Suryaa.co.in

Telangana

రంగనాథ్ గారు.. ఒక్క పార్క్ అయినా కట్టించండి

– ఒక్క చెరువు అయినా పునరుద్ధరించండి
– హెచ్‌డిఆర్‌ఎం సంస్థగా ఏర్పడిన హైడ్రా డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోంది?
– స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి కనీసం ఒక్క గోడైనా కట్టించారా?
– రాష్ట్రం రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్రం నిధులు ఇవ్వట్లేదని అబద్ధాలు
– దమ్ముంటే రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
– కేంద్ర పథకాలకోసం ఎన్ని నిధులు ఇచ్చారో చూపించాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల

హైదరాబాద్: ఆడలేక మద్దల ఓడు అన్న సామెత రేవంత్ రెడ్డి కి అచ్చంగా సరిపోతుంది. అభివృద్ధి చేయలేక కేంద్రం ఏం చేయలేదు, మోదీ ఏం ఇవ్వలేదంటూ పిచ్చి ఆరోపణలు చేయడం తప్ప ఆయన దగ్గర ఇంకోటి లేదు. 16 నెలలుగా సీఎం గా ఉన్నా, ఒక్క సిమెంట్ బస్తా వినియోగించని దుస్థితిలో ఉన్న రేవంత్ రెడ్డి , ‘యంగ్ ఇండియా నా బ్రాండ్’ అని చెప్పుకుంటున్నారు. స్కిల్ యూనివర్శిటీ నిర్మాణానికి కనీసం ఒక్క గోడైనా కట్టించారా?

హైదరాబాద్ నగరానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. జిహెచ్ఎంసి పరిధిలో 100 కోట్లకు ఎకరం విలువైన ప్రాంతాల్లో రోడ్ల మీద గుంతలే కనిపిస్తున్నాయి. రాష్ట్రం రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా, జిహెచ్ఎంసికి కేవలం రూ.3000 కోట్లు కేటాయించి, వాటిని కూడా పూర్తిగా వినియోగించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఇటీవల ఓల్డ్ సిటీ చార్మినార్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌కి కేటాయించిన మొత్తం బడ్జెట్ కేవలం రూ.10 కోట్లు. అగ్ని ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఫైర్ సిబ్బంది వచ్చారు. ఇది గవర్నెన్స్ అని చెబుతారా?

కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధికి చోటేలేదు. వారి పాలన అంటే డిస్ట్రక్షన్, కూల్చివేతలు, రైతు ఆత్మహత్యలు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయకుండా పేదల ఇళ్లను కూల్చడం తప్ప ఇంకోటి కనిపించడంలేదు. భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తోంది – రంగనాథ్ గారు ఒక్క పార్క్ అయినా కట్టించండి, ఒక్క చెరువు అయినా పునరుద్ధరించండి. హెచ్‌డిఆర్‌ఎం సంస్థగా ఏర్పడిన హైడ్రా డిపార్ట్‌మెంట్ ఏం చేస్తోంది?

హైదరాబాద్ నగరంలో వందల కొద్దీ వాటర్ మాఫియా టీమ్ లు నడుస్తుంటే పట్టించుకోరు. వర్షాకాలంలో చిన్న వానకే రోడ్లు తడిసి మురుగునీళ్లతో పొంగిపొర్లుతున్నాయి. పేదవారు కొనుక్కున్న ప్లాట్ల చుట్టూ డ్రైనేజీ పారుతోంది. రేవంత్ రెడ్డి గారు ‘వికసిత్ భారత్‌లో భాగంగా వికసిత్ తెలంగాణ’ అని ప్రకటించారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి మారాలి.

కేంద్రం నిధుల గురించి అర్థం చేసుకోకుండా రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడుతున్నారు. అమృత్, స్మార్ట్ సిటీ వంటి పథకాలలో రాష్ట్రం కనీసం 30-40% కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. రాష్ట్రం రూపాయి కూడా ఇవ్వకుండా కేంద్రం నిధులు ఇవ్వట్లేదని అబద్ధాలు చెబుతున్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. కేంద్ర పథకాలకోసం ఎన్ని నిధులు ఇచ్చారో చూపించాలి. లేదంటే కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదు.

హైదరాబాద్‌కి చరిత్ర ఉంది, భవిష్యత్తు ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మేల్కొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామిగా మారాలి.

LEAVE A RESPONSE