ఆ విప్లవ మూర్తి సాక్షిగా రఘు రామాయణం!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అనగానే ఇప్పటి దాకా గుర్తుకు వచ్చేది చేపల చెరువులు. క్షత్రియ యువత దూకుడు. ఇక ముందు, భీమవరం అనగానే, గుర్తుకు వచ్చేది అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం. భీమవరంలో ఆ విప్లవ జ్యోతి కాంస్య విగ్రహం నెలకొల్పాలనే ఆలోచనతో పాటు; దానిని సాక్షాత్తు దేశ ప్రధానితో ఆవిష్కరంప చేయాలనే ఆలోచన వచ్చిన వారికి పాదాభివందనాలు.

2022, జులై 4 వ తేదీ -ఆయన 125 వ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరం వచ్చి ఆ మహనీయుని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఆ విగ్రహం దగ్గర మన నేతలు- గ్రూప్ ఫోటో కోసం నిలబడిన దృశ్యం చూస్తుంటే – వారంతా సీతారామ రాజు మోకాలి వరకే వచ్చారు). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ ఆవిష్కరణ వేడుకను చిరస్మరణీయంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆయన అధికారం చేపట్టిన తరువాత, మొదటి సారిగా ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడంతో జగన్ -పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంతో మమేకమయ్యారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో నిమగ్నం చేయించారు.

తనకు ఇంతటి ప్రతిష్టత్మాకమైన కార్యక్రమానికి – నిత్య అసమ్మతి వాదిగా ఢిల్లీ కేంద్రంగా రేయింబవళ్ళు జగన్ పై ( అంటే విజయసాయి రెడ్డి అని కూడా ) మీడియా (సోషల్ మీడియాతో కలుపుకుని ) యుద్ధం చేస్తున్న ఎం.పీ రఘు రామకృష్ణ రాజును దూరం పెట్టాలని జగన్ నిర్ణయించి ఉంటారు. అయితే, ‘ అది నా నియోజక వర్గం. ప్రధాని కార్యక్రమంలో ఎంపీగా పాల్గొనే హక్కు నాకు ఉంది. ప్రోటోకాల్ ప్రకారం కూడా నేనూ పాల్గొనాలి ‘ అంటూ లా పాయింట్ తీసిన రఘు రామకృష్ణ రాజు – భీమవరం రావడానికి విశ్వప్రయత్నం చేశారు. అందుకు అవసరమైన పలుకుబడి ఆయనకు ఢిల్లీలో ఉంది. రాజనాధ్ సింగ్ లాంటి కేంద్రమంత్రులు కొందరు ఆయనకు స్నేహితులు. ప్రధాని ఆయనను వ్యక్తిగతంగా గుర్తు పడతారు. ఆయన ఏదైనా విన్నపం చేస్తే, ప్రధాని కార్యాలయం తక్షణమే స్పందిస్తుంది. అడిగిన వెంటనే, ఆయనకు గతంలో ‘Y’ కాటగిరీ భద్రత ఇచ్చారు. ‘నేను ప్రధాని కార్యక్రమానికి భీమవరం వెళ్ళాలి. అదనపు భద్రత ఇవ్వండి ‘ అని రఘు రామ రాజు అడిగీ అడగ్గానే ; Z ప్లస్ కేటగిరీ ఇచ్చారు. దేశంలో ఇదే అత్యున్నత భద్రతా వ్యవస్థ. దీనికి పైన , ప్రధాని భద్రతా వ్యవస్థ ఎస్పీజీ మాత్రమే ఉంది. అంతటి శక్తివంతమైన జడ్ ప్లస్ భద్రతను కూడా కేంద్రం కల్పించింది. వీటికి తోడు, భీమవరం రావడానికి ఆయన ఒక హెలికాప్టర్ ను, ఒక ఏసీ రైలు బోగీని బుక్ చేసి ఉంచుకున్నారు. నిజానికి, ఒక మామూలు ఎంపీకి ఇంత రేంజ్ దేశంలో మరో ఎంపీకి లేదేమో అనడంలో అతిశయోక్తి లేదు.

ఇంత బిల్డ్ అప్ ఉన్నప్పటికీ, ఆయన భీమవరం వెళ్లలేకపోయారు. మొన్న సోమవారం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరంలో ఆ మహా యోధుడు – అల్లూరి సీతారామ రాజు కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీనితో, తెలుగు పౌరుషం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు భీమవరంలో 30 అడుగుల కాంశ్య విగ్రహం ఏర్పాటు కావడం అనేది ఆ మహనీయుని నిత్యం స్మరించుకోడానికి దోహదపడే ఓ అపురూప ఘటన. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి – నరసాపురం ఎంపీ (భీమవరం -నరసాపురం లోకసభ పరిధి లో ఉంది )రఘు రామకృష్ణ రాజుకు ఏ దశలోనూ ప్రమేయం కల్పించలేదు. చివరకు కార్ పాస్ కూడా జారీ చేయలేదు.

ఎలాగైనా, ఈ కార్యక్రమానికి స్థానిక ఎం.పీ హోదాలో హాజరు కావాలని రఘురామ విశ్వప్రయత్నం చేశారు. ఆయనకు ఓ అయిదు రోజుల పాటు జడ్ + సెక్యూరిటీని కేంద్రం కల్పించింది. హై కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఆయనను అరెస్ట్ చేయొద్దని, ఆయనకు రక్షణ కల్పించాలని…. హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనకు మద్ధతుగా భీమవరంలో కుర్రాళ్ళు కొందరు ఆదివారం ఊరేగింపు చేశారు. రోడ్ మార్గంలో వెడితే, పోలీసులతో ఇబ్బందులు ఉంటాయేమో అని,హెలికాప్టర్ లో భీమవరం వెళ్దామని ప్లాన్ చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనుమతి లభించలేదు. ఎందుకు లభించలేదో కనుక్కుందామంటే -కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు… ఎవరూ ఫోన్ ఎత్తలేదని ఆయన చెప్పారు. ఇక, లాభం లేదు అనుకుని ఓ ఇరవై మంది ‘లైక్ మైండెడ్..’ మిత్రులతో కలిసి నర్సాపురం ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ నుంచి భీమవరంకు రఘురామ బయలుదేరారు.

లింగంపల్లి స్టేషన్ లో రైలెక్కిన రఘురామ బృందం – ఓ నలభై నిముషాల్లోనే బేగంపేట స్టేషన్ లో దిగేసింది. కధ కంచికి…. రఘు బృందం ఇంటికి క్షేమంగా చేరాయి. స్వంత పార్టీకి చెందిన స్థానిక ఎంపీ పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం కరెక్టా, కాదా అన్నది వేరే పాయింట్. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ సభలో ‘ఆ ఎంపి’ తన కంటికి కనపడకూడదని జగన్ భావించి ఉంటారు. జగన్ ను రఘురామ ఢిల్లీ నుంచి టీవీ మీడియా మాధ్యాల్లో రోజువారీగా విరుచుకు పడుతున్న తీరుతో, ఆయన ఆ విధంగా భావించడంలో అసహజం ఏమీ కనపడదు. యంత్రాంగం ఆయన భావనను అమలు చేసి చూపించింది. ప్రధాని కార్యాలయం – రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన అతిధుల జాబితాలో సైతం రఘురామకృష్ణరాజు పేరు లేదు. అంటే – ఆ వేడుకకు మూడు కిలో మీటర్ల చుట్టు పక్కలకు సైతం ఆయన వెళ్లాడానికి అవకాశం లేకుండా – ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది.

ఈ కార్యక్రమం లో వేదికపై జగన్మోహనరెడ్డి అన్నీ తానై వ్యవహరించారు. ఒకరకంగా వన్ మ్యాన్ షో గా భీమవరం కార్యక్రమం జరిగింది. ఆయన మొహంలో అంత ఆనందం, అంత చలాకీ తనం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఆయన మొహంలో కనపడలేదు. ప్రధాని సైతం – జగన్ ప్రభుత్వ ఏర్పాట్లకు ముగ్దులైనట్టు కనిపించారు. రఘురామ రాజు భీమవరం రాకుండా నిలువరించడంతో పాటు ; ప్రధాని పర్యటనను వీలైనంత ఆహ్లాదకరంగా, అసమ్మతి స్వరం అనేది ఎక్కడా వినిపించకుండా నిర్వహించడం మొదలైనవి కూడా ఇందుకు కారణం అయితే అయి ఉండవచ్చు. ప్రధానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ అందించిన స్వాగత సత్కారాలకు బీజేపీ కేంద్ర నాయకత్వం ముగ్దురాలై పోయింది. ప్రధానికి స్వాగతం ఎలా పలకాలో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డిని చూసి నేర్చుకోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ – తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ ను దెప్పి పొడిచారు.

రఘురామ రాజుకు మరో విషయం కూడా స్పష్టమై ఉండాలి. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం – రఘురామ ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాలు పెట్టలేరు. ఎందుకంటే – జగన్ కు ఆజన్మ బద్ద విరోధిగా రఘురామ మారిపోయారు. చివరికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ సైతం రఘు స్వయంగా వేయలేరు. ఢిల్లీ నుంచో, హైదరాబాద్ నుంచో వేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా ఓ కేస్ రిజిస్టర్ అయింది కనుక ; దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదు. దీని ఫలితంగా, ఆయన ఢిల్లీకే పరిమితం కావలసి రావచ్చు. అయినప్పటికీ, జగన్ పై మీడియా పోరాటానికే ఆయన కంకణ బద్దులై ఉన్నట్టు కనబడుతున్నారు కనుక, దానినే ఆయన కొనసాగిస్తారనడం లో సందేహం లేదు.

ఈ పోరాటం వల్ల ఆయన లోకసభ సభ్యత్వం రద్దు అయితే కాదు. లోకసభలో వైసీపీ గనుక ఏ విషయం మీదనైనా విప్ జారీ చేస్తే ; ఆ విప్ ను ఉల్లంఘించిన సందర్భాలలో మాత్రమే లోకసభ సభ్యత్వం రద్దు చేయవచ్చునని మన రాజ్యాంగం చెబుతున్నది. అందువల్లనే, విజయసాయి రెడ్డి తో సహా వైసీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రఘు సభ్యత్వం రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో తన మీడియా పోరాటాన్ని ఆయన నిరాఘాటంగా గా కొనసాగిస్తారనడం లో అనుమానం లేదు. ఏది చేసినా, ఢిల్లీ నుంచే. వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా … రాష్ట్రంలో కాలు పెట్టడం మాత్రం రఘు రామకృష్ణరాజుకు కుదరదు.
నీతి : ఒక వ్యక్తి కంటే…., ఒక వ్యవస్థ, ఒక వ్యవస్థ కంటే ఒక ప్రభుత్వం బలవంతమైనది. మనుషులు నిమిత్తం మాత్రులు.

Leave a Reply