Suryaa.co.in

Andhra Pradesh

రుషికొండ ఖర్చు రూ. 500 కోట్లు రోజారెడ్డి నుంచి రికవరీ చేయండి

– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్

అమరావతి: రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లు ఐదేళ్ళ వైసీపీ పాలనలో జనం సొమ్ము జగన్ పాలైందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారతీ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ జల్సాల కోసం, నీరో చక్రవర్తిలా విలాస వంతమైన జీవితం కోసం రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, ఇందుకు అనుమతులను, నిధులను మంజూరు చేసిన పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్. కె. రోజా రెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని, రుషికొండ ఖర్చు రూ.500 కోట్లు ఆమె నుంచి రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

పర్యావరణాన్ని, నిబంధనలను పాటించని అధికారులపై కూడా చర్యలు అవసరం అన్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు రుషికొండ ను కేస్ స్టడీ అని పేర్కొన్నారని, ఈ కేసులో అక్రమార్కులపై చర్యలు తీసుకుంటే, దేశానికి ఈ కేస్ స్టడీ ఆదర్శంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనలో అవినీతి గూర్చి, నిధుల దుర్వినియోగం గూర్చి మాటల్లో కాకుండా చేతల్లో చూపాలన్న డిమాండ్ ప్రజల్లో బలంగా ఉందని తెలిపారు. తాడూ బొంగరం లేని స్కిల్ స్కాం పేరిట కేసు కట్టి చంద్రబాబును అరెస్టు చేశారని, కృత్రిమ కేసుల్లో పలువురు టీడీపీ నాయకులను కూడా అరెస్టు చేశారని గుర్తు చేశారు.

జగన్ సర్కారులో అవినీతి పరులు, దౌర్జన్యకాండకు పాల్పడిన వారు హైదరాబాద్ లో ఆనందంగా విహరిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను బాలకోటయ్య కోరారు.

LEAVE A RESPONSE