నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినప్పటికీ, జగన్మోహన్ రెడ్డిని మందలించి పంపించినట్లు తెలిసిందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని బిజెపి నాయకత్వం చెబితేనే అరెస్టు చేశామని చిత్తూరు జిల్లా మంత్రి సమక్షంలో ఒక ఎంపీ
అన్నారు. ఒక మంత్రి సమక్షంలో ఎంపీ అన్నారంటే , అది ఎందుకు అబద్ధం అయి ఉంటుందన్న ప్రశ్న తలెత్తే అవకాశం లేకపోలేదు .
చేసిందంతా మీరు చేసి… మమ్మల్ని అందులోకి లాగుతారా? అంటూ అమిత్ షా , జగన్మోహన్ రెడ్డికి అక్షితలు వేసినట్లు తెలిసిందన్నారు. మా పార్టీ కి సంబంధం లేకుండా నిందలు వేయడం మంచి పద్ధతి కాదని అమిత్ షా మందలించి ఉండవచ్చునని రఘురామకృష్ణం రాజు అన్నారు. హోం శాఖ మంత్రి కలిసిన తర్వాత పోలవరం నిధులు, రైల్వే జోన్, పెండింగ్ బకాయిల కోసమే కలిసినట్లుగా రొటీన్ డైలాగులు చెప్పారన్నారు.
ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ అడిగారు. లేదు పొమ్మని ప్రధాని అనడంతో, బయటకు వచ్చి అపాయింట్మెంటే అడగలేదని చెబుతారు. ప్రధానితోపాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే నేను భావించానని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన రోజు రాత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా జలాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు బచావత్ ట్రిబ్యునల్ 811 టిఎంసిల నీటిని కేటాయించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో అన్ని పంపకాలు జరిగినట్లుగానే జనాభా దామాషా ప్రకారం నీటి పంపకాలు కూడా జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ కు 512 టీఎంసీల నీటిని కేటాయించగా, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని కేటాయించారు.
అయితే నీటి కేటాయింపుల పట్ల తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. నాలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పునసమీక్షించి, మళ్లీ నీటి కేటాయింపులను చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 512 టీఎంసీలను టచ్ చేయడానికి వీలు లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేరని ఆవేదనతో జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రి కి ఒక లేఖను రాశారు. జగన్మోహన్ రెడ్డి, ప్రధానమంత్రికి లేఖ రాసిన విషయాన్ని సాక్షి దినపత్రికలో ప్రముఖంగా ప్రచురించారు.
జగన్మోహన్ రెడ్డి, ప్రధానికి లేఖ రాసిన రోజు అర్ధరాత్రే గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రధానమంత్రి ని ఎలాగైనా కలవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ, తిరస్కరణ తీవ్రంగా ఉండడంతో తిరిగి వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.
నీటి కేటాయింపులపై అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అంబటి తెలిపారు . బిజెపిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఎప్పుడూ నిందిస్తూనే ఉంటారు. అయినా కృష్ణా జలాల కేటాయింపులో వారికి అనుకూలంగానే నిర్ణయం వెలువడింది.
ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీటి జలాల నుంచి, తెలంగాణకు అదనంగా నీటి జలాలను కేటాయించే అవకాశాలే అధికంగా ఉన్నాయి . ఈ నిర్ణయం వల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది తప్పా, ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీ లేదు . బచావత్ ట్రిబ్యునల్ కు మరొక ఏడాది గడువు ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి తగువును తీర్చడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే, తగువులు తీర్చవద్దని సుప్రీం కోర్టు అంటుందా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. పోలవరం కొట్టుకుపోతే అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పుగా, మంచిగా ఉంటే తాము చేసిన అభివృద్ధిగా చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటే. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేది. వరద జలాలపై హక్కు దిగువున ఉన్న రాష్ట్రాలకు ఉంటుంది. మిగులు జలాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాను అడుగుతూ, పైననే 30 నుంచి 35 టీఎంసీల నీటిని తోడుకునే ప్రయత్నం చేస్తుంది.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వెళ్తే, రాష్ట్రం నుంచి అంబటి రాంబాబు ఢిల్లీకి పయనం అవుతున్నారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు జరుగుతాయని గతంలోనే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు . నీటి సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాలు కలిసి పోతాయని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పలేదు కదా అంటూ ఈ సందర్భంగా ఆయన చమత్కరించారు.
సాధారణంగా గెజిట్ నోటిఫికేషన్లు అర్ధరాత్రి వెలువడవని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన రోజు రాత్రి గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం షాక్ కు గురి చేసిందన్నారు.
మా పార్టీ ఎంపీల సంఖ్య 29గానే పరిగణించాలని పవన్ కళ్యాణ్ కోరిన రఘురామ కృష్ణంరాజు
మా పార్టీ ఎంపీల సంఖ్య కేవలం 29 మంది సభ్యులుగానే పరిగణించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రఘురామకృష్ణం రాజు కోరారు.
రాష్ట్ర సమస్యలపై, ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులను, రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి తానొక్కడినే పార్లమెంటులో పోరాటం చేస్తున్నాను. వైకాపా ఎంపీలు 29 మందే నని ఐదవ
విడుత వారాహి యాత్రలోనైనా చెప్పాలని పవన్ కళ్యాణ్ ను ఆయన కోరారు . ముఖ్యమంత్రి ఢిల్లీకి విచ్చేస్తే, తన సామాజిక వర్గ ఎంపీలు స్వాగతం పలికితే , దాన్ని కూడా సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా ప్రచురించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
లైట్లు ఆర్పి వేసి టార్చ్, కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపండి
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదు నిమిషాల పాటు ఇంట్లోనే లైట్లను ఆర్పి వేసి
ఇంటి ఆవరణలో టార్చ్ లైట్, లేదంటే కొవ్వొత్తులను వెలిగించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఇంటి ఆవరణలోనే వీలైతే సెల్ ఫోన్ టార్చ్ లైట్ ను వెలిగించాలని సూచించారు.
ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పళ్లెంపై గరిటతో మోగించినందుకు, విజిల్ వేసినందుకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మన ఇంటి ఆవరణలో మనము టార్చ్ లైట్, కొవ్వొత్తి వెలిగిస్తే కచ్చితంగా కేసులు నమోదు చేసే అవకాశం పోలీసులకు లేదని ఆయన అన్నారు.
పోలీసులకు మాత్రమే జీతాలు ఇచ్చారట…!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో కేవలం పోలీసులకు మాత్రమే జీతాలను చెల్లించినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. పోలీసులు 41A నోటీసు ఇచ్చి కూడా అరెస్టు చేస్తారు. నోటీసు ఇచ్చి కూడా ఇవ్వలేదని అంటారు.
అందుకే ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులకు మాత్రం ఈ ప్రభుత్వం జీతాలను అందజేస్తుందన్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సాధారణ ఉద్యోగుల వరకు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు.గతంలో 12 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసి మరో 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు తెలిసిందన్నారు.
అయినా, ఉద్యోగులకు జీతాలు లేవు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు లేవు. ఓట్లు విదిల్చే పథకాలకు మాత్రం డబ్బులు కేటాయిస్తున్నారు. బెదిరించే వాలంటీర్లకు, ప్రజలను హింసించే పోలీసులకు మాత్రమే ఈ ప్రభుత్వం ఒకటవ తేదీన జీతాలను అందజేస్తుంది. ఇప్పటివరకు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కేవలం 1800 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగా, ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలట. ఎప్పుడు ఇస్తారన్నది ప్రశ్నార్థకంగానే మారింది.
రాష్ట్ర ఆదాయం పెరిగిందని, జిడిపిలో దేశంలోనే అగ్రవస్థానంలో ఉన్నామని గొప్పలు పోతున్నప్పటికీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
పవన్ ఎన్డీఏ లో ఉన్నారా? లేరా? అన్నది వైకాపా నేతలకు అనవసరం
కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కొనసాగుతున్నదా? లేదా అన్నది? వైకాపా నేతలకు అనవసరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మేము ఎవరితో కలిస్తే మీకెందుకు, ఎన్ని స్థానాలలో పోటీ చేస్తే మీకెందుకు?, ఎన్డీఏలో కొనసాగుతున్నామా? లేదా అన్నది కూడా మీకు అనవసరం అని పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ
వైకాపా నేతలను ఉద్దేశించి అన్నారు.
వైకాపా నేతల నుంచి ప్రజలను రక్షించడానికి పనిచేస్తున్నామన్న ఆయన, టిడిపి, జనసేన కూటమితో కలిసి వచ్చేలా బిజెపితో మంతనాలను జరుపుతున్నామని చెప్పారు. ఒకవైపు 175కు 175 స్థానాలలో గెలుస్తామని చెబుతూనే, మరొకవైపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తారా అంటూ ప్రశ్నించడం మా పార్టీ నాయకుల దివాలా కోరుతనాన్ని తెలియజేస్తోంది.
ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, మాజీమంత్రి పేర్ని నాని, అవంతి శ్రీనివాస్ వంటి వారిని ముఖ్యమంత్రిగా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. జీ 20 సదస్సులో బిజెపి నాయకత్వం బిజీ ఉండగా, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించాల్సి వచ్చిందన్న పవన్ కళ్యాణ్, కూటమిలోకి బిజెపిని కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.
రాష్ట్రంలోని యువత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వెనుక ఉంటే, మహిళలు, పరిణితి చెందిన వ్యక్తులు నారా చంద్రబాబునాయుడు వెంట ఉన్నారని ఇదొక డెడ్లీ కాంబినేషన్ అని పేర్కొన్నారు. ఉభయగోదావరి జిల్లాలో వైకాపాకు ఒక్క స్థానం కూడా దక్కదని, మంత్రులలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు తమ సొంత బలంతో గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు.
ప్రశ్న పత్రం ముద్రించడానికి సొమ్ము లేవట…
విద్యార్థులకు ప్రశ్నాపత్రాన్ని ముద్రించడానికి ప్రభుత్వం వద్ద సొమ్ములు లేవని, ప్రశ్నాపత్రాలను ముద్రించలేని దుస్థితికి విద్యాశాఖను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టివేసిందని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ప్రశ్నాపత్రాన్ని ఉపాధ్యాయునికి వాట్సప్ చేస్తే, ఆయన వాట్సప్ చూసుకొని ఆ ప్రశ్నలను బ్లాక్ బోర్డుపై రాయాలట.
ఒకవైపు ఇంటర్నేషనల్ సిలబస్ అమలు చేస్తానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను ముద్రించి ఇవ్వలేకపోవడం కంటే దారుణం మరొకటి ఉండదు. తొలుత సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెడతానని జగన్మోహన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే రాష్ట్రంలోని 49 వేల పాఠశాలలో కేవలం 100 నుంచి 120 పాఠశాలు మాత్రమే సీబీఎస్ఈ సిలబస్ కు అర్హత సాధించినట్లు తెలిసింది. దీనితో, సిలబసే మార్చేస్తానని చెప్పి ఇంటర్నేషనల్ సిలబస్ ను ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దేశం మొత్తం మీద 300 ఇంటర్నేషనల్ సిలబస్ కలిగిన పాఠశాలలు ఉంటే, ఏకంగా రాష్ట్రంలోని 49 వేల పాఠశాలలలో జగన్మోహన్ రెడ్డి ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టాలని నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉంది.
ఇంటర్నేషనల్ సిలబస్ ప్రవేశపెట్టలేరని ఎవరైనా భావిస్తే వారిపై ఒకటవ తేదీ నాడే జీతం అందుకునే పోలీసులు కేసులు పెడతారని రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. బైజుస్ సంస్థకు ఎటువంటి టెండర్లు లేకుండానే 700 కోట్ల రూపాయల కాంట్రాక్టు కట్టబెట్టారు. బైజుస్ తో కుదిరిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఎంత ముట్టిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు నేను కూడా ప్రశ్నిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
తన అతి తెలివితో వైయస్ జగన్మోహన్ రెడ్డి ని బుక్ చేసిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి
తన అతి తెలివితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బుక్ చేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఒక ఎంపీ 10 కోట్ల రూపాయలను తన కంపెనీ నుంచి, మరో రెండు కోట్ల రూపాయలు తన వ్యక్తిగత అకౌంట్ నుంచి మా పార్టీ పెద్దలకు అందజేస్తే, ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారు.
సుధాకర్ రెడ్డి లాజిక్ ప్రకారం 12 కోట్ల రూపాయలకు ఆ ఎంపీ టికెట్ ను అమ్ముకున్నట్లే భావించాలా?. తెదేపాకు 27 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు వస్తే… అవి స్కిల్ డెవలప్మెంట్ కేసులో వచ్చిన అవినీతి సొమ్ముగా పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి మా పార్టీకి 600 కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు వచ్చాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయన్నది నిగ్గు తేల్చాలి.
ఆండ్రు మినరల్స్ అనే కంపెనీ నుంచి ముఖ్యమంత్రికి వేలు విరిచిన సోదరుడి ఒత్తిడి వల్ల ప్రభుత్వం ఏర్పడక ముందే 12 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత పెద్ద మొత్తం విరాళానికి ఒత్తిడి పెంచడంతో ఆ కంపెనీ యాజమాన్యం పారిపోయింది.
అనునిత్యం ప్రజల కోసం పరితపించి కోర్టులకు కూడా హాజరుకావడానికి సమయం లేని ముఖ్యమంత్రిని సుధాకర్ రెడ్డి తన అతి తెలివితో బజారు పాలు చేశారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. సుధాకర్ రెడ్డి పై తగిన చర్యలు తీసుకోవాలని ఒక వైసీపీ సభ్యుడిగా తాను కోరుతున్నానని తెలిపారు.
రుణం తీర్చుకోకపోతే లావైపోమా?
వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను, నాయకులను వేధించారని, త్వరలోనే నూతనంగా ఏర్పడనున్న ప్రభుత్వ హయాంలో వారి రుణము తీర్చుకోకపోతే సినీ కథానాయక శృతిహాసన్ చెప్పినట్లుగా లావై పోమా? అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు..
న్యాయస్థానాలను, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను గౌరవించాలని ఎప్పటి మాదిరిగానే నేను చెబితే, దటీజ్ రియలైజేషన్ అంటూ వైకాపా సోషల్ మీడియా పేటియం బృందం నన్ను ట్రోల్ చేశారు.
టిడిపి అధికారంలోకి వస్తే మనల్ని తోలు తీసేస్తామని అంటున్నారని, వాలంటీర్లతో కలిసి వైకాపా శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే దిస్ ఇస్ రియలైజేషన్ అని అనిపిస్తోంది. 90 శాతం మంది వాలంటీర్లు మనవారేనని, మిగిలిన 10 శాతం మందిని తీసివేద్దామని బాలినేని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసివేసిన 10 శాతం మందికి రానున్న ప్రభుత్వంలో కచ్చితంగా ఉద్యోగం ఉంటుంది. విశాఖపట్నం ఋషికొండ పై పర్యాటకశాఖ పేరిట నిర్మించిన భవనాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 23వ తేదీ నుంచి కొత్త కాపురం మొదలుపెట్టనున్నారు.
అక్రమంగా నిర్మించిన ఈ భవన సముదాయాన్ని కూల్చివేయమని న్యాయస్థానం ఆదేశిస్తే కూల్చివేయాలని, లేకపోతే రానున్న ప్రభుత్వ హయాంలో ఆ భవన సముదాయాలలో మానసిక వైద్య చికిత్సాలయం ఏర్పాటు చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. డానికి జగనన్న మానసిక చికిత్సాలయం అనే పేరును ఖరారు చేయాలని సూచించారు.