ నాయకుడి అడుగులకు మడుగులు ఎత్తుకోండి. కులాన్ని మాత్రం కించపరచొద్దు. కాపుల గొప్పతనం తెలియాలంటే గాజుల లక్ష్మీనరసు చెట్టి గారి జీవితం గురించిన పుస్తకం చదివితే కాపుల గొప్పతనం తెలుస్తుంది. జ్యోతిరావు పూలె రాసిన గులాం గిరి పుస్తకం చదివితే కులం గొప్పతనం తెలుస్తుంది. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదివితే రాజకీయ జ్ఞానం వస్తుంది. పల్నాటి బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకోండి. కన్నమనీయుడు అనే మాల కులం వీరుడిని సేనాని చేశారు. అనపాతు అనే బ్రాహ్మణ వ్యక్తిని సేనాని చేశారు. అన్ని కులాలను చేరదీసిన బ్రహ్మనాయుడు చరిత్ర తెలుసుకుంటే త్యాగాలు వారి గొప్పతనం తెలుస్తుంది.

రాయలసీమ వెనుకబాటుకు కారణం ఎవరు?
మాట్లాడితే రాయలసీమ వెనుకబడింది అని చెబుతారు. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే వచ్చారు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాయలసీమకు ఇతర జిల్లాల నుంచి కనీసం ఎవరినీ రాకుండా చేసిన ఘనత అక్కడి నాయకులదే. రాయలసీమను బూచిగా చూపి అక్కడికి వెళ్లకూడదు అనేలా చేసిన చరిత్ర నాయకులదే. 19వ శతాబ్ధంలో సీమాంధ్ర సమాజం అనే బుక్ చదివితే రాయలసీమ గొప్పతనం అర్ధమవుతుంది.

విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా నేను చూస్తా
దేశమంతటికీ 1947లో స్వాంతంత్ర్యం వస్తే తెలంగాణకు మాత్రం 1948లో వచ్చింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం వెనుకబడింది అనే భావన నుంచి పుట్టిన తెలంగాణ ఉద్యమం శ్రీకాంత చారితో సహా వెయ్యి మంది బలిదానాల నుంచి పుట్టిన రాష్ట్రం తెలంగాణ. అక్కడి ప్రజల్లో పోరాట స్ఫూర్తి, చైతన్యం ఎక్కువ. అలాంటి గొప్ప పోరాటం, చైతన్యం మనకెందుకు లేదు. విశాఖకు గుండె కాయ లాంటి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే మీకు ఎందుకు గుండె మండదు. యువతరం ఎందుకు ప్రశ్నించదు.
ఇక్కడి రాజకీయ నాయకులకు ఉక్కు పరిశ్రమ ఎలా సాధించుకున్నామో? ఎన్ని బలిదానాలు దాని వెనుకpk2 ఉన్నాయో చెప్పే తీరిక, అవగాహన లేదు. 32 మంది బలిదానాల కారణంగా విశాఖ ఉక్కు సాధ్యమైంది. ఇప్పుడు యువతకు దీని గురించి చెప్పేవారెవరు? బూతులు తిట్టడం తప్పితే వైసీపీ సన్నాసులకు ఏం తెలుసు. జిందాల్ స్టీల్ కు మైన్స్ ఉండగా విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు తీసుకురాలేకపోయారు? అసలు దీని వెనక ఉన్న మతలబు ఏంటి? విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాటం విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాను. నన్ను నమ్మండి కచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కాకుండా చూస్తాను. కాకపోతే మీరు ఇళ్లలో ఉండి ఉద్యమం చేయాలంటే కుదరదు. అంతా రండి కలిసికట్టుగా పోరాటం చేద్దాం. భయం వీడండి. వల్లభాయ్ పటేల్ తరువాత అంతటి బలమైన దేశ హోం మంత్రి అమిత్ షా తో నేను మాట్లాడాను. మీకెందుకు భయం. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం తెలుసు మీకు ఉత్తరాంధ్ర గురించి..? తప్పెట గుళ్లు మూలాలు తెలుసా? కోరాపుట్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగారా? ఉద్దానం సమస్యపై అవగాహన ఉందా?

మన మూలల నుంచి కులాలను తీసేయలేం
భారతదేశ మూలల నుంచి కులాలను తీసేయలేం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పినట్లు కుల నిర్మూలన జరగాలంటే ముందుగా కులాన్ని అర్ధం చేసుకోవాలి. జానీ సినిమాలో దళిత యువకుడు కథతో సగర్వంగా సినిమా తీశాం. నా రాజు గాకుర అన్నియా అంటూ మన సమాజ పరిస్థితులు చెప్పాం. ఇస్లాంను నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. నా రక్షణగా ఉండి నిత్యం కాపాడే సెక్యూరిటీ గార్డులు అందరూ ముస్లిం సోదరులే. నేను బీజేపీతో ఉంటే ముస్లీం సోదరులను పట్టించుకోనట్లు కాదు. కేంద్రంలో ఉండే పార్టీలతో సఖ్యతగా ఉండటం మంచిదే. ముస్లిం సోదరులు నన్ను నమ్మండి. మీ వక్ఫ్ భూములు దోచేసేవాడికి కాదు. మీకు అండగా ఉండేవాడిని. బీఎస్పీలాంటి పార్టీలు సైతం ఒక కులం కోసం ప్రారంభమై అందరిని కలుపుకొని పోయాయి.

జనసేన కూడా అదే బ్యాలెన్స్ పాటిస్తుంది. పెద్దలు ఉండవల్లి ఏదో ఇంటర్వ్యూ లో ఇంతమంది అభిమాన గణం ఉండి బీజేపీని రోడ్డు మ్యాప్ అడగడం ఏంటి అని అన్నారు. మోదీ అంటే అపారమైన అభిమానం ఉంది. బీజేపీతో ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయాం. దీనికోసమే బీజేపీ విజన్ బట్టి రోడ్డు మ్యాప్ అడిగాం. ప్రధాని అన్నా, బీజేపీ అన్న మాకు గౌరవం ఉంది. కానీ వారికి పూర్తిస్థాయిలో లొంగిపోయి ఊడిగం మాత్రం చేయం.

చావోరేవో తేల్చుకుంటాం
విశాఖ ఘటనలు వివరించేందుకు గవర్నర్ వద్దకు మా బృందాన్ని పంపిస్తాం. వ్యక్తిగత విషయాలు వచ్చిన ప్రతిసారి మా భారతమ్మ ని అనేశారు అని వైసీపీ కార్యకర్తలు అంటారు. నాకు జన్మనిచ్చిన తల్లిpk3 అంజనాదేవిని ఇష్టానుసారం తిట్టించారు. దానికి నేను ఎంత వేదన అనుభవించానో మీకేం తెలుసు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తెలంగాణకు అవసరం. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేద్దాం. 7 నుంచి 14 స్థానాల్లోనా? రెండు ఎంపీ స్థానాల్లోనా ? అనేది నిర్ణయించి చెప్పండి. కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడదాం. చావోరేవో అనే రాజకీయాల్లోకి వచ్చాం. సినిమాలు చేస్తా.

బతకడానికి మనకి అదే ఉంది. సినిమాలు చేస్తున్నారు అని అనే వాళ్లకు చెప్పండి మీరు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తున్నారు అని అడగండి. సైద్ధాంతిక బలంతో మనం కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది చూపిద్దాం. పోలీస్ శాఖ అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. వారు కూడా గుర్తించుకోవాలి. భవిష్యత్తులో మా ప్రభుత్వంలోనే పనిచేయాలని గుర్తించుకుంటే మంచింది. జనసేన నాయకులు శ్రేణులు యుద్ధానికి సంసిద్ధం కండి” అని పిలుపునిచ్చారు.

Leave a Reply