ఢిల్లీ అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్ స్కాం కేసు
లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే
కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురువింద గింజ సామెత
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదు
లిక్కర్ కుంభకోణానికి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా?
కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాల పార్టీ
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం
– మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి
లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ కావడాన్ని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోంది. కేసీఆర్ బలవంతంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో మీడియా సమావేశం ఏర్పాటు చేయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించారు.
ఢిల్లీలో తీగలాగితే తెలంగాణలో డొంక కదిలినట్లు లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు బయటపడింది. కవితను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగలేదు. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు జరిగింది.
ఢిల్లీలో కేజ్రీవాల్ లిక్కర్ పాలసీలో మార్పు చేస్తున్నపుడు .. ఆ పాలసీకి కేసీఆర్ కుమార్తె కవిత పూర్తిగా సహకరించారు. ఆ పాలసీ వెనకాల కవిత హస్తమున్నట్లు సీబీఐ గుర్తించి ఈడీకి విచారణ కోసం ఆదేశిస్తే వ్యవహారం బయటపడింది. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐ, ఈడీ చేసే దర్యాప్తులకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదని పదే పదే చెబుతున్నప్పటికీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మమతా బెనర్జీ లాంటి వారు బీజేపీ ని విమర్శిస్తున్నారు.
కవిత, కేజ్రీవాల్ చేసిన అవినీతి కుంభకోణాలను విచారణ జరపకుండా విడిచిపెట్టమంటారా అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం. కేసీఆర్ చెప్పినట్లుగా నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటిరోజే…. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు నేరుగా లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే.
కుటుంబాలను అడ్డం పెట్టుకొని, వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ..అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడం నిజంగా బ్లాక్ డేనే. కవితను అరెస్టు చేస్తే స్పందించని కేసీఆర్ .. కేజ్రీవాల్ ని అరెస్టు చేయగానే ఎందుకు స్పందించారో చెప్పాలి.దర్యాప్తు సంస్థల ముందు అందరూ ఒక్కటే అని కేసీఆర్ కు తెలియదా.??
కేసీఆర్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మద్యాన్ని ఏరులై పాలించి, తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరుతో ప్రజల ఓట్లు దండుకునే కార్యక్రమం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన ఓపెన్ బార్లు, బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదు.?
బస్తీల్లో వైన్ షాపులు, ఓపెన్ బార్ల కారణంగా మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం వ్యాపారంలో వేల కోట్లు సంపాదించడమే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పని చేస్తున్నాయి. 2014 లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 4000 కోట్లు ఉంటే.. 2023లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి రూ. 44 వేల కోట్లకు పెరిగింది. ఈ ఘనత బీఆర్ఎస్ పార్టీదే.
బంగారు తెలంగాణ అంటే అదే. ఇదే లిక్కర్ బిజినెస్ మోడల్ అని ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లే ఢిల్లీలో దోచుకోవాలని చూసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుల కుట్ర బయటపడింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు భాగస్వామ్యం అయ్యారో సమాధానం చెప్పాలి.
దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్, కవిత కు అనేక సార్లు నోటీసులు ఇస్తే తప్పించుకుని తిరిగి, సానుభూతిని పొందే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ లిక్కర్ కుంభకోణానికి, బీఆర్ఎస్ పార్టీకి గాని, కేసీఆర్ కుటుంబానికి గాని ఏమీ సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? చెప్పడానికి దమ్ముందా?
ఆప్ ప్రభుత్వం లిక్కర్ విషయంలో వందల కోట్ల అవినీతికి పాల్పడిందని నేను నిరూపిస్తాను,.. అది తప్పని కేసీఆర్ నిరూపిస్తారా? ప్రెస్ క్లబ్, అమరవీరుల స్థూపం దగ్గరకి చర్చించడానికి కేసీఆర్ సిద్ధమా? కవిత అరెస్టు తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు.లిక్కర్ కుంభకోణం విషయంలో మాత్రమే కవితను అరెస్టు చేశారు.
తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుందని కేసీఆర్ చెప్పినట్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ విధానాన్ని ఆచరించింది, కేజ్రీవాల్ అనుసరించారు. కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాల పార్టీ. తెలంగాణ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే అవినీతిపరులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు..?
రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి నన్ను చాలెంజ్ చేశారు. అమిత్ షా గారి అపాయింట్ మెంట్ ఇప్పించాలని.. తన దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన సాక్ష్యాదారాలు అన్ని ఉన్నాయని… సీబీఐ దర్యాప్తులో అవినీతి నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానన్నారు.’’
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి ఇప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయడం లేదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కోరినట్లుగా సీబీఐ దర్యాప్తుకు మీరు ఆదేశిస్తే.. 24గంటల్లో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభిస్తది.
మమ్మల్ని దమ్ముందా అని అడిగిన రేవంత్ రెడ్డి కే ఇప్పుడు దమ్ము వచ్చింది. అధికారంలో ఉన్నది మీరే కదా..! సీబీఐ దర్యాప్తు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. ఎంక్వైరీ జరిపించండి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తక్షణమే సీబీఐ దర్యాప్తుకు ఇవ్వండి. అవినీతిని నిరూపించండి. లేకపోతే మీరు అన్నమాటమీద నిలబడండి.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100రోజులు మాటలతోనే గడిపింది. బీఆర్ఎస్ చేసిన అవినీతిని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మాటలతోనే సరిపెడుతున్నరు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల లక్షలకోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా అక్రమార్కులకు అప్పజెప్పారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడెందుకు దర్యాప్తు కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు జరిపించడం లేదు..?
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. సెటిల్ మెంట్ రాజకీయాలు చేస్తున్నరు. ఢిల్లీకి వెళ్లి ఆర్జీ ట్యాక్స్ పేరు మీద డబ్బులు ఇచ్చి రండి అని పంపిస్తున్నరు. కంపెనీలను, బిల్డర్లను, క్రాంటాక్టర్లను బెదిరించి డబ్బులు వసూల్ చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పంపిస్తున్నరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు భరిస్తున్నరు. రాహుల్ గాంధీ మనుషులు హైదరాబాద్ లో కూర్చొని ఆర్జీ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నరు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అవినీతి, కుంభకోణాలు.కవిత అరెస్టు అయితే మాట్లాడని కేసీఆర్ గారు… కేజ్రీవాల్ అరెస్టు అయితే ఎందుకు స్పందించారో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
దేశంలో అవినీతి చేసిన వాళ్లను, పేద ప్రజలను, సామాన్య ప్రజలను దోపిడీ చేసిన వ్యక్తులను వదిలిపెట్టేది లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే జగిత్యాల సభలో చెప్పారు. బీఆర్ఎస్ చేసిన అవినీతి పైన దర్యాప్తు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. వారి బాటలోనే కాంగ్రెస్ నాయకులు నడుస్తున్నారు. ఆప్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కళ్లముందే కనిపిస్తోంది.
తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీకే మజ్లిస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 17కు 17సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తోంది. కవిత తో వ్యాపారం చేసిన వారే అప్రూవర్ గా మారి వివరాలు చెప్తున్నారు. ఆప్ ప్రభుత్వం చేసిన అవినీతి, కుంభకోణాలను సమర్ధించే స్పోక్స్ పర్సన్స్ గా బీఆర్ఎస్, కాంగ్రెస్, టీఎంసీ నాయకులు మాట్లాడుతున్నరు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏనాడు కూడా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయలేదు. చెయ్యం కూడా.