– బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్ర తరం
– 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించనివ్వబోవం
– 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుంది
– బీసీ కోసం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎందుకు మాట్లాడడం లేదు ?
– బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావును నిలదీయాలి
హైదరాబాద్ / మెదక్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడానికి రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తామని, ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని తేల్చిచెప్పారు. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుందని స్పష్టం చేశారు.
బీసీ అంశాలకు సంబంధించి మంగళవారం నాడు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మెదక్ జిల్లా కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనివ్వబోవమని తెలిపారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులుదులుపుకుందని, దాన్ని ఆమోదింపజేయించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం లేదని అడిగారు.
వార్డు మెంబర్, సర్పంచ్ లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని, అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయని, కాబట్టి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కాలంటే కచ్చింతంగా రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాలని డిమాండ్ చేశారు.
“ఇది రాజకీయ వేదిక కాదు. ఇది మానవ హక్కలు, సామాజిక హక్కలు వేదిక. సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా ? ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది… కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కల కోసం పోరాటం చేయాలి. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయి . అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది” అని వ్యాఖ్యానించారు.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదు ? నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతీ ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని, తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనూ అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టిందని వివరించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్ లొ కొంత మంది బెదిరించే ప్రయత్నం చేశారని, దీన్ని బట్టే వాళ్లు భయపడుతున్నారని అర్థమవుతోందని తెలిపారు.
కార్యక్రమంలో యూపీఎఫ్ స్టేట్ కన్వీనర్ బొల్లా శివశంకర్, స్టేట్ కో ఆర్డినేటర్ అలకుంట హరి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, నాయకులు సంపత్ గౌడ్, ఈగ సంతోష్, నరేందర్ యాదవ్, లింగం, ఆనంద్, లలిత యాదవ్, మహేందర్ ముధిరాజ్, శ్రీకాంత్, రాధాకృష్ణ, తేజ, యూపీఎఫ్ స్టేట్ కో కన్వీనర్లు కొట్టాల యాదగిరి, విజయేంద్ర సాగర, కుమారస్వామి, గోపు సదానందం, కార్మిక సంఘం నాయకుడు ఎల్. రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.