– పోలీసులకు డిప్యూటీ తహసిల్దార్ ఫిర్యాదు
– వేటపాలెం పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు నమోదు
– సమగ్ర విచారణకు రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశాలు
– అధికారులే దొంగలంటున్న జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి
– పబ్లిక్ రికార్డ్స్ మాయం వెనుక అప్పటి చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కుట్ర
చీరాల: వేటపాలెం తహసీల్దారు కార్యాలయం నందు పందిళ్ళపల్లి గ్రామకంఠం లోని సర్వే నెంబరు 72-3 తాలూకు ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులు మాయం అయిన విషయమై వేటపాలెం డిప్యూటీ తహసీల్దార్ జి మహేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పబ్లిక్ రికార్డ్స్ దొంగతనం జరిగినట్లు వేటపాలెం పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నెం.131/2023 నమోదు అయ్యింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సదరు పబ్లిక్ రికార్డ్స్ మాయమైన విషయమై తహసీల్దారు కార్యాలయము నందు సదరు రికార్డ్స్ ఎవరి ఆధీనంలో ఉన్నవి, ఎప్పటినుండి కనిపించకుండా పోయినది, తర్వాత సంబంధిత అధికారులు చేపట్టిన చర్యలు తాలూకు పూర్తి వివరములు సేకరించే పనిలో వేటపాలెం పోలీసులు నిమగ్నమయ్యారు.
వివరాల్లోకి వెళితే…
పందిళ్ళపల్లి రెవిన్యూ గ్రామ సర్వేనెంబర్ 72-3 పోరంబోకు గ్రామకంఠం (మాలపల్లి), ప్రభుత్వ భూమి తాలూకు పూర్తి రెవిన్యూ రికార్డుల సమాచారం కోరుతూ తేది.23.08.2021న సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(1) ప్రకారం వేటపాలెం కు చెందిన జర్నలిస్ట్ యన్. నాగార్జున రెడ్డి వేటపాలెం తహసీల్దార్ కార్యాలయమునకు దరఖాస్తు దాఖలు చేశారు. కోరిన సమాచారం ఇవ్వడానికి తహసిల్దార్ కార్యాలయం నిరాకరించడంతో సదరు దరఖాస్తు విషయమై రెవిన్యూ డివిజనల్ అధికారి, ఒంగోలు వారి వద్ద నాగార్జున రెడ్డి మొదటి అప్పీలు దాఖలు చేశారు.
అప్పీల్ ను చట్టబద్ధంగా పరిష్కరించలేదని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ వద్ద నాగార్జున రెడ్డి రెండవ అప్పీలు దాఖలు చేయగా, కమిషన్ వద్ద నమోదైన Case No. 3658/SIC- MRK/2022 విచారణ జరిపి తగు చర్యలు చేపట్టవలసిందిగా రెవిన్యూ డివిజనల్ అధికారి, చీరాల వారిని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎం రవికుమార్ ఆదేశించినప్పటికీ, రెవిన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంతో, నాగార్జున రెడ్డి తిరిగి రాష్ట్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించారు.
సదరు ఫిర్యాదు Case No.14177/SIC- KJR/2022పై రాష్ట్ర సమాచార కమిషన్ జరిపిన విచారణలో దరఖాస్తుదారుడు నాగార్జున రెడ్డి కోరిన సమాచారం వేటపాలెం తహసిల్దార్ కార్యాలయంలో లభ్యముగా లేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. పబ్లిక్ రికార్డ్స్ మాయమైన విషయమై రెవెన్యూ డివిజనల్ అధికారి, చీరాల వారిని సమగ్రంగా విచారణ జరిపి చట్టపరమైన చర్యలు చేపట్టాలని, మూడు వారాల లోపు పూర్తి నివేదిక సమర్పించాలని తేది.06.03.2023 న రాష్ట్ర సమాచార కమిషనర్ కట్టా జనార్ధన రావు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఉత్తర్వుల నేపథ్యంలో చేసేదేమీ లేక రెవెన్యూ అధికారులు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది…
వేటపాలెం మండలం పందిళ్లపల్లి రెవెన్యూ గ్రామ సర్వేనెం. 72-3 పూర్తి విస్తీర్ణం య.2.46 సెంట్లు FLR దాఖలా పోరంబోకు గ్రామకంఠం మాలపల్లి (ప్రభుత్వ భూమి) సంబందించి చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తండ్రి అయిన ఆమంచి వెంకటేశ్వర్లు(లేట్) విస్తీర్ణం య. 0.11 సెంట్లు భూమిని ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదలాయింపు నిషేధ చట్టం 1977 మరియు సవరణ చట్టం 2007 కు వ్యతిరేకంగా కొనుగోలు చేసిన భూమిలో ఆమంచి కృష్ణమోహన్ ఇల్లు నిర్మించిన విషయమై తేది.07.10.2020, నాయుడు నాగార్జునరెడ్డి ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు ఫిర్యాదు చేశారు.
కలెక్టర్ కు ఫిర్యాదు
వేటపాలెం మండలం పందిళ్లపల్లి రెవెన్యూ గ్రామ సర్వేనెం. 72-3 పూర్తి విస్తీర్ణం య.2.46 సెంట్లు FLR దాఖలా పోరంబోకు గ్రామకంఠం మాలపల్లి (ప్రభుత్వ భూమి) సంబందించి ప్రస్తుత చీరాల మాజీ శాసన సభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తండ్రి అయిన ఆమంచి వెంకటేశ్వర్లు(లేట్) విస్తీర్ణం య. 0.11 సెంట్లు భూమిని ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదలాయింపు నిషేధ చట్టం 1977 మరియు సవరణ చట్టం 2007 కు వ్యతిరేకంగా కొనుగోలు చేసినట్లు జె.రాధాకృష్ణమూర్తి స్పెషల్ కలెక్టర్ (L.A) (FAC), P.S VELUGONDA PROJECT ONGOLE వారు Rc.A1/12/2012 Dt.28.08.2012 ద్వారా శ్రీయుత కలెక్టర్ & మేజిస్ట్రేట్, ప్రకాశం జిల్లా వారికి సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
సదరు భూమిలోని చట్ట విరుద్ధంగా ఆమంచి కృష్ణమోహన్ ఇంటి నిర్మాణం చేపట్టిన ఫిర్యాదుదారు నాగార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు. గౌరవ భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 కు వ్యతిరేకంగా రాజకీయ వత్తిడులకు తలొగ్గిన రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు భారీ అవినీతికి పాల్పడి ఈరోజువరకు ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూములు బదలాయింపు నిషేధ చట్టం 1977 మరియు సవరణ చట్టం 2007 లోని సెక్షన్ లు 4, 7 ప్రకారం ఎటువంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదని ఫిర్యాదులో నాగార్జున రెడ్డి ఆరోపించారు.
అంతేగాక ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయితీ అభివృద్ధి ( లే అవుట్ మరియు బిల్డింగ్ ) రూల్స్ 2002 కు విరుద్దంగా 4791.6 Sq.F భూమిలో బిల్డింగ్ నిర్మాణం జరిగినప్పటికీ రూల్ 33 ప్రకారం ఈరోజు వరకు జిల్లా పంచాయితీ అధికారి వారు గౌరవ భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 కు విరుద్ధంగా వ్యవహరించి ఎటువంటి చట్టపరమైన చర్యలు చేపట్టలేదని నాగార్జున రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. షెడ్యూలు కులములు మరియు షెడ్యూలు తెగల వారిపై ( అత్యాచారముల నిరోధక) చట్టం 1989 & నియమముములు 1995 కు వ్యతిరేకముగా షెడ్యుల్ కులముల వారిని చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ బెదిరించి తన అధికార పలుకుబడిని ఉపయోగించి సదరు అసైన్డ్ భూమిని అక్రమంగా స్వాధీన పరచుకుని బిల్డింగ్ నిర్మాణం చేశారని, 2019 సాధారణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమంచి కృష్ణమోహన్ THE REPRESENTATION OF THE PEOPLE ACT, 1951 Under Section 33A ప్రకారం ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫడవిట్ కూడా తన ఇంటి నిర్మాణం గురించి స్పష్టం చేశారని ఈ విషయమై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ జిల్లా అధికారులు స్పందించలేదని నాగార్జున రెడ్డి తెలిపారు. చివరకు జర్నలిస్ట్ నాగార్జున రెడ్డి హై కోర్టు ను ఆశ్రయించగా WP NO.15865/2021విచారణలో ఆమంచి కృష్ణమోహన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
ఇంటి దొంగల పనే…
వేటపాలెం మండల తహసీల్దారు కార్యాలయంలో పబ్లిక్ రికార్డ్స్ మాయం వెనుక అప్పటి చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు జర్నలిస్ట్ యన్. నాగార్జున రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గి వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేయటం వలన ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, అధికారులు ప్రజా ప్రయోజనాల కోసమే పని చేయాలని, ఇకనైనా ప్రజల పట్ల వారి సమస్యల పట్ల అదికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,లేని పక్షంలో ఏదో ఒకరోజు చట్టం ముందు దోషులుగా నిలబడవలసిన వస్తుందని, అందుకు ఈ కేసును ఉదాహరణగా అధికారులు గమనంలో ఉంచుకోవాలని నాగార్జున రెడ్డి తెలిపారు.