– స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల మేధో మధన వేదికగా ఈ గ్రూప్
– ఈ గ్రూప్ ద్వారా నిరంతర అధ్యయనాలు, సమన్వయ సమీక్షలు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయం
వివిధ అంశాలపై చర్చించడం, సెమినార్లు నిర్వహించడం, చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై నిరంతర అధ్యయనాలు చేయడం, సభ్యులతో సమన్వయ సమీక్షలు వంటి పలు విషయాల వేదికగా ఉన్న ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే ” తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రూప్ ” ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
రామకృష్ణాపురం బాబు జగ్జీవన్ భవన్ లో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సర్పంచ్, ఎం.పీ.టీ.సీ, ఎం.పీ.పీ, జెడ్.పీ.టీ.సీ సభ్యులుగా అనునిత్యం ప్రజా సేవలో ఉంటున్న స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ” తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రూప్ ” ను చట్టబద్ధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ గ్రూప్ లో స్థానిక సంస్థల ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉంటారని, పంచాయతీ రాజ్ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, సెమినార్లు జరపడం, అంతర్ జిల్లాల స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా అందులో వచ్చే ఫీడ్ బ్యాక్ అంశాలను రాజ్యసభ, లోక్ సభ ఎం.పీ.లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుని రావాలని వినోద్ కుమార్ సూచించారు.
పార్లమెంటు స్పీకర్ అధ్యక్షులుగా
ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ 1949 లో ఏర్పాటైందని, ఈ గ్రూప్ ఏర్పాటుకు ఆద్యులు రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్. అంబేద్కర్ కావడం విశేషం అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆ దిశలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
అన్ని స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు సోసియల్ ఇంజనీర్లు అని అని అన్నారు. ఏదైన నిర్మాణం జరుపాలంటే ఇంజనీర్ల అవసరం ఉంటుందని, కానీ సమాజ నిర్మాణానికి ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండదండలు అందించాలని ఆయన సూచించారు.
ప్రజా జీవితంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. రిజర్వేషన్ల వల్ల పోటీలో ఉండే అవకాశాలు కొన్ని సార్లు ఉండకపోవచ్చు, ప్రజా క్షేత్రంలో ఓటమి చవిచూసినా నిరాశ చెందకుండా ప్రజా సేవలో మమేకం కావాలని వినోద్ కుమార్ అన్నారు.
స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల డిమాండ్లు అయిన హెల్త్ కార్డుల మంజూరు, రాయితీపై బస్ పాస్ ల జారీ, డబుల్ బెడ్ రూమ్ ల మంజూరు విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్, ప్రతినిధులు సుధాకర్ రెడ్డి, చంద్రారెడ్డి, గోపాల్ గౌడ్, తులసీ, ప్రమీల, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.