Suryaa.co.in

National

రోడ్డెక్కితే ఇక ‘టోలు’ తీసుడే!

– టోల్‌గేట్లు పెట్టి ‘ప్రైవేటు’ వసూళ్లు
– మొదట విడతగా 18 రోడ్లు ఎంపిక చేసిన ప్రభుత్వం
– రెండో విడతగా ఇంకో 88 రోడ్లు ప్రైవేట్ కు
జిల్లా, రాష్ట్ర రహదారులు సైతం ప్రయివేటుకు
– ఆటో ఛార్జీలు.. సరకుల ధరలకు రెక్కలు
– మధ్యతరగతిపై మరింత భారం
– జనాలకు భారం
– సర్కారుకు ఆదాయం
– రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే
– ఇప్పుడు భారమంతా జనంపైనే

రోడ్డెక్కే జనంపై ‘టోలు’ తీసేందుకు సర్కారు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు సంబంధించి కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రోడ్లను బాగుచేయించే బాధ్యతనుంచి తప్పుకున్న ప్రభుత్వం ఆ ఖర్చును ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ఇన్నాళ్లుగా కేవలం జాతీయ రహదారుల మీదనే టోల్ గేట్లు ఉండేవి. ఆ రోడ్లమీదుగా వెళ్లే వాహనదారులు మాత్రం టోల్ ఫీజు చెల్లించేవాళ్ళు. కానీ కూటమి సర్కార్ జిల్లా, రాష్ట్ర రహదారులు సైతం ప్రయివేటుకు అప్పగించేసి, అక్కడా టోల్ గేట్లను పెట్టి వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. అంటే సదరు రోడ్ల నిర్వహణ. మరమ్మతులన్నీ ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తారు. ఆ ఖర్చును ఆ కాంట్రాక్ట్ సంస్థ టోల్ ఫీజు రూపంలో ప్రజలనుంచి వసూలు చేస్తుందన్నమాట.

ఇందులో భాగంగా మొదట విడతగా 18 రోడ్లను ఎంపిక చేసిన ప్రభుత్వం, రెండో విడతగా ఇంకో 88 రోడ్లను ప్రైవేట్ కు అప్పగించేసి టోల్ వసూళ్లకు డోర్లు తెరిచింది. ఇది రానురాను ప్రజలకు భారంగా మారుతుంది. ఆ రోడ్ల మీదుగా వెళ్లే .. కార్లు .. రవాణా వాహనాలు ఆర్టీసీ… ఇంకా ప్రైవేట్ బస్సులు.. కార్ల మీద కూడా టోల్ ఛార్జీ పడుతుంది. ఆ డబ్బు కట్టాక కానీ ఆ రోడ్డు మీదుగా పోలేని పరిస్థితి.

దీనివల్ల పేద మధ్యతరగతిపై పెనుభారం పడనుంది . ఆ రూట్లో వెళ్లే బస్సు ఆటో ఛార్జీలు గణనీయంగా పెరుగుతాయి. సరకు రవాణా వాహనాలమీద టోల్ భారం పడడంతో అవి కూడా కిరాయిని పెంచేస్తాయి. దీంతో అంతిమంగా సరుకుల ధరలు పెరుగుతాయి. టోల్ ఫీజుతో కలిపి రవాణా ఛార్జీలు లెక్కేసి కూరగాయలు.. నిత్యావసరాల ధరలను పెంచేస్తారు .

ఇంకా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల టిక్కెట్ల ధరలు సైతం పెరుగుతాయి. ఇలా అన్నిరకాలుగా ప్రజలమీద భారం పడనుంది. వాస్తవానికి రాష్ట్రంలోని రోడ్ల నిర్వహణ బాధ్యత రాష్ట్రప్రభుత్వమే చూడాలి. కానీ ఈ ప్రభుత్వం ఆ బాధ్యతను తప్పించుకుని ప్రైవేటుకు అప్పగించేసి టోల్ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తోంది. ఇది ప్రభుత్వానికి సులభమే కానీ అంతిమంగా ప్రజలమీద భారం పడుతుంది. చెత్తపన్నునే భరించలేని ప్రజలు, టోల్‌టాక్స్‌ను అంగీకరిస్తారా? అన్న చర్చ కూటమి శ్రేణుల్లో జరుగుతోంది.

LEAVE A RESPONSE