Suryaa.co.in

Telangana

లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి

-పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ మహిళలు చెబుతున్నారు
-లగచర్ల బాధితులతో కలిసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
-గిరిజనులపై రేవంత్ రెడ్డి దురంహకారం చూపిస్తూ వారి భూములు లాక్కుంటున్నాడు
-ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
-లగచర్ల అధికారులపై కాదు…గిరిజనులపై దాడి జరిగింది-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోం. లగచర్లలో పర్యటిస్తాం- ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య

హైదరాబాద్: లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు విమర్శించారు. బాధిత మహిళలతో కలిసి శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలిశారు. కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదును సమర్పించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు తమపై పోలీసులు ఏ విధంగా అఘయిత్యాలకు పాల్పడ్డారో కమిషన్ కు వివరించారు.

రైతులు దాడులు చేశారన్న కారణంతో అర్థరాత్రి ఇంటిపైకి వచ్చి మహిళలను బూతులు తిట్టారని…లైంగికంగా వేధించారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేయాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.

గిరిజనులపై రేవంత్ రెడ్డి దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు-సత్యవతి రాథోడ్
కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పరాకాష్ట పాలనకు లగచర్ల లో పోలీసుల అమానుష దాడియే ఉదాహరణ అన్నారు. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం గిరిజనులపై దురహంకారంతో వ్యవహరిస్తూ వారి భూములను లాక్కుకుంటారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గంలో రైతులను మెప్పించటంలో వైఫల్యం చెందిన రేవంత్ రెడ్డి…ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మెప్పిస్తాడో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే మాకు లాభం జరగుతుందని గిరిజనులు అనుకుంటే వారి పొట్టకొడుతున్నాడని విమర్శించారు.

ఫార్మా కంపెనీ కారణంగా కాలుష్యం తో జీవితాలు ఆగమావుతాయని లగచర్లలో చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని…ఈ రేవంత్ రెడ్డికి మాత్రం ఎందుకు సోయి లేదో చెప్పాలన్నారు. కడుపు కాలి తిరగబడితే వారిపై నాన్ బెయిల్ కేసులు పెట్టటమేమిటనీ ప్రశ్నించారు. అర్థరాత్రి, అపరాత్రి అని చూడకుండా రైతులను జైలుల్లో పెట్టటం అమానుషమని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీని మెప్పించేందుకు పెడుతున్న దృష్టిలో 10 శాతమన్న ఇక్కడ ప్రజలపై పెట్టాలని సూచించారు. ఇకనైనా బుద్ధి మార్చుకొని…గిరిజనులను వాళ్ల బతుకు వాళ్లు బతికేలా వదిలేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారాడని మండిపడ్డారు. కలెక్టర్ పై దాడులు చేశారంటూ అమాయకులైన రైతులపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. వెంటనే రైతులపై పెట్టినా కేసులను ఉపసంహరించుకోవాలన్నారు.

అధికారులపై కాదు…గిరిజనులపైనే దాడి జరిగింది-ఆర్ఎస్పీ
లగచర్లపై నిజానికి ఎస్సీ, ఎస్టీలపైనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రైతులు దాడులు చేశారన్న నెపంతో ఎస్సీ, ఎస్టీ మహిళలపై పోలీసులు అసభ్యకంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎస్సీ, ఎస్టీ మహిళలు చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు.

వెంటనే ఆ పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు అత్యాచార కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ మహిళపై చేస్తున్న దమనకాండను రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తోందన్నారు. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం చేయాలని కమిషన్ ను కోరామని ఆయన చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఊరుకోం-కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులను నియంత్రించే విషయంలో కమిషన్ కఠినంగా వ్యవహరిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య చెప్పారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతామన్నారు. త్వరలోనే లగచర్లలో కమిషన్ పర్యటిస్తుందన్నారు.ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని గట్టిగా చెప్పారు. ఫార్మా కంపెనీ కారణంగా భూములు కోల్పోతున్న గ్రామస్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు. కమిషన్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, నాయకులు, జాన్సన్ నాయక్, రూప్ సింగ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు.

LEAVE A RESPONSE