ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు స్థానం లేదు. ఆంధ్రప్రదేశ్ లో పాలక పార్టీ శ్రేణులు టిడిపి కేంద్ర కార్యాలయంపైన, వివిధ జిల్లాల్లో టిడిపి కార్యాలయాలు మరియు నాయకుల ఇళ్ల వద్ద ఆందోళనలు, విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం తీవ్రగర్హనీయమైన చర్య. తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా ఉన్న డ్రగ్స్ మరియు గంజాయి సమస్యపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు, ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా స్పందించి, జవాబుదారితనంతో చర్యలు తీసుకోవాలి.
విమర్శలు నిర్మాణాత్మకంగా, సద్వివిమర్శలుగా ఉండేలా సంయమనం కోల్పోకుండా విమర్శలు చేయాల్సిన బాధ్యతను ఎవ్వరూ విస్మరించకూడదు. సద్విమర్శలను కూడా భరించలేని వాతావరణం నెలకొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకే హాని చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేసే అప్రజాస్వామిక చర్యలకు పాలక పార్టీ శ్రేణులు పాల్పడితే శాంతి భద్రల సమస్యకు వారే ఆజ్యంపోసిన వారౌతారు. డిజిపి ఆఫీసు ప్రక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేస్తే నివారించలేని దుస్థితి దేనికి అద్దం పడుతున్నదో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలి.
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించడం ద్వారా ఈ తరహా అవాఛనీయమైన ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

టి.లక్ష్మీనారాయణ
కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

Leave a Reply