ఆంధ్రప్రదేశ్‌ ను మరోసారి విడగొడతామంటే తోలుతీసి విరగ్గొడతాం

ఆంధ్రప్రదేశ్‌ ను మరోసారి విడగొడతామంటే తోలుతీసి విరగ్గొడతానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. మంగళగిరిలో జరిగిన జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేనాని పాల్గొని జగన్ సర్కార్‌ పై నిప్పులు చెరిగారు. ‘‘వేర్పాటు వాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే నాలాంటి తీవ్రవాదిని ఇంకొకరిని చూడరు. ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం.

ఏమయ్యా ధర్మాన.. నీకు మంత్రి ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం కావాలా? ధర్మాన.. బైరెడ్డి ప్రత్యేక రాష్ట్రాలు అంటే సరిపోతుందా? రాయలసీమ అనే వాళ్లు ఎందుకు అక్కడ అభివృద్ధి చేయలేదు. ముఖ్యమంత్రులందరూ రాయలసీమ నుంచి వచ్చే కదా పాలించారు? ప్రధానిని కలిస్తే ఈసారి సజ్జల, వైసీపీ నేతలపై ఫిర్యాదు చేస్తా. మంత్రి ఇల్లు తగులపెట్టించుకున్నా సీఎం వెళ్లలేదు. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకు ఇవ్వమనడం ఏమిటి?.’’ అని పవన్ ప్రశ్నించారు.

‘‘ప్రజల కోసమే జనసేన కార్యాలయం. ప్రజలకు ఏ సమస్య ఉన్నా జనసేన ఆఫీస్‌కు రావచ్చు. వారాహిని రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. అడ్డుకుంటాం, అనుమతివ్వం అని మాట్లాడారు. నేను కోడి కత్తితో పొడిపించుకుని రాలేదు. చట్ట ప్రకారం వారాహికి అన్ని అనుమతులు తీసుకున్నా. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో సహా వేల కోట్లు కాజేశారు. దోచుకున్న మీరే ఇలా ఉంటే.. నిజాయితీగా ఉన్న మాకెంత ఉండాలి?. ప్రజల కోసం త్వరలోనే వారాహి యాత్ర చేపడతా. ప్రజాస్వామ్యం అనేది సజ్జల సొంతం కాదు.. జగన్ సొంతం కాదు. కులాల మధ్య అంతరాన్ని కొంతమంది పెంచి పోషిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించారు. వైసీపీది దేశీయ దొరతనం. నేను చట్టాలను గౌరవిస్తా.’’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.

Leave a Reply