ప్లాస్టిక్ వాడకం మనిషి నిత్య జీవితంలో భాగమైపోయింది. అది ప్రమాదకరం అని తెలిసినా సరే దాని వినియోగం మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అవగాహన కలిగిన విద్యావంతులూ, ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు నిత్యం వినియోగించడం కలవరపెడుతోంది. ముఖ్యంగా మనం నిత్యం ఉపయోగించే ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు (ప్రధానంగా పాలీ ఇథిలీన్‌తో తయారైనవి) పర్యావరణ వ్యవస్థకు, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారాయి.
ఈ ప్లాస్టిక్ సంచులు పూర్తిగా విచ్ఛిన్నమై ప్రకృతిలో కావడానికి 100 నుండి 500 సంవత్సరాలు (లేదా అంతకంటే ఎక్కువ) పడుతుంది. ఇవి సహజ పద్ధతిలో విచ్ఛిన్నం (Biodegradation) కావు. వీటిని కాల్చేసినా కూడా భూమి లోపల సహజంగా విచ్ఛిన్నం కాలేవు.
అంతకాక ప్లాస్టిక్ బ్యాగులు సూర్యరశ్మి (UV కిరణాలు), భౌతిక శక్తుల ప్రభావంతో విచ్ఛిన్నమై చిన్న ముక్కలుగా మారుతాయి. వీటిని మైక్రోప్లాస్టిక్స్ (పరిమాణం: 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ) అంటారు. ఇవి నేలలో, నీటిలో, గాలిలో కూడా కలిసిపోయి పర్యావరణ విషాన్ని (Environmental Toxicity) పెంచుతాయి.
ఇక ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే థాలేట్స్ (Phthalates), బిస్ఫినాల్ ఏ (BPA) వంటి రసాయనాలు భూమిలోకి, నీటిలోకి చేరి భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. ఇవి భూసారంలోని సూక్ష్మజీవుల (Microorganisms)పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థకు కూడా అడ్డుపడుతున్నాయి. డ్రైనేజీలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ముఖ్యంగా 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్నవి, నీటి ప్రవాహానికి అడ్డుపడి నీరు ప్రవహించకుండా నిలవడానికి, (Water logging), పట్టణాల్లో వరదలకు (Urban Flooding) కారణమవుతాయి.
ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులు కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు, జీవజాలానికి కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనం ప్లాస్టిక్ సంచులను వాడి ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటాం. వాటిని ఆహారంగా తీసుకున్న జంతువులలో అవి జీర్ణం కాక వాటి జీర్ణాశయంలో (Digestive Tract) పేరుకుపోయి, పోషకాలు అందకుండా చేసి వాటి మరణానికి కారణమవుతాయి.
వీటిని తిని ఎన్నో ఆవులు, వివిధ రకాల పశువులు చనిపోయాయి. ఇక సముద్ర జలాల్లో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలు తాబేళ్లు , డాల్ఫిన్లు వంటి జీవుల గొంతుకు లేదా శరీర భాగాలకు చుట్టుకొని వాటి మరణానికి దారితీస్తాయి.
ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లేట్స్, గిన్నెల్లో ఉండే ఆహార పదార్థాలను తినడం ద్వారా లేదా సీసాల్లోని నీటి ద్వారా అందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి ప్రవేశించి ధమనులలోను (Arteries), ఇతర అవయవాలలో కనుగొనడం జరిగింది. శరీరంలో ఇవి ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపు (Chronic Inflammation) ఏర్పడి, గుండెపోటు (Myocardial Infarction), స్ట్రోక్ (Stroke) వచ్చే ప్రమాదం 4.5 రెట్లు పెరుగుతున్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
ప్లాస్టిక్‌లో ఉండే BPA వంటి రసాయనాలు ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్గా పనిచేసి, మానవ హార్మోన్ల వ్యవస్థపై (Hormonal System) ప్రభావం చూపి, ప్రత్యుత్పత్తి, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ప్రత్యామ్నాయాలు – మనం చేయగలిగేది:
ఇంతగా ప్లాస్టిక్ భూతం మానవాళిని, పర్యావరణాన్ని బాధపెడుతోంది. మరి దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలంటే.. ముందుగా, అతి ముఖ్యంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు బదులుగా గుడ్డ / వస్త్ర సంచులు (Cloth bags), జనపనార సంచులు (Jute bags) లేదా కాగితపు సంచులను (Paper bags) ఉపయోగించాలి. మీరు ఎటువెళ్లినా సరే మీ సంచీని మీతో తీసుకెళ్లడం అలవాటు చేసుకోండి.
మందపాటి (40 మైక్రాన్ల కంటే ఎక్కువ) క్యారీ బ్యాగులను మాత్రమే ఉపయోగించండి, వీలైనంత వరకు వీటినే మళ్లీ మళ్లీ వాడండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం ద్వారానే పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోవాలి. స్టార్చ్ (Starch) లేదా మొక్కజొన్న పిండి (Corn Starch) ఆధారిత బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ (Bioplastics) వినియోగించేలా చూడాలి. అయితే వీటికి సరైన పారిశ్రామిక కంపోస్టింగ్ అవసరం.
ప్లాస్టిక్ వాడకం అనేది కేవలం ప్రజలతోనే కాదు దీనిపై ప్రభుత్వం కూడా బాధ్యతను తీసుకోవాలి. అందుకోసం ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (Single Use Plastic)పై నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
కనీస ప్లాస్టిక్ మందాన్ని (40 మైక్రాన్స్ లేదా అంతకంటే ఎక్కువ) కలిగి ఉండేలా పర్యవేక్షించాలి. అంతేకాక ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ ప్రక్రియను సాంకేతికంగా మెరుగుపరచాలి. ప్రస్తుతం చాలా తక్కువ శాతం మాత్రమే రీసైకిల్ అవుతోంది.
ఈ సాంకేతిక సమస్యలన్నింటికీ మూలకారణం ప్లాస్టిక్‌లోని రసాయన స్థిరత్వం (Chemical Inertness)తో పాటు దీన్ని అతిగా వినియోగించడమే.. కాబట్టి వీటిని మితిమీరి వినియోగించకుండా, పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను స్వీకరించడం అనేది నేటి పరిస్థితుల్లో అత్యవసరం.
( విశ్వసంవాదకేంద్ర సౌజన్యంతో)