కంఠం ఆయనది…భావం చంద్రబాబుది

అంటే పూటకో సిద్ధాంతం, రోజుకో సిద్ధాంతం
ఇదేనా మీ రాజకీయం. సినిమా సినిమాకు డైలాగ్‌
సినిమాకో స్టేట్‌మెంట్‌ బాగుంటుంది
ఏం మాత్రం కట్టుబాట్లు లేకుండా మాట్లాడుతున్నారు
మొన్న, నిన్న ఏం మాట్లాడింది మర్చిపోతున్నారు
ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారు
పవన్‌కళ్యాణ్‌కు కనీసం ఆ ఆలోచన కూడా లేదు
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

సినిమా వేరు. రాజకీయం వేరు అని
ప్రజలకు స్వచ్ఛత కావాలి
మనసులో ఒకటి. కానీ పైకి మాట మరొకటి
అదే పవన్‌కళ్యాణ్‌ రాజకీయ జీవితం
ఇవాళ
అంతకు మించి సభలో మరేదైనా ఉందా?
ప్రెస్‌మీట్‌లో సూటిగా ప్రశ్నించిన మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో మంత్రి పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..:
మాకూ సంస్కారం ఉంది. అందుకే..: సంస్కారం ఉంది కాబట్టి అందరికీ నమస్కారం పెడుతున్నానని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. కాబట్టి, ఇప్పుడు నేను కూడా అందరికీ నమస్కారం పెడుతున్నాను. సోనియాగాంధీకి, ఇలాంటప్పుడు తిట్టే నాగబాబుకు, జనసేన కార్యకర్తలకూ నమస్కారం. వైయస్సార్‌సీపీ కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టినందుకు ఆయనకు మా నమస్కారం.

కానీ ఆయనకే లేదు:
అయితే తనకు సినీ జీవితం ఇచ్చిన, అన్నింటా అండగా నిల్చిన చిరంజీవిగారికి నమస్కారం ఆయన పెట్టలేదు ఈ విషయంలో మీ వైఖరి సరికాదు. తీగ లాంటి మీ జీవితానికి ఒక కర్రగా నిలబడిన, అండగా నిల్చిన చిరంజీవిగారికి మీరు నమస్కారం పెట్టలేదు. భవిష్యత్తులో అయినా ఆ పని చేస్తారని భావిస్తున్నాం.

చెప్పకనే చెప్పారు:
ఏతావాతా పెద్దలు పవన్‌కళ్యాణ్‌ చెప్పొచ్చేది ఏమిటంటే, తాను ఎప్పుడూ టీడీపీ బాగు కోరుకునేవాడినే అని. 2014 మార్చి 14. అంటే ఇదే రోజు 9 ఏళ్ల క్రితం తాను పార్టీ పెట్టానని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు. 2012లో తాను పార్టీ పెడతానంటే, చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. అలా చేస్తే జగన్‌గారు గెలుస్తారని కూడా చంద్రబాబు అన్నారు. అంటే వారి ఇద్దరి ఉద్దేశం జగన్‌గారు అధికారంలోకి రాకూడదని.

మరి అప్పుడు ఏమన్నారు?:
మరి 2019లో ఏం జరిగింది? ఇవాళ ఆయన ఏం చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చకుండా చేస్తానని. మరి 2019లో కూడా ప్రజలకు వ్యతిరేకంగా పాలించిన, దోచుకున్న టీడీపీ ప్రభుత్వం గురించి మీరు గుంటూరు సభలో ఎన్ని మాటలు మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడి దోపిడి గురించి ఎంత మాట్లాడారు. మరి ఆరోజు మీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని ఎందుకు అనుకోలేదు. ఎందుకంటే, అలా ఓట్లు చీలితేనే చంద్రబాబు గెలుస్తారని, ఆయనకు మేలు జరుగుతుందని మీరు భావించారు. కానీ ఇవాళ ఏం అనుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దు.

మరి ఇవాళ్టి లక్ష్యం ఏమిటి?:
కానీ ఇవాళ ఆయన లక్ష్యం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలను ఏకం చేద్దామని చెబుతున్నారు. చివరికి బీజేపీకి కూడా ఏం చె బుతున్నారు. ఈ రకమైన ఫార్ములానే వండి పట్టుకురండి. అందరం కలిసి భోజనం చేద్దామంటున్నారు. అంటే పవన్‌కళ్యాణ్‌ అంతిమ లక్ష్యం, రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా జగన్‌ని వ్యతిరేకించడమే. పైకి ఎన్ని మాటలు చెప్పినా జగన్‌ వ్యతిరేకతే సిద్ధాంతంగా పని చేస్తున్నారు.
14 ఏళ్ల క్రితం చిరంజీవి ప్రజారాజ్యం పెడితే, మీరు యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. రాజకీయాల్లో ఉన్నారు. ప్రశ్నించడమే మా హక్కు అని చెప్పారు. మరి 2014 నుంచి 2019 వరకు ఆ విధానం ఏమైంది? ప్రశ్నించడం అంటే కొత్త సూక్తులు చెబుతున్నారు. పద ప్రయోగం చేస్తున్నారు. అవి తప్పితే మీ సిద్ధాంతం ఏమీ మారలేదు. అది జగన్‌ని వ్యతిరేకించడమే.

దానిపై మీకే లైసెన్స్‌ ఉందా?:
మీరు ఒక మాట అన్నారు. మానసిక అత్యాచారం చేశామని అన్నారు. అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేస్తారా? అందులో మీరేమైనా స్పెషలిస్టా? అది చేయడానికి మీకు లైసెన్సు ఉందా? ఏం మాట్లాడారు ఇవాళ!
వెల్లుల్లిపాయో వెల్లంపల్లినా. అవంతి బంతి పూబంతి చామంతి. గోడకు కొడితే వెనక్కిరాని బంతి.
మెడలో బోర్డు వేసుకుని, మానసిక అత్యాచారం చేస్తారా? ఎవరిని పడితే వారిని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఆడా మగా తేడా లేకుండా విమర్శిస్తారా? అలా మానసిక అత్యాచారం చేయొచ్చు. కానీ మిమ్మల్ని ఏం అనకూడదు. లైసెన్సుడ్‌ పర్సన్‌ ఫర్‌ డూయింగ్‌ మానసిక అత్యాచారం. మీకు ఒక్కడికే ఆ పదం తెలుసు. ఇంకా ఎవరికీ తెలియదు.

మీ వల్ల ఎవరికి మేలు జరిగింది?:
దేశ, రాష్ట్ర ప్రయోజనాలు అని మాట్లాడారు. నేను ఒక్కటే అడుగుతున్నాను. మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా ప్రజల కోసం తీసుకున్నారా? మీ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా? చెప్పండి.
ఆరోజు కాంగ్రెస్‌ హఠావో. దేశ్‌ బచావో అన్నారు. బీజేపీని సమర్థించారు. టీడీపీకి ఓటు ఎందుకు వేయమన్నారు. దాని వల్ల ప్రజలకు ఏం మేలు జరిగింది? ఆ తర్వాత 2019 వరకు చంద్రబాబు ఏం మేలు చేశారో చెప్పండి.
మీరు అట్టహాసంగా ఉద్ధానం వెళ్లి వచ్చారు. చంద్రబాబును కలిశారు. మరి మీరు, చంద్రబాబు ఇద్దరూ ఏం ఉద్ధరించారు?
ఇవాళ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారు. చీకట్లో ఏం మాట్లాడినా చెల్లుతుందనుకున్నారా?
ఉండవల్లి, పెనుమాకలో మీరు ఉద్యమం చేశారా? రాంబాబుగారిని రాంబో అని మాట్లాడతారా. అంటే మీరు మానసిక అత్యాచారం చేయొచ్చా?

ఇదేం శునకానందం?
ఏదో మీరు కులంలో పెద్ద హీరో అనుకుని, రాంబాబుగారు అమాయకంగా పెళ్లికి పిల్చారు. ఇష్టం లేకపోతే రావొద్దు. కానీ ఇవాళ అలా విమర్శిస్తారా? ఆయన రాంబో అయితే, మీకు సినిమాకో పేరు ఉంటుంది? మిమ్మల్ని ఎలా పిలవాలి? మీకు ఇదేం శునకానందం.
మీరు ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటుంటే, అంబటి రాంబాబు వచ్చి మిమ్మల్ని పెళ్లికి పిల్చినట్లు, మీ దీక్షను భగ్నం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఏమిటి మీ భాష?

మీరు ఉద్యమం చేశారా?:
ఉండవల్లి, పెనుమాకలో రైతుల వెనక నిలబడి పోరాడింది ఎవరు. వారికి ధైర్యం ఇచ్చిందెవరు. అండగా నిలబడింది ఎవరు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదా.
మరి మీరేం చేశారు? ఒకరోజు విహారయాత్రలా వచ్చి, ఎవరి చేతిలోని బాక్స్‌ తీసుకుని, అందులోని పెరుగన్నం తిని ఏదో మాట్లాడి, అక్కణ్నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్లి, అంతా బాగా చేస్తున్నారని చెప్పి, హైదరాబాద్‌ వెళ్లి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ పోరాటం చేసిందెవ్వరు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్‌ కాదా? అంటే ప్రజలు అన్నీ మర్చిపోయారనుకున్నారా?

ఆరోజు ఏమేం మాట్లాడారు?
మీరు ఏం చెప్పారు. ఐవైఆర్‌ కృష్ణారావు బుక్‌ విడుదల చేసినప్పుడు ఏం చెప్పారు. ఇది ఒక కుల రాజధాని. అందరి రాజధాని కాదన్నారు. అలాగే కర్నూలు వెళ్లి ఏం మాట్లాడారు. అది (అమరావతి) ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకున్న రాజధాని మాత్రమే అని అనలేదా? జనసేన దృష్టిలో కర్నూలే రాజధాని అని ఆరోజు మాట్లాడిన మీరు ఇవాళ ఏం అంటున్నారు.

పూటకో సిద్ధాంతం:
అంటే పూటకో సిద్ధాంతం, రోజుకో సిద్ధాంతం. ఇదేనా మీ రాజకీయం. సినిమా సినిమాకు డైలాగ్‌. సినిమాకో స్టేట్‌మెంట్‌ బాగుంటుంది. అసలు భీమ్లానాయక్‌ ప్రిరిలీజ్‌ ఫంక్షన్‌కు, ఇవాళ్టికి తేడా ఏం కనబడింది. అక్కడా సినిమావాళ్లు రాసిన డైలాగ్‌లు చదివారు. ఇక్కడా సినిమా వాళ్లు రాసిన డైలాగ్‌లు చదివి వెళ్లిపోయారు.
ఏం మాత్రం కట్టుబాట్లు లేకుండా.. మొన్న ఏం మాట్లాడాం. నిన్న ఏం మాట్లాడాం. ప్రజలు అన్నీ గుర్తుంచుకుంటారు అన్న కనీస ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇది చాలా అన్యాయం. మీ మాదిరిగా సిద్ధాంతాలు, లక్షల పుస్తకాలు చదివినటువంటి వారు ఈ రకంగా ప్రవర్తించడం ధర్మం కాదు.

ఇవన్నీ కనిపించడం లేదా?:
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని చెబుతారు. అప్పులు పెరిగాయని అంటారు. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లాయో తెలియదంటారు. ఇది పచ్చి దగా కాదా? మిమ్మల్ని మీరు వంచించుకోవడం కాదా? ఈ మూడేళ్లలో దాదాపు లక్షా 35 వేల కోట్లు నేరుగా ఒక్కపైసా లంచానికి తావు లేకుండా ప్రజల ఖాతాల్లో జమ చేయలేదా? మీకు లెక్కలు రాసిచ్చిన వారికి తెలియదా?

కరోనా కల్లోలంలో తిరుపతిలో తప్ప ఎక్కడా, ఒక్క వైరస్‌ ల్యాబ్‌ కూడా లేకపోతే, ఏ స్థాయిలో వాటిని ఏర్పాటు చేశామో తెలియడం లేదా? కరోనా సంక్షోభంలో ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడింది మీరు చూడలేదా? ఆ సమయంలో సామాన్య, నిరుపేద ప్రజలను ఆదుకోవడం కోసం రూ.45 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో వేస్తే, మీకు లెక్క తెలియడం లేదా?

నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చడం మీకు కనిపించడం లేదా? చివరకు చంద్రబాబు చదువుకున్న స్కూల్‌ను, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ జగన్‌గారు నాడు–నేడులో ఆ స్కూల్‌ రూపురేఖలు పూర్తిగా మార్చేశారు. ఇదంతా మీకు కనిపించడం లేదా? 15వేలకు పైగా స్కూళ్లను నాడు–నేడు తొలిదశలో పూర్తిగా మారుస్తున్న విషయం వాస్తవం కాదా?
బైలింగ్వుల్‌లో పుస్తకాలు ముద్రిస్తున్న విషయం కాదా? పేదల పిల్లలకు యూనిఫామ్‌తో సహా, అన్నీ ఫ్రీగా ఇస్తున్న విషయం తెలియదా? అందుకోసం చేస్తున్న ఖర్చు కనిపించడం లేదా? వేల కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు వేల కోట్ల ఖర్చులతో మారుస్తున్న పనులు కనిపించడం లేదా?

బీజేపిని ఎందుకు ప్రశ్నించరు?:
అమరావతిని మీరూ అంగీకరించారు. ఆనాడు ఒప్పుకున్న మీరు ఇవాళ ఎందుకు విభేదిస్తున్నారు అని మమ్మల్ని అన్నారు కదా. మరి మీరు రోజూ ఎవరి చంక ఎక్కి తిరుగుతున్నారు. మరి ఆ బీజేపీ వాళ్లు, ఆనాడు పార్లమెంటులో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వరని అడగరా? ఢిల్లీలో చొక్కా పట్టుకుని అడగలేరా? ఢిల్లీలో మీరు మాట్లాడలేరా? కేవలం ఇప్పటంలో మాత్రమే మాట్లాడతారా?

విశాఖలో రైల్వే జోన్‌ ఇస్తామని మోదీ చెప్పారు. మరి ఇప్పుడు ఆ పని చేయడం లేదని ఎందుకు అడగడం లేదు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కడతామని బీజేపీ మాట తప్పింది. అయినా ఎందుకు అడగడం లేదు.
అంటే ఇప్పటంలో ఒక మాట. ఢిల్లీలో మరోమాట. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేయవద్దని ఎందుకు నిలదీయడం లేదు. రాజకీయాల్లో ఎటు నుంచి ఎటు వెళ్లాలో బీజేపీనే చెప్పాలని అడుగుతున్నారు కదా? మరి ఎందుకు ఇవన్నీ అడగడం లేదు.

ఊసరవెల్లి రాజకీయం:
అక్కడ గదుల్లో ఒకమాట. ఇక్కడ రోడ్డు మీద మరోమాట. ఎక్కడ నేర్చుకున్నారీ ఊసరవెల్లి రాజకీయాలు. నిజానికి ఆ సినిమా పేరు మీ సినిమాకు ఎందుకు పెట్టుకోలేదు. మీరు రాజకీయ ఊసరవెల్లిలా మారారు. మీకు అర్ధం కావడం లేదా? ఎంతసేపూ చంద్రబాబు ప్రయోజనాలే మీ లక్ష్యం. ఇవాళ కూడా అదే చెప్పారు.

కంఠం మీది. భావం టీడీపీది:
అధికార మదంతో ఉన్న వారి కొమ్ములు కూల్చేస్తామని, సినిమా డైలాగ్‌లు చెప్పావు. మీకు ముందు నుంచి చెబుతున్నాం. సినిమా వేరు. రాజకీయం వేరు అని. ప్రజలకు స్వచ్ఛత కావాలని. మనసులో ఒకటి. పైకి మాట మరొకటి. ఇవాళ కంఠం మీది. భావం చంద్రబాబుది. అంతకు మించి మరేదైనా ఉందా?
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాపాలు ఒక్కటి కూడా కనిపించలేదు? ఈ మూడేళ్లలో చంద్రబాబు చేసిన తప్పులు, పాపాలు కూడా కనిపించలేదు?.
హోదా ఇస్తానని మాట తప్పిన బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని, మాట తప్పిన మోదీ ని ఒక్క మాట కూడా అనలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటామని అప్పుడెప్పుడో చెప్పావు. కానీ ఏమైంది. ఆ విషయంలో కనీసం కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనలేదు. చివరకు చంద్రబాబునూ ఒక్క మాట అనలేదు.
కడప స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం, రామయ్యపట్నం పోర్టు కడతామన్నారు. ఏమైంది. కానీ వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తొడలు కొట్టే అలవాటు వైయస్సార్‌సీపీకి లేదు. ఆ అలవాటు మీకు, టీడీపీకి ఉంది.

మీ లక్ష్యం అదే కదా?:
ఆయన లక్ష్యం ఒక్కటే. అది ఏమిటంటే, చంద్రబాబును మళ్లీ పదవిలోకి తేవడం. జనసేన ప్రభుత్వం స్థాపిస్తామంటున్నారు. మీరు అధికారంలోకి రావాలంటే కనీసం 90 సీట్లలో అయినా పోటీ చేయాలి కదా? అన్ని పార్టీల కూటమిలో మీకు అన్ని సీట్లు రావడం సాధ్యమేనా? మీది పంచకూల కషాయం. ఇన్ని వికృత పార్టీల ఏకైక లక్ష్యం. ప్రజలకు మేలు చేయడం కంటే, జగన్‌గారిని ద్వేషించడం. చేతబడి పూజారులంతా ఒకచోట చేరాలన్న లక్ష్యంతో మీటింగ్‌ పెట్టుకోవడం తప్ప, మరేదైనా ఉందా?

ఎందుకీ విమర్శలు:
సుబ్బారెడ్డి ఒక కులాన్ని ద్వేషిస్తున్నారని పవన్‌ అన్నారు. ఆయన ఒక కులాన్ని వర్గశతృవులా భావిస్తున్నారని అన్నాడు. ఎవరు చెప్పారు ఆ విషయాన్ని. ఇవాళ వైయస్సార్‌సీపీలో ఎందరు కమ్మ నాయకులు ఉన్నారు.
మిమ్మల్ని, చంద్రబాబుకు ఒకటే ప్రశ్నిస్తున్నాం. వైయస్సార్‌సీపీకి కమ్మ కులస్తులను వ్యతిరేకం చేస్తున్నారు?.

ఇదీ వాస్తవం:
జనసేన కార్యకర్తలకు మరోసారి నమస్కారం. మీ భుజాలపై కమ్మవారిని మోయిస్తున్నారు. అదే జరగబోతుంది. ఇంతాచేసి ఇవాళ మీటింగ్‌ అర్థం ఏమిటంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. కానీ ఈసారి అయినా ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలని పవన్‌ తహతహలాడుతున్నాడు.
ఒక్కటే స్పష్టం చేస్తున్నాం. ఎంత మంది ఒక్కటై వచ్చినా, జగన్‌గారు ఒంటరిగా ఎదుర్కొంటారు. ముందు నుంచి ఆయనది ఒంటరి పోరాటమే. పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఏ గుర్తుకు ఓటు వేయమంటారో కార్యకర్తలకు తెలియడం లేదు. మొన్న కమలం, ఆ తర్వాత సైకిల్‌ గుర్తుకు, ఆ తర్వాత సుత్తి, కంకి కొడవళ్లకు ఓటు వేయమన్నాడు.
దీంతో జనసేన కార్యకర్తలు అర్ధం కాకుండా జుట్టు పీక్కుంటున్నారు.

ఆ పని చేసింది మీరు:
న్యాయవ్యవస్థ గురించి అన్యాయమైన మాటలు. వైయస్సార్‌సీపీ నేతలు జడ్జీలను తిట్టినట్లు మాట్లాడారు. తమిళనాడుకు చెందిన ఒక రిటైర్డ్‌ జడ్జీ చంద్రుడు, వాస్తవాలు మాట్లాడితే టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా, ఎన్ని తిట్టారో మీకు కనపడదా పవన్‌.
కళ్లకు గంతలు కట్టుకున్నారా? మీకు గాంధారికి తేడా లేదా?
సింగిల్‌గా పోటీ చేస్తాననే ధైర్యం మీకు లేదు. చంద్రబాబుతో కలిసి పోరాడతామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు. ఎందుకీ డొంక తిరుగుడు రాజకీయం.

అన్నీ అబద్ధాలే:
జంగారెడ్డిగూడెంలో ఏదో జరిగిపోయిందట. ఎంత పచ్చి అబద్ధాలు. అంటే చంద్రబాబు ఏది చెబితే అది మాట్లాడడం. టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు తప్పు కాదు. జగన్‌గారి ప్రభుత్వం చేస్తే తప్పట. ఆ అప్పును పవన్‌ ఒక్కసారే తీరుస్తారట. రోజూ ఢిల్లీలో సలాం కొట్టే పవన్‌కు తెలియదా? మోదీ ప్రభుత్వం ఎంత అప్పు చేస్తుందో?. హిందూ దేవతలకు అపచారం జరిగిందని కొత్తగా పంగనామాలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. టీడీపీతో ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నప్పుడు ఎన్ని గుళ్లు కూల్చారు? గుర్తు చేసుకొండి.
ఎండోమెంట్‌ చట్టం మారుస్తామంటున్నారు. మరి 5 ఏళ్లు టీడీపీతో కలిసి ఉన్న మీరు, హిందూ దేవాదాయ చట్టం ఎందుకు మార్చలేదు?
మీ బీజేపీ సభ్యుడే కదా అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా?

గెస్ట్‌. టూరిస్ట్‌. కాదంటారా?:
ఎంతసేపూ విషం చిమ్మడం. జగన్‌ పై కక్ష. ఆయన ప్రజలకు చేరువ కావొద్దు. అధికారంలోకి రావొద్దు. అది తప్ప మీకు మరో ఎజెండా లేదు. మీరు ఇక్కడ గెస్ట్‌. ఒక టూరిస్ట్‌. అంతే తప్ప, మరేదైనా ఉందా?
జగన్‌గారు బాగా పాలిస్తే, సినిమాలు చేసుకుంటా అన్నారు. ఇప్పుడు జరుగుతోంది. 2024 తర్వాత కూడా అదే జరుగుతుంది.
ప్రజలు నిజాయితీ కోరుకుంటారు. అందుకే మీ మనసులో ఉంది చెప్పండి. చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడం. ఆయనను తిరిగి సిఎంను చేయడం. ఏతావాతా ఇవాళ సభలో పవన్‌ చెప్పింది ఒక్కటే. టీడీపీ జెండా మోయడానికి జన సైనికులు సిద్ధంగా ఉండాలని. అలాగే బీజేపీక కూడా చెబుతున్నాను. టీడీపీతో కలిసి వెళ్లాలి. ఆ విధంగా డైరెక్షన్‌ ఇవ్వాలని.. అని మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.