నా నియోజకవర్గానికి నన్ను రానివ్వరా?

-జగన్మోహన్ రెడ్డి… సమస్య ఏమిటో తనకు అర్థం కావడం లేదు!
-ఎంపీ ప్రాథమిక హక్కులనే హరిస్తారా?
-పీఎం ఆఫీస్, హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్తా…
-హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తా
-అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతా..
-నా పై ప్రస్తుతం ఉన్న అన్ని కేసుల్లోను స్టే ఉంది… కొత్త కేసులను పెడితే ఎదుర్కోవడానికి సిద్ధం
-కానీ ఆ రెండు రోజుల్లో కాకుండా ఎప్పుడైనా పెట్టుకోండి… న్యాయపోరాటానికి రెడీ
-నాలుగు నెలలుగా ధాన్యం కొనుగోలు డబ్బులు రైతులకు చెల్లించని ప్రభుత్వం
-ప్రజలను ఎక్కువ కాలం మభ్య పెట్టలేరు… ఆ విషయాన్ని గుర్తించండి సీఎం గారు!
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమస్య ఏమిటో నాకు అర్థం కావడం లేదు… నా నియోజకవర్గానికి నేను వెళ్తానంటే, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటనీ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు. తాను తన నియోజకవర్గానికి వస్తానని చెబుతున్నానని, అంతేకానీ పులివెందులకు వస్తానని చెప్పడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గానికి తాను వస్తానంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరచాటు రాజకీయాలు, చీకటి వ్యవహారాలు నడపడం ఏమిటో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు తన రాష్ట్రానికి రావద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు తన సహచర ఎంపీలు తనతో చెప్పారన్న ఆయన, రాష్ట్రం ఏమైనా నీ సొంతమా? అంటూ ప్రశ్నించారు.

ఈరోజు ముఖ్యమంత్రి గా ఉంటావు.. రేపు దిగి పోతావని, నా పార్లమెంటు నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవాలనుకోవడం అవివేకమే నని మండిపడ్డారు. గోడకు, రాయికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి చెప్పినా ఒకటేనని విమర్శించారు.. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను తన కాళ్ళ కింద చెప్పుల మాదిరిగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారన్న ఆయన, తన సహచర ఎంపీలు ఎంతోమంది తనని రాష్ట్రానికి వెళ్లవద్దని సూచించారన్నారు., ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యులకు ఏపీ పోలీసులు రఘు రామ రాష్ట్రానికి వస్తే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్టు చేయవలసి వస్తుందని చెప్పారన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులు చేస్తున్న దారుణాలను, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేయాలనుకుంటున్న దురాగతాలను ప్రధానమంత్రి కార్యాలయ దృష్టికి, హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళతానన్న ఆయన, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

విశాఖలో లా జస్టిస్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోడీ నేతృత్వంలో 30 మంది సభ్యులతో సమావేశం కావాల్సి ఉందన్నారు. అయితే ఈ విషయాన్ని కమిటీ సభ్యులు, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్లగా… కమిటీలో రఘురామకృష్ణంరాజు ఉంటే సమావేశాన్ని వాయిదా వేసుకోవాలని సూచించినట్లు తన సహచర సభ్యులు తనతో చెప్పారన్నారు. ఒకవేళ ఆయన వస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని, ఆ తర్వాత ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారని తెలిపారు.దీనితో కమిటీ సభ్యులు రాష్ట్ర పోలీసుల వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తూ, తమ కమిటీ పర్యటనలో భాగంగా కోల్ కత్తా లో సమావేశం కావాల్సి ఉండగా తనని అక్కడకు రావాలని సభ్యులు కోరారని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఈ విషయాన్ని తాను ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకు వెళ్తానని, అయితే తాము అలా అనలేదని అబద్దాలు ఆడుతారన్నారు. వెధవ అబద్ధాలు ఆడితే కుదరదని, ఎందుకంటే కాల్ రికార్డింగ్ లు ఉంటాయని అని చెప్పుకొచ్చారు.

ఎంపీ లేఖ కు సమాధానం చెప్పని డి జి పి
ఒక ఎంపీ రాసిన లేఖకు ఐపీఎస్ అధికారి అయిన డీజీపీ సమాధానం చెప్పకపోవడం విస్మయాన్ని కలిగిస్తోందని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. డీ జీ పి, ఒక ఎంపీ రాసిన లేక కు సమాధానం ఇవ్వకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలో , రూల్స్ బుక్ లో లేదన్నారు. ఎందుకంటే… ఈ తరహా ప్రభుత్వాలు, ఇటువంటి అధికారులు ఉంటారని నిబంధనలను రూపొందించినప్పుడు ఊహించి ఉండరని పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో పోలీసుల ఉన్మాద చర్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతునని చెప్పారు. ఒక ఎంపి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
తనపై ఇప్పటివరకు ఉన్న అన్ని కేసుల్లో స్టే ఆర్డర్ లు ఉన్నాయని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టుకున్నా వాటన్నిటిపై న్యాయపోరాటం చేస్తానన్న ఆయన, ప్రధానమంత్రి మోడీ, భీమవరం పర్యటన ముగిసిన అనంతరం పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే తనపై 124 ఎ రాజ ద్రోహం కింద పెట్టిన కేసుపై సుప్రీం కోర్ట్ స్టే విధించిన విషయం తెలిసిందేనన్నారు. తనని తన నియోజకవర్గానికి రాకుండా అడ్డుకునేందుకు, చిల్లర వేషాలు వేయవద్దని… ప్రధాని పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బుద్ధి, సిగ్గు ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు దెబ్బతినేలా బరితెగింపు చర్యలకు దిగొద్దని హెచ్చరించారు.

తన ఇంటికి కూతవేటు దూరంలో అల్లూరి విగ్రహావిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయాలని చూస్తున్నా… రిస్క్ తీసుకొని నియోజకవర్గానికి వెళ్లడం ఎందుకన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ… మన ప్రాంతానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని, ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా తన గ్రామంలో… తన ఇంటికి కూతవేటు దూరంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి లోక్ సభ నాయకుడు, ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతుంటే, స్థానిక లోక్ సభ సభ్యుడిగా తాను హాజరు కావడం ప్రోటోకాల్ అని చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి హాజరైన, హాజరు కాకపోయినా … తాను మాత్రం హాజరు కావాలన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే నమోదు చేయబోయే కేసులపై స్టే తీసుకోవచ్చు కదా అన్న ప్రశ్నకు, ఊహాజనితమైన కేసులకు న్యాయస్థానాలు స్టే ఇవ్వని పేర్కొన్నారు.

32 కేసులో నిందితుడు విదేశాలకు వెళ్లొచ్చు… కానీ నేను నియోజకవర్గానికి వెళ్ళొద్దా?
32 కేసుల్లో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళవచ్చు కానీ, తాను మాత్రం తన నియోజకవర్గానికి వెల్లావద్దా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పారిస్ వెళ్తానంటే, సి.బి.ఐ అధికారులు ఆయన పర్మిషన్ ఇస్తే కేసు విచారణ ఆలస్యం అవుతుందని పేర్కొనడం ఈ మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోగా, వారిపైనే కేసులు నమోదు చేసి వేధిస్తోందని విమర్శించారు.

క్రాప్ హాలిడే లే …హాలిడే లు
రాష్ట్రంలో క్రాప్ హాలిడే లా పర్వం కొనసాగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రికలో ప్రకటనలు చూసి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తుందని భ్రమ లో ఉన్న ప్రజలకు నెల్లూరు, కోనసీమ, కడప, నరసరావుపేట పక్కన మంత్రిగారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోను రైతులు క్రాఫ్ హాలిడే లను పాటిస్తున్నారని చెప్పుకొచ్చారు.. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా క్రాఫ్ హాలిడే లు లేవని నిస్సిగ్గుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు. నాలుగు నెలలు కావస్తున్నా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. క్రాఫ్ హాలిడే ల ప్రధాన కారణం కాలువల పూడిక తీయకపోవడమేనని పేర్కొన్నారు. డ్రైనేజీ, కాలువ పూడికతీత పనులు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర రైతాంగం కోరుతున్నారని చెప్పారు.

రాష్ట్రానికి దూరంగా ఉన్న తనకే రైతులు ఫోన్లు చేసి చెబుతున్నప్పుడు, ఇక స్థానిక ఎమ్మెల్యే లకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఎన్నిమార్లు చెప్పి ఉంటారు ఊహించుకో వచ్చునని అన్నారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయని, ఇంకా ఎక్కువ కాలం మభ్య పెట్టడం కుదరదని చెప్పారు. నాణ్యమైన ఇసుక, విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం చెబుతుంటే, ప్రజలు మాత్రం నాణ్యమైన ప్రభుత్వము …పరిపాలన కోరుకుంటున్నారన్నారు. ఆక్వా రైతులు కూడా హాలిడే దిశగానే అడుగులు వేసే పరిస్థితులు దాపురించాయని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అనంత జిల్లాలో ఒక వాలంటీర్ 50 మందికి ఈ క్రాప్ చేస్తే, కేవలం ఒకే ఒక్క రైతుకు భీమా సౌకర్యం వర్తించడం పట్ల తనకు తానే చెప్పు తో కొట్టుకున్న సంఘటనను ప్రస్తావిస్తూ, వాలంటీర్ నిజాయితీ, ధైర్యాన్ని అన్ని రఘురామకృష్ణంరాజు అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త పనులన్నీ మానేసి, వ్యవసాయ అభివృద్ధి కోసమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల్లో మీడియా చైతన్యం తీసుకురావాలి
ఒక ఎంపీని తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దమననీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లి, ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేందుకు మీడియా కీలక పాత్ర పోషించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రముఖ సినీ నిర్మాత ఎల్.వి.ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు రఘురామకృష్ణంరాజు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీ రామారావును మనదేశం సినిమా ద్వారా చిత్రరంగానికి తొలి పరిచయం చేసిన వ్యక్తి ఎల్ వి ప్రసాదే నన్న ఆయన, ఎంతోమందికి నేత్ర దానం చేసిన మహానుభావుడు అంటూ కొనియాడారు.

Leave a Reply