జనసేన అధినేత పవన్ కళ్యాణ్
• ఆసుపత్రులు మెరుగుపరచరుగానీ రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట
• బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి
విశాఖపట్నం కె.జి.హెచ్.లో మృతి చెందిన నవజాత శిశువును స్వస్థలానికి చేర్చేందుకు అంబులెన్స్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టడంతో- ఆ బిడ్డ తల్లితండ్రులు 120 కి.మీ. చిన్నపాటి ద్విచక్ర వాహనం మీద మృతదేహాన్ని తీసుకువెళ్లడం తీవ్ర ఆవేదన కలిగించింది. పాడేరు ప్రాంతం ముంచింగుపుట్టు మాండ్లమ్ కుమడ గ్రామానికి చెందిన శ్రీమతి మహేశ్వరి, శ్రీ కొండబాబు దంపతులు పుట్టెడు శోకాన్ని దిగమింగుకొని ఆ శిశువు మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది. పాషాణ ప్రభుత్వంలో మాత్రం స్పందన ఉండదు. కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయం. ఆస్పత్రుల నిర్వహణ, ప్రజారోగ్యంపై పాలకులు ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బిడ్డ మృతదేహంతో 120కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి.
ఈ తరహా ఘటన మన రాష్ట్రంలో మొదటిది కాదు. కొద్ది నెలల కిందటే తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి బిడ్డ మృతదేహాన్ని తరలించేందుకు ఓ తండ్రిపడ్డ ఆవేదనను రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు. మచిలీపట్నం సముద్ర తీరంలో ఓ బాలుడు చనిపోతే ఆ బిడ్డ మృతదేహాన్ని బంధువులు బైక్ మీద తీసుకువెళ్లారు. ఆసుపత్రుల్లో ఉన్న మహాప్రస్థానం వాహనాల పథకం ఏమైంది? మహాప్రస్థానం వాహనాలే కాదు, అంబులెన్సుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండటం లేదు. బెంజి సర్కిల్లో అంబులెన్సులు నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదు. వైద్య ఆరోగ్య శాఖకు రూ.14 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చామని చెబితే సరిపోదు. ప్రజలకు సేవలు అందాలి. ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు కల్పించలేని పాలకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే- విశాఖలో రాజధాని అభివృద్ధి చేస్తాం.. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారు.