కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌పై ప్రజలకు నమ్మకం లేదు

-ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకు అప్పగించాలి
-గవర్నర్‌ను కలిసి విచారణ జరపాలని కోరతాం
-కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల నాటకాలు గమనిస్తున్నారు
-బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై టామ్‌ అండ్‌ జెర్రీ మాదిరిగా కొట్టుకుంటున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫైట్‌పై ప్రజలకు నమ్మకం లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డికి ఈ కేసుపై చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే అవినీతికి సంబంధించి బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ చాలా ఆరోపణలు చేసిందని.. అయినా దేనిపై కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పుడు కూడా ఎన్నికల కోసం ఇరుపార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని లక్ష్మణ్‌ మండిపడ్డారు. నరేంద్ర మోదీ పదేళ్ల పాలన, అభివృద్ధిపై చర్చ లేకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం, ధరణి, ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ లాంటి అంశాలతో ప్రతిరోజు పతాక శీర్షికలో వార్తలు వచ్చేలా రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి విచారణ జరిపేలా కోరుతామని తెలిపారు కాళేశ్వరం, ధరణి పోర్టల, డ్రగ్స్‌, మద్యం, విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి వ్యవహా రాల్లో అసలు దోషులను కాపాడే ప్రయత్నం రేవంత్‌ సర్కారు చేస్తోందన్నారు. కరీంగనర్‌ ప్రజలు గత పార్లమెంటు ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టారని అన్నారు. మోదీ అభివృద్ది ఎజెండాతోనే పార్లమెంటు ఎన్నికల్లో ముందుకు వెళతామని తెలిపారు. జై శ్రీరామ్‌ అనడం ఎవరి నమ్మకం వారిది.. జై శ్రీరామ్‌ అనడం వల్ల కేటీఆర్‌కు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవి, బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్‌ ఆచారి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply