Suryaa.co.in

Entertainment

పితామహుడి విశ్వరూపం

(భీష్మకు షష్టిపూర్తి 19.04.1962)
యాభై నాలుగేళ్ల వయసులో
తాతా అని పిలిచిన పాత్రను
ముప్పై తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే పోషించి
మెప్పించిన నందమూరి..
వయసు ముదిరినాక
కుర్ర వేషాలు..
పిన్న వయసులోనే ముదుసలి గెటప్పులు…
ఇవన్నీ రామారావుకే
చెల్లిన సెటప్పులు..
భీష్మలో అలాగే
సాగింది వరస..
కుర్ర దేవవ్రతుడు..
గెడ్డం పెంచిన కురువీరుడు..
తల నెరిసిన
పితామహుడు..
వంగిన నడుం..
వణికే స్వరం..
కోపం వస్తే మండే భాస్వరం..
ఎన్నెన్ని వైరుధ్యాలో..
అన్నీ అనితరసాధ్యాలు..!

కృష్ణ..భీమ..సుయోధన…
కర్ణ..కిరీటి..కీచక..
ఇంకా రెండు సినిమాల్లో బృహన్నల..
ఇలా వ్యాసుడి భారతంలో
అన్ని కీలక పాత్రల
భరతం పట్టిన ఎన్టీఆర్
చాలా ముందుగానే
అయ్యాడు భీష్మ..
అప్పటికి కృష్ణ పాత్రలోనే
అనుభవం..అయినా
తల పండిన అభినయం..
సాక్షాత్తు పితామహుడే
కళ్ళ ముందు కదలాడినట్టు
ఎన్టీవోడు చేసేసాడు కనికట్టు!

భారతంలో అసలైన నాయకుడు భీష్ముడేనంట..
ఇంక అలాంటి పాత్రకు
ఎన్టీఆర్ ను మించిన
హీరో ఇంకెవరు..
తాత అంపశయ్యపై ఉన్నప్పుడు చూపించాడేమో
కృష్ణయ్య విశ్వరూపం..
తాతగానే రామారావు
ప్రదర్శించాడు బహురూపం!
గుమ్మడి..హరనాథ్..
ప్రభాకరరెడ్డి..కాంతారావు..
ఎవరి పాత్రకి వారు
చేసినా న్యాయం..
ఇది నందమూరి సినిమా
ఆయన చేసిన
మరో సినీమాయ..!
అన్నట్టు..శిఖండిగా
అంజలి శిఖరాగ్ర నటన..
భీష్ముడిపై పగ తీర్చుకోవాలన్న తపన..
పేడి వేషంలో చక్కని ప్రదర్శన
సినిమాలో ఆమే మరో హీరో
మహా దేవ శంభో..
మనసులోని కోరిక..
తెలుసు నీకు ప్రేమికా..
ఈ అంబే
తొలి జంబలకిడి పంబ..
అంజలి పండించిన
అభినయ పంట..!

స్వచ్ఛందమరణ వరప్రసాది కథ సినిమాగా తీస్తే..
ఆ దృశ్య కావ్యానికి
ఇప్పుడు షష్టిపూర్తి..
ఎప్పటికీ చెదరని కీర్తి!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE