జాతిరత్నమై భారతరత్నమయ్యాడు..!

భారత రాజకీయాల్లో
అనుకోని అతిథి..
అమ్మ..నాన్న..తమ్ముడిలా బలవంతపు మరణాన్ని
బహుమానంగా ఇచ్చింది
పాడు విధి..
లంకకు చేసిన మేలే
కర్ర పామై కరిచిన చందమై
ప్రపంచంలోనే అత్యంత హేయమైన తీవ్రవాదం
మానవ బాంబు విధ్వంసానికి
బలయ్యాడు అందగాడు రాజీవుడు..హతవిధీ..!

ఇందిరమ్మ సంజయ రాయబారం విఫలం కాగా
ఇష్టపడి సోనియమ్మను
చేసుకున్న డూన్ స్కూల్ అబ్బాయి
ఇష్టం లేని మనువుగా
రాజకీయ ప్రవేశం..
అదే అయింది అతగాడికి
ప్రాయోపవేశం…!

వృత్తి విమాన చోదన
ప్రవృత్తి సాహసాల చేదన..
అమ్మానాన్న పెట్టినపేరు రాజీవ్ అయినా
మరోపేరు మర్యాదరామన్న..
అమ్మ ఒడిలో రాజకీయ ఓనమాలు దిద్దుతుండగనే
ఆ ఉక్కు మహిళ అంగరక్షకుల
ముష్కర దాడికి బలైపోగా
తప్పని పరిస్థితుల హఠం
రాజీవుడు అధిష్టించె
అత్యున్నత పీఠం..
కళ్ళు మూసి తెరిచేలోగా
పంజాబ్,అస్సాం
సమస్యల పరిష్కారం..
ఇందిరమ్మ తనయుడికి
మిష్టర్ క్లీన్ పురస్కారం..
అంతలోనే ఫెయిర్ ఫాక్స్
జరిగింది తెరవెనక
మాచ్ ఫిక్స్!
ఆ చిచ్చు ఆరకమునుపే బోఫోర్స్ మచ్చ..
ఈ బుల్లి గాంధీ
రాజకీయ జీవితం రచ్చరచ్చ!!

పరిస్థితులతో పడలేక రాజీ
ఈలోగా పదవికి ముందు వచ్చి చేరింది మాజీ..
అప్పుడు అర్థమైంది రాజకీయాలు కావని
తాననుకున్నంత ఈజీ..!

తేరుకుని మళ్లీ
పేనుకునే లోగా
ఎల్టీటీఈ వేటు..
ఒంటికన్ను రాకాసి
శివరాజన్ ప్లాటు..
మానవబాంబు థాను కాటు! శకలమైన ఆ శరీరం చూసి
జాతి మొత్తం దిగ్భ్రాంతి..
ఆత్మబంధువు పివికి మాత్రం
అందింది ఊహించని బహుమతి..!

ఏదేమైనా భారత రాజకీయాల్లో
రాజీవుడిది
ఓ ప్రత్యేక మార్కు..
నేటి సాంకేతికత
ఆయన స్పార్కు..
తాత గ్లామర్..తండ్రి నేచర్..
తల్లి ఫీచర్..దేశానికి ఇచ్చాడు చక్కని ఫ్యూచర్..!

పేరు గాంధీ..
నియోజకవర్గం అమేథీ..
అభివృద్ధే పరమావధి..
ఆకాశమే ఆనందానికి అవధి..
అందమైన ఈ జాతిరత్నం
ఈ దేశం చిరకాలం గుర్తుంచుకునే భారతరత్నం!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply