-తన భూమి లాక్కుని తనను చంపేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదు
-కోర్టు ఆదేశంతో ఆర్.కృష్ణయ్యపై రాయదుర్గం పీఎస్‌లో కేసు
-నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
-రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అవకాశమున్న రోజే కేసు నమోదు
బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, తాజాగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన రవీందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు జారీ చేసిన ఆదేశాలతో హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ పరిధిలోని తన భూమిని ఆర్.కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేయడంతో పాటుగా తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆయన ఆర్.కృష్ణయ్యపై కీలక ఆరోపణలు చేశారు. ఇవే ఆరోపణలతో రవీందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఆర్.కృష్ణయ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్.కృష్ణయ్య సహా మరికొందరిపై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ కోటా నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ఇటీవలే ఆర్.కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య సహా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆర్.కృష్ణయ్యపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడం గమనార్హం.