Suryaa.co.in

Telangana

బకాయిల మోత.. స్కూళ్లు మూత

– ప్రజలు ‘ఫాలింగ్ తెలంగాణ’గా చెబుతున్నారు
– 600కి పైగా గురుకుల పాఠశాలలకు గత 10 నెలలుగా అద్దె చెల్లింపులు జరగలేదు
– 215 కోట్లు అద్దెలు బకాయి
– 63 గురుకులాల యజమానులు భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు
– దాదాపు 1800 ప్రభుత్వ పాఠశాలలు మూత
– ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు విద్యాపై చూపుతున్న శ్రద్ధ?
‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగాలి
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్

హైదరాబాద్: భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అనూహ్యమైన అభివృద్ధి సాధించింది. యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ 12వ స్థానం నుంచి 14వ స్థానానికి పడిపోయింది. కానీ నేడు మోదీజీ పాలనలో జపాన్‌ను దాటి, భారత్ నాలుగవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది.

మన ముందు ఉన్నవి కేవలం జర్మనీ, అమెరికా, చైనా మాత్రమే. అంచనాల ప్రకారం, రాబోయే రెండున్నర సంవత్సరాల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగాలి. దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యులు కావాలి.

2047 నాటికి, స్వాతంత్ర్యం వచ్చిన 100వ ఏడాదికి, భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలవాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం కేంద్రం బలమైన పునాది వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 — దేశం మొత్తానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. దీనిని మనం గుర్తు పెట్టుకోవాలి.

కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ అధికారం చేపట్టకముందు, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక, అవన్నీ నెరవేరుతాయని పదే పదే అన్నారు. కానీ ఇప్పుడు ఆ హామీలన్నీ అమలు చేయకుండా మోసంగా మారాయి. ఈ రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ మోసంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ‘రైజింగ్ తెలంగాణ’ అని ప్రచారం చేస్తుండగా, ప్రజలు మాత్రం ‘ఫాలింగ్ తెలంగాణ’గా చెబుతున్నారు.

రాష్ట్రంలో 600కి పైగా గురుకుల పాఠశాలలకు గత 10 నెలలుగా అద్దె చెల్లింపులు జరగలేదు. యజమానులు అద్దె రాకపోవడంతో పాఠశాల భవనాలకు తాళాలు వేసారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. విద్యార్థులకు, విద్యావ్యవస్థకు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించని ప్రభుత్వం, గురుకులాల భవనాల సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 660 గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటిలో 7 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 215 కోట్లు అద్దెలు బకాయిగా ఉంచింది. 63 గురుకులాల యజమానులు భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.

ఈ పరిస్థితుల్లో 7 లక్షల మంది విద్యార్థుల చదువు ప్రమాదంలో పడింది. తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదేనా రేవంత్ రెడ్డి సర్కారు విద్యాపై చూపుతున్న శ్రద్ధ? విద్యాశాఖ ఉద్యోగులు జీతాలు రాక ఆందోళనలో ఉన్నారు. జిల్లా విద్యాధికారులు, ఎడ్యుకేషన్ కమిషనర్ చుట్టూ తిరుగుతుంటే.. విద్యార్థులు ఎలా చదవగలుగుతారు?

ఇంకోవైపు, రాష్ట్రంలోని దాదాపు 1800 ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా, ఇటు తెలంగాణలో నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ వంటి మెరుగైన విద్యాసంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. కానీ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా వినియోగించుకోకుండా, ఉన్న పాఠశాలలనే మూసేస్తోంది.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో నియామకాలు సరిగ్గా లేవు, అధ్యాపకులు లేరు, విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇంజనీరింగ్ విద్య విషయంలో కూడా రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విద్యార్థులకు అందలేదు. ఈ కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డుమీదకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యూనివర్సిటీల్లో వేలాది అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలు జరుగలేదు. దీంతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదు. విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోంది.

ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి. మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించాలి.

LEAVE A RESPONSE