నవ్వితే జనాలు బెంబేలు
విలనీలో ఆయనకు జేజేలు
కత్తి పట్టిన ఎన్టీఆర్,కాంతారావు..
హీరో ఎవరైనా
రాజనాల విలన్
కాకపోతే జీరోలే..
దుర్మార్గానికి పెట్టింది పేరు
ఈ శూరసింహుడు..
రామారావుకు మామ..
తెరపై మరో
సుయోధన సార్వభౌమ..
సాంఘికాల్లోనూ
మెరిసిన దుష్టుడు
ప్రతినాయకుడైనా
అందరికీ ఇష్టుడు..?
జేవురించిన మొహం
గూఢచారి 116లో
చైనా అహం
కండలు తిరిగిన దేహం
ఇతగాడిని జయించగలమా
అని హీరోల్లోనూ సందేహం..
దుష్టపాత్రల తొలి సూపర్ స్టార్
రాజసూయం అనంతరం కృష్ణుడు నందమూరిని
పసిబాలుడు కాదు
అంటూ ఎదిరించిన
వంద తప్పుల శిశుపాలుడు..
రాముడిని దండించి
భీముడితో దెబ్బలు తిన్న మేనమామ పానకాలు
సినిమాలో ఇతగాడు
ఉంటే చాలు
నిర్మాత ఇంట డబ్బు సంచులు
అన్నట్టు..ఆంజనేయుడిగానూ
మెరిశాడు ఓ మెరుపు..
శ్రీకృష్ణాంజనేయయుద్ధంలో
ఆయన నటనే
ఓ మైమరపు..
కొందరి ప్రదర్శన ఆయన ముందు నిజంగా దిగదుడుపు
మంచి పాత్ర పోషణ లోనూ
చూపించాడు తన ఒడుపు
రాజనాలది ఓ శకం..
విలనీలో ఆయనది
తిరుగులేని రాచరికం..
జానపదబ్రహ్మ విఠలాచార్యకు
ఎన్టీఆర్..కాంతారావు
ఒకే ఒరలో
రెండు కత్తులు..
ఆయన సినిమాని
రక్తి కట్టించినవి
మాత్రం రాజనాల జిత్తులు
నాయకుల్లో ఎన్టీ వోడు
అందమైన నెలరాజు..
విలనీలో రాజనాల
తిరుగులేని మహారాజు..
రాజనాల కాళేశ్వరావు వర్థంతి సందర్భంగా
నివాళి అర్పిస్తూ..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286