Suryaa.co.in

Telangana

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బిక్కు బిక్కుమంటున్న ప్రజలు

-తెలంగాణ తరహా ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడా లేవు
-ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం
-రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు
-దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం
-కాళేశ్వరం నీటితో కొడకండ్ల సస్యశ్యామలం
-డిసెంబర్ మొదటి వారంలో కొడకండ్ల మినీ టెక్స్ టైల్ పార్క్ కు కెటిఆర్ శంకుస్థాపన
-కొడకండ్ల, రామన్నగూడెం గ్రామాల్లో వానా కాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన -రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

కొడకండ్ల, రామన్నగూడెం (జనగామ జిల్లా), నవంబర్ 11: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు భిక్కు భిక్కుమంటున్నారు. మన ప్రభుత్వ పరిపాలనను చూసి, ఇక్కడి పథకాలను చూసి మేం తెలంగాణలో ఎందుకు లేమా? అని బాధ పడుతున్నారు. బిజెపి మాత్రం వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వలేని హామీలను, అమలు చేయలేని హామీలను ఇక్కడ ఇస్తున్నారు. ఎక్కడా నెరవేర్చలేని హామీలు మన రాష్ట్రంలో సాధ్యమేనా? ఇలాంటి హామీలు ఇచ్చే బోగస్ పార్టీలను నమ్ముదామా? అందుకే తెలంగాణ ప్రజలు మనుగోడులో తగని శాస్తి చేశారు.

అయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల, రామన్నగూడెం గ్రామాల్లో వానా కాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఆయా చోట్ల రైతులనుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ తరహా ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడా లేవు. మన పథకాలను కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, సాగునీరు రైతులకు అందించి, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా మన సిఎం కెసిఆర్ తీర్చిదిద్దారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి, వాటిని నిరసించిన రైతాంగాన్ని కాల్చి, గుర్రాలతో తొక్కించి ప్రభుత్వం.

ఇక ఇప్పుడు రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నది. మనం మన మోటార్లకు మీటర్లు పెట్టించుకుందామా? అని మంత్రి రైతులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కాదంటే, 3వేల కోట్లు ఖర్చు చేస్తూ, రైతుల నుంచి ఆఖరు గింజ వరకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణదని మంత్రి తెలిపారు.

కాళేశ్వరం నీటితో కొడకండ్ల సస్యశ్యామలం
కాళేశ్వరం నీటితో కొడకండ్లను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో రిజర్వాయర్ల పనులన్నీ పూర్తి చేస్తామని, దాంతో పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి అంగుళానికి మంచినీరు అందుతుందని తెలిపారు. తనను గెలిపిస్తూ వస్తున్న ప్రజల రుణం తీర్చుకుంటూ, సాగునీటితో ప్రజల పాదాలు కడుగుతానని మంత్రి తెలిపారు.

డిసెంబర్ మొదటి వారంలో కొడకండ్ల మినీ టెక్స్ టైల్ పార్క్ కు కెటిఆర్ శంకుస్థాపన
అలాగే కొడకండ్ల ప్రాంతంలో చేనేత రంగంలో అనేక మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, వారందరికీ శాశ్వత ప్రాతిపదికన ఉపాధి లభించే విధంగా మినీ టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నామని, త్వరలోనే డిసెంబర్ మొదటి వారంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా పార్క్ ని ప్రారంభింప చేయనున్నట్లు రైతులు, ప్రజల హర్షధ్వానాల మధ్య మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE