– నకిలీ మద్యం దందాపై చంద్రబాబు దిగజారుడు రాజకీయం
– ప్రజలకు నిజాలు తెలియాలంటే సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు?
– చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు
తాడేపల్లి : ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైయస్ఆర్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే…
చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైయస్ఆర్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్దమయ్యాడు. అందులో భాగంగానే నిందితుడు జనార్దన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైయస్ఆర్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.