Suryaa.co.in

Andhra Pradesh

మదనపల్లి ఫైళ్ల దహనంలో పెద్దిరెడ్డి అనుచరుల హస్తం!

– నిజాల్ని చెరపలేరు
– సీఐడీ దర్యాప్తు పూర్తికాగనే చర్యలు
– సీబీఐ దర్యాప్తులో విశాఖ ఓడరేవుకు కంటైనర్ల ద్వారా డ్రగ్స్ కేసు
– హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి

అమరావతి: మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సబ్ కలెక్టక్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లను దగ్ధం చేసిన కేసులో ఇప్పటికే ఆర్డీవో మురళీ, కొత్త ఆర్డీవో హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌పై ప్రాథమిక విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. శాసన మండలిలో ఎంఎల్సీలు తిరుమలనాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్ బాబు అడిగిన ప్రశ్నకు హోంమంత్రి బదులిచ్చారు.

ఇప్పటికే జూనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్ సహా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులైన పీఏ తుకారం, మాధవ్ రెడ్డి తదితరులను ఏ1,ఏ2,ఏ3గా పేర్కొంటూ విచారణ జరుగుతుందన్నారు. పాత ఆర్డీవో మురళీ నేతృత్వంలో అసైన్డ్ ల్యాండ్ 79,107 ఎకరాలను ఫ్రీ హోల్డ్ కింద 22ఏ రికార్డుల నుంచి బయటకి విడుదల చేసినట్టు తెలిపారు. సబ్ కలెక్టర్ స్థాయిలో పునర్విచారణ నేపథ్యంలో 22,523 ఎకరాల భూమి విషయంలో నిబంధనలు అతిక్రమించినట్టు తేలిందన్నారు. దీనిపై ప్రాథమిక నివేదిక వచ్చిందని అధికారిక నివేదిక కూడా రావాల్సి ఉందన్నారు.

అగ్ని ప్రమాదం వెనుక దాగి ఉన్న అసలు కుట్రలను కూటమి ప్రభుత్వం బయటపెట్టిందన్నారు. అక్రమంగా భూమిని ఆక్రమించాలనుకుని నిబంధనలను అతిక్రమించిన పెద్దిరెడ్డి అండ్ కో కుట్ర వల్లే అగ్నిప్రమాదం జరిగిందన్నారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీస్ లో ఫైళ్లను దగ్ధం చేయగలరేమోగానీ నిజాల్ని చెరపలేరని హోంమంత్రి అన్నారు. తప్పు చేసిన వారిని, అందుకు సహకరించిన వారిని వదలబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పేర్కొన్నారు.

2024లో విశాఖపట్నం ఓడరేవుకు కంటైనర్ల ద్వారా భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు రావడంపై ఎంఎల్‌సీలు డాక్టర్ కుంభ రవిబాబు, వరుదు కల్యాణి, చంద్రగిరి యేసురత్నం శాసనమండలిలో ప్రశ్నించారు. విశాఖపట్నం ఓడరేవుకు కంటైనర్ల ద్వారా భారీమొత్తంలో మాదకద్రవ్యాలు దొరికిన కేసు కూడా సీబీఐ పరిధిలో ఉందని హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు.

LEAVE A RESPONSE