– లేనిదాని గురించి రాజుగారి రాద్ధాంతం ఎందుకో?
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘అవన్నీ సిగ్గూ ఎగ్గూలేని వారికి గానీ, నీకూ నాకు ఏమిటీ శాస్త్రిగారూ’’.. ఇది ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావు డైలాగ్. సిగ్గుకు సంబంధించి.. అప్పట్లో థియేటర్లలో బాంబులా పేలిన డైలాగు ఇది.
సీన్ కట్ చేస్తే…
సినిమా పెద్దలకు సిగ్గుందా..?
లేని దాని గురించి పదే పదే మాట్లాడిన వారు అమాయకుల కిందే లెక్క. ఆ ప్రకారంగా యుశ్రారైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, ఈ దశాబ్దపు అమాయకుడి కిందే లెక్క.ఇదికూడా చదవండి.. ఆంధ్రాలో అలా.. తెలంగాణలో ఇలా
అసలు రాజు గారి రాద్ధాంతమేమిటంటే…
జనసేన దళపతి కమ్ హీరో పవన్ కల్యాణ్ భీమ్లానాయక్ సినిమాపై, ఆంధ్రాలో జగనన్న సర్కారు ఉక్కుపాదం మోపింది. రిలీజు ముందే థియేటర్ల యజమానులను భయభ్రాంతులను చేస్తోంది. దానికి నిరసనగా పవనన్న అభిమానులు రాత్రి వేళ్లలో ధర్నాల వంటి యాగీలు చేస్తున్నారు. రూల్సు కొరడాను సినిమా రిలీజుకు ముందే ఝళిపిస్తున్నారు.అంతే కదా? రాజు గారి రాద్ధాంతం అదే కదా?
కందకు లేని దురద కత్తికెందుకున్నట్లు.. అసలు సినిమా పెద్దలకు లేని రోషం, రాజుగారికెందుకంట? సరే.. రాజు గారు చెప్పినట్లు.. రాజు కళ్లెర్ర చేసినట్లు.. రాజు శాపనార్ధాలు పెట్టినట్లు… సినిమా పెద్దలకు
సిగ్గులేదు. ఈయన చెబితే వస్తుందా ఏంటి? అయితే ఏంటట? సిన్మావాళ్లకు సిగ్గులేదన్న రహస్యాన్ని రాజుగారు.. వాస్కోడిగామా మాదిరిగా ఇప్పుడే కనిపెట్టినట్లు, ఆ ఆవేదనేమిటి? పొద్దుగూకిన తర్వాత ఆ తిట్లు, శాపనార్ధాలేమిటింట?!
అవును. సినిమా పెద్దలకు సిగ్గులేదు. అదే ఉంటే.. అంతలావు హీరొలంతా కట్టకట్టుకుని జగనన్న దగ్గరకు వెళ్లి, చేతులు కట్టుకుని.. తమరు మాపై దయచూపాలంటూ చేతులు కట్టుకుని, సాధ్యమైనంత డిగ్రీల్లో వంగి, మరీ సలాము చేసి గులాములవరుకదా? ‘త్వరలోనే శుభవార్త వింటారు’ అని జగ్గన్న క్యాంపు ఆఫీసు గేటు బయట, అనాధప్రేతల్లా మీడియాతో మాట్లాడిన స్టార్ల మాటలకు ఇంతవరకూ దిక్కులేదు. సరే.. సిగ్గులేకుండా.. సిగ్గుపడుతూ.. ఏదో చెప్పారనుకోండి. అయితే ఏంటట?ఇది కూడా చదవండి.. హీరోల ‘గిట్టుబాటు’ ఉద్యమం
సినిమాల్లో ఒంటి చేత్తో వందమందిని కొట్టే హీరోలు.. తాడేపల్లికి పిల్లిమొగ్గలేసి, పిల్లుల్లా చేతులు కట్టుకుని, తమకు తాము పరిచయం చేసుకున్నందుకు సిగ్గులేదంటారా? ఏమో మనం నిజాలు మాట్లాడుకోకూడదు. అయితే ఏంటట?
‘మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలం. ‘మాదంతా ఒకటే ఫ్యామిలీ’ అని సిన్మా ఫంక్షన్లలో వాంతులు-విరేచనాలు చేసుకునే ఈ సినిమా పెద్దలు.. తమ తోటి కళాకారుడి సినిమాకు సర్కారు అవరోధాలు
కల్పిస్తున్నా ప్రశ్నించలేక, నవరంధ్రాలూ మూసుకున్నందుకు సిగ్గులేదంటారా? ఏమో.. అయితే ఏంటట?
అసలు సాటి సినిమావాడికి కష్టం వస్తే, నొప్పున్న సినిమా పెద్దలే స్పందించాలి గానీ, ఈ రాజుగారికి నొప్పేందంట?
పవన్ ‘కల్యాణ్ అత్తారింటికి దారేదీ’ సిన్మాలో, పవన్ కల్యాణ్ ‘ఎవరిది వాళ్లే పట్టుకోవాల్రోయ్’ డైలాగు అన్నట్లు.. ఎవరి పురిటినొప్పులు వారే పడాలి. అయినా వాళ్లకు లేని సిగ్గు గురించి ఈయనెందుకు గుర్తుచేస్తారంట? సిగ్గులేని వారికి సిగ్గురావాలని కోరుకోవడం అత్యాశ కదూ?! ఆశ మంచిదే కానీ, సినిమా వాళ్లకు లేని సిగ్గు గురించి ఎక్కువ ఊహించడం, అత్యాశేనన్నది ఫిలింనగర్ పెద్దల ఉవాచ.
పైగా వెధవ కాకుల సామెతొకటి?! ఒక కాకి చచ్చిపోతే వందకాకులు వాలతాయట. సినిమా వాళ్లకు ఆ మాత్రం కూడా సంఘీభావం లేదా అన్నది రాజు గారి నిరసనట. ఈ మాట వింటే కాకులు కూడా, సినిమా వాళ్లను తమతో పోల్చినందుకు సిగ్గుతో చితికిపోతాయేమో? అక్క ఆర్భాటమే గానీ బావబతికుంది లేదన్నట్లు.. అసలు సినిమా కాకులకే ఐకమత్యం లేక, పాలకులను చూసి నిలువెల్లా వణికిపోయి.. చొక్కా-లాగూలు తడిపేసుకుని, బాంచెన్ నీకాల్మొక్త అని, వారి దయ కోసం పాకులాడుతూ పొర్లు దండాలు పెడుతుంటే.. ఇంకా పేదరాశి పెద్దమ్మ జమానా నాటి ఈ కాకి కాథలు, కాకమ్మ కహానీలు ఎందుకు రాజు గారు? కంఠశోష.. అదేదో ఆయాసం తప్ప! రాజుగారు తెలుసుకోవాల్సిన ‘సీక్రెట్ రహస్యమేమిటం’టే.. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టుడియోపై వాలిన కాకి , ఇంకో స్టుడియోపై వాలదు. ఎవరి కాకులు వారికి ముద్దు.
అయినా రాజుగారి చాదస్తం కాకపోతే.. ఒకవైపు ‘అన్నయ్య’ ఏమో తాడేపల్లి వెళ్లి, జగ్గన్నతో సతీసమేతంగా బిర్యానీ తిని, జగ్గన్న నయా సినిమా పాలసీ బహుభేషని కితాబిచ్చారు. మరి ‘తమ్ముడు’ సినిమాపై అదే జగ్గన్న ఉక్కుపాదం మోపితే, పెదవి విప్పాల్సిన అన్నయ్యనే ఇంతవరకూ అయిపు, అజా లేరు. మరి అన్నయ్యకు లేని ఆవేదన రాజుకెందుకని ఫిలింనగర్ జీవుల లా పాయింట్. కరెస్టే కదన్నయ్యా?
ఫర్వాలేదు లెండి. సినిమా పెద్దలకు లేని సిగ్గు గురించి.. టీవీ చానళ్ల ముందు సిగ్గుపడుతూ.. ‘మీకు సిగ్గు లేదా’ అని పరదా మాటున దాక్కుని, సిగ్గుపడుతున్న సినిమావాళ్లను ప్రశ్నించినందుకు… తలుపులేసుకుని సిగ్గుపడుతున్న సినిమా పెద్దల ‘దేవతావస్త్రాలను’, రాజుగారు నిస్సిగ్గుగా విప్పినందుకయినా.. సినిమా వాళ్లకు సిగ్గొస్తే మంచిదన్నది, ‘సినిమా సిగ్గరుల సమాఖ్య’ ఆకాంక్ష.