Suryaa.co.in

Andhra Pradesh

ఇళ్ల దగ్గరే పింఛన్లు పంపిణీ చేయాలి

పల్నాడు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన జి.వి.ఆంజనేయులు

వైసీపీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలు మాని పింఛన్లు ఇంటికే పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇదే విషయంపై పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ సిబ్బంది ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినుకొండలో జరిగిన ముస్లీం మైనార్టీ, నూర్‌బాషాల ఆత్మీయ సమావేశం వేదిక నుంచే ఈ సమస్యపై కలెక్టర్‌కు ఫోన్‌ చేశారు. క్షేత్రస్థాయిలో 3, 4 గ్రామాలకు కలిపి ఒక చోటే సచివాలయం ఏర్పాటు చేశారని.. అలాంటి ప్రాంతాల్లో పింఛన్లు తీసుకో వడానికి లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే పింఛన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. త్వరితగతిన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా చూడాలన్నారు. దీనికి పల్నాడు జిల్లా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. గ్రామాల వారీగా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

LEAVE A RESPONSE