– 6న రైతు సంఘర్షణ సభకు లక్షలాదిగా తరలి రండి
-వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర
-ఢిల్లీ సర్కారు మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించిన ఘనత రాహుల్ కే దక్కుతుంది
– తెలంగాణ రైతుల బాగు కోసం ఢిల్లీ తరహా ఉద్యమం
– తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని టిఆర్ఎస్ సర్కార్
– పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
– బుధవారం నాటికి 338 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న పాదయాత్ర
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో రైతు రాజ్యం తీసుకురావడానికి కి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 6న వరంగల్ లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతున్న రైతు సంఘర్షణ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్ర బుధవారం నాటికి 338 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నది.
మధిర మున్సిపల్ పరిధిలోని అంబారుపేట గ్రామం నుంచి నిదానపురం, దెందుకూరు, ఖమ్మంపాడు, అన్నవరం మీదుగా చిలుకూరు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలలో ప్రజలనుద్దేశించి భట్టివిక్రమార్క ప్రసంగించారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలు వివాదం తెరపైకి వచ్చిందన్నారు. దేశంలో ఎక్కడ లేని ధాన్యం కొనుగోలు సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న రాక్షస క్రీడలో బలిపశువులుగా మారుతున్న రైతులకు మేమున్నామని ధైర్యం చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రాహుల్ గాంధీ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. రైతుల పక్షపాతి రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ అవిశ్రాంత పోరాటం చేసిందని గుర్తు చేశారు.
దేశ రాజధాని హస్తినలో రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ చేసిన ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చిందని, ప్రధాని మోడీ దిగివచ్చి రైతులను క్షమాపణ కోరడాని అన్నారు. తెలంగాణలో సైతం రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్య, నకిలీ విత్తనాలు, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ తదితర రైతుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి వరంగల్ లో 5 లక్షల మందితో రైతు సంఘర్షణ సభను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ భారీ బహిరంగ సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై రైతుల పక్షపాతిగా తెలంగాణ రైతులకు నేనున్నానని భరోసా కల్పిస్తారని వెల్లడించారు. నియంత్రుత్వ పరిపాలన లో రైతు సమస్యల పరిష్కార వేదికగా నిర్వహించే వరంగల్ రైతు సంఘర్షణ సభకు రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని టీఆర్ఎస్ సర్కార్
కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చనందున ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేస్తున్నానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణ వచ్చి ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవిస్తారని అభిప్రాయపడి కాంగ్రెస్ అధినేత్రి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరక పోగా, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పరిపాలన కొనసాగుతున్నదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడం నేరమైనట్టుగా వ్యవహరించడం దుర్మార్గమని దుయ్యబట్టారు. టిఆర్ఎస్ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిని వేదించి, అక్రమ కేసుల పెట్టి అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు.
కొలువులు వస్తాయని ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడంతో హైదరాబాదులో బతకలేక గ్రామాలకు వచ్చి సుతారీ పనులకు వెళ్తున్న దౌర్భాగ్య పరిస్థితి కెసిఆర్ తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు అవుతున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒకరికి ఇస్తామని హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు.
ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరక పోవడం వల్ల రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజాసమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం మెడలు వంచడానికి మండుటెండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నానని వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ మొండి వైఖరి అవలంబిస్తే ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొట్టుకొని వెళ్లడానికి సైతం తాను సిద్ధమేనని ప్రకటించారు.
సీఎల్పీ నేత భట్టి పాదయాత్రకు మాజీ ఎంపీ సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు బుధవారం మధిర మున్సిపల్ పరిధిలోని అంబారుపేటకు వచ్చి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. గ్రామంలో భట్టివిక్రమార్క గారితో కలిసి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు.