Suryaa.co.in

Political News

చెప్పులు అందించుట / మోయుట..చరిత్ర పునరావృతం

( విక్రమ్‌ పూల)

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ కొత్త రాజకీయ వివాదాన్ని కొని తెచ్చుకొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంకు తీసుకువెళ్లి దర్శనం చేయించిన బండి సంజయ్‌.. ఆలయం బయట తన చెప్పుల కోసం వెతుకుతున్న అమిత్‌షాకు చెప్పులు అందించారు.

సదరు అపురూప దృశ్యాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి అవకాశాన్ని రాజకీయ ప్రత్యర్ధులు వదులుకోరు కదా! వెంటనే కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తీవ్రంగా

స్పందించారు. ‘‘గుజరాత్‌ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా?’’ అని అంటూ ‘‘ఢిల్లీ చెప్పులు మోసే ఇలాంటి గుజరాతీ గులామ్‌లను తెలంగాణ సమాజం గమనిస్తోంది. మరోవైపు ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న కేసీఆర్‌ను చూసి రాష్ట్రం, దేశం గర్విస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

బండి సంజయ్‌ అమిత్‌షాకు చెప్పులు అందించిన ఉదంతం రాజకీయ రంగు పులుముకొనిఢిల్లీ బీజేపీ నేతల చెప్పులు మోయడంగా రూపాంతరం చెందింది. చివరకు దానిని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ సమస్యగా టీఆర్‌ఎస్‌ నేతలు చిత్రీకరిస్తున్నారు. బండి సంజయ్‌ మాత్రం తను చేసిన ‘పని’కి ఏమాత్రం న్యూనత పడలేదు సరికదా సమర్ధించుకొన్నారు. ‘‘అమిత్‌షా మా నేత. నాకు తండ్రి లాంటి వారు. ఆయనకు చెప్పులు అందిస్తే తప్పేముంది? పెద్దలను గౌరవించడం మా సంస్కృతి’’ అని చాలా తేలిగ్గా తీసిపారేశారు. చెప్పులు వేసుకోవడంలో అమిత్‌షాకు సంజయ్‌ సహకరించారే తప్ప, అందులో ఆత్మగౌరవం కించపరిచే అంశం లేదని మిగతా బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. సరే.. ఎవరి వెర్షన్‌ వారిది. ఇందులో ఆత్మగౌరవ సమస్య ఉందా లేదా అన్నది ప్రజలు తేలుస్తారు.

ఇదంతా చూసినపుడు నాకు రెండు అంశాలు గుర్తొచ్చాయి. ఒకటి – 1980లో బేగంపేట్‌ విమానాశ్రయంలో నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టి. అంజయ్య గారిని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నanjaiah రాజీవ్‌గాంధీ ఘోరంగా అవమానించిన సంఘటన. తనకు ఘనస్వాగతం పలుకుతూ భారీ ఏర్పాట్లు చేసినందుకు ఆగ్రహించిన రాజీవ్‌గాంధీ అంజయ్య గారికి సున్నితంగా చెబితే సరిపోయేది. కానీ, ఆ పెద్దాయనను ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అందరిముందు రాజీవ్‌గాంధీ చెడామడా తిట్టి ఆయనను అవమానపరిచారు. సరిగ్గా అదే సమయానికి ఆ మొత్తం దృశ్యాన్ని ఈనాడు ఫోటోగ్రాఫర్‌ కేశవులు తన కెమెరాలో బంధించడం, మరుసటిరోజు ఈనాడు దినపత్రిక ఆ ఫోటోల్ని సీక్వెన్స్ గా వేసి జరిగిందంతా ఓ స్టోరీగా రాయడంతో.. తెలుగువారి ఆత్మగౌరవ సమస్య తెరమీదకు వచ్చింది.

anవెన్నెముకలేని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్నిఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారంటూ అప్పటి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ తర్వాతి కాలంలో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌కు ఈ అంశం బాగా ఉపయోగపడిరది. ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్‌ ఈ అంశాన్ని ప్రస్థావించేవారు. అంజయ్య గారికి జరిగిన అవమానం నిజంగా తెలుగు జాతికి జరిగినట్లు చాలామంది భావించారు. బాధపడ్డారు. అందుకు ప్రతిగా ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడిరచారు. ఇదంతా చరిత్ర!

అయితే, చరిత్రకు అంతగా ఎక్కని మరో సంఘటన అంతకుముందే (అంజయ్య గారి ఉదంతం కంటే ముందు) జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా దేశంలో అధికార చక్రం తిప్పిన యువరాజు సంజయ్‌ గాంధీ గుంటూరు జిల్లాలో ఓ ఆలయాన్ని దర్శించారు. ఆ సందర్భంలో సరిగ్గా ఇలాగే చెప్పులు బయట విప్పి దైవ దర్శనం చేసుకొని బయటకు రాగానే.. సంజయ్‌ గాంధీ వెంట ఉన్నKotha-Raghuramaiahకేంద్రమంత్రి కొత్త రాఘురామయ్య , సంజయ్‌ గాంధీకి చెప్పులు అందించారు (ట). దీనిని ఓ ప్రముఖ దినపత్రిక బాక్స్‌ కట్టి ప్రచురించింది. అప్పట్లో అదొక సెన్సేషన్‌. కాకపోతే.. సంజయ్‌ గాంధీకి రఘురామయ్య గారు చెప్పులు అందించే దృశ్యాన్ని ఏ పత్రికా ఫోటోగ్రాఫర్‌ ఫోటో తీయలేదు. కేవలం వార్తగానే వచ్చింది.

మొత్తానికి పార్టీలకు అతీతంగా ఢిల్లీ నేతలకు, రాష్ట్ర నేతలు అత్యుత్సాహంతో చెప్పులు అందించడం అన్నది ఎప్పట్నుంచో ఉన్నదే! కాకపోతే, పితృ సమానులు, సోదర సమానులు అనే భావనతో అగ్రనేతలకు చెప్పులు అందించడాన్ని న్యూనతగా పరిగణించనట్లయితే చివరకు అదొక సంస్కృతిగా, సంప్రదాయంగా స్థిరపడిపోతుంది. అదే ప్రమాదం!

LEAVE A RESPONSE