Suryaa.co.in

Andhra Pradesh

రెడ్డిగారి జగన్భక్తి చూడతరమా?

– ఉద్యోగులతో వైసీపీకి ఓటు వేయించాలట
-జనంతో చెప్పి జగనన్న పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలట
-సీఎం చెప్పింది ఉద్యోగులు ఫాలో అయి తీరాలట
– ఉద్యోగులకు సర్కారు సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి జగనోపదేశం
– సచివాలయంలోనే రెడ్డి గారి జగన్భక్తి
– ఎన్నికల సంఘం బ్లాక్ ఎదురుగానే ప్రెస్‌మీట్
– కోడ్ సమయంలో ఏమిటీ ధిక్కారం?
– ఎన్నికల సంఘం స్పందించేదెప్పుడు?
(అన్వేష్)

ఆయన కరుడుగట్టిన సీఎం జగనన్న భక్తుడు. పూర్వాశ్రమంలో ఉద్యోగ సంఘ నేతగా వెలగబెట్టారు. చంద్రబాబునాయుడు హయాంలో ఆ సర్కారును ఆయన సంఘం ముప్పుతిప్పలు పెట్టింది. డిఏ, బకాయిల వంటి పెండింగ్ సమస్యలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఆయన అభిమానించే జగనన్న సర్కారు వచ్చింది.

మరి జగనన్న సర్కారులో ఆయన సంఘమేమైనా, బాబు జమానా మాదిరిగా ఒంటికాలిపై లేచిందా అంటే.. లేదు. ఏకంగా సాష్టాంగపడింది. అందుకు నజరానాగా రెడ్డి గారికి సర్కారీ సలహాదారుపదవి వరించింది. అంతే.. అప్పటినుంచీ.. ఉద్యోగులను వైసీపీ దొడ్డిలో కట్టేసే శ్రమదానం ప్రారంభించారు. వీనుల విందుగా, తాదాత్మ్యంతో జగన్భక్తి రాగాలు ఆలపిస్తూ, అపర అన్నమయ్య అవతారమెత్తారు. జగనోపదేశం ఇస్తూ తరిస్తున్నారు.

ఇప్పుడు ఎన్నికల కోడ్ సమయంలో కూడా, నిర్భీతిగా జగన్భక్తి ప్రదర్శించారు. ఉద్యోగులంతా జగనన్న పార్టీకి ఓట్లు వేయించాలని ప్రెస్‌మీట్ పెట్టి మరీ పిలుపునిచ్చారు. ఆయనది జగన్బాధ మరి. అయితే ఇదంతా ఏ కాకులు దూరని కారడవుల్లో.. చీమలు దూరని చిట్టడవుల్లో అనుకుంటే క చ్చితంగా పప్పులో కాలేసినట్లే. అచ్చంగా సచివాలయంలోని 5వ బ్లాక్ వద్ద కనిపించిన దృశ్యమిది.

హలో.. 5వ బ్లాక్ దగ్గర జరిగితే ఏంటనుకుంటున్నారా? దాని ఎదురే ఎన్నికల సంఘం కార్యాలయం ఉంది మరి. అదీ సంగతి. ఇప్పటిదాకా తన వద్దకు వచ్చిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్న ఎన్నికల సంఘం అధికారులు, దీనికి సంబంధించి రెడ్డిగారిపై వచ్చే ఫిర్యాదులను కూడా బుట్టదాఖలు చేస్తుందా? చర్యల కొరడా ఝళిపిస్తుందా అన్నది చూడాలి.

ఇంతకూ రెడ్డి గారి జగన్భక్తి ఏ స్థాయిలో ఉందో మీరే చూడండి.. చంద్రశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే..జగన్ సర్కార్‌ కు ఉద్యోగులు అందరూ అండగా నిలవా లి. ఉద్యోగులంతా పనిగట్టుకుని సామాన్య ప్రజలకు చెప్పి మరీ ఓటేయించేలా చర్యలు తీసుకోవా లి. విపక్ష పార్టీలు ఉద్యోగుల మీద అభాండాలు వేస్తున్నాయి.

ఉద్యోగులు ప్రభుత్వంలో ఓ భాగం. వారంతా ఈ ప్రభుత్వానికి పట్టం కట్టాలి. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఏదైనా చెబితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఉద్యోగుల బాధ్యత. రాష్ట్రాన్ని బాగుపరచాలని ముఖ్యమంత్రి జగన్ వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్ధను తెచ్చా రు.

ప్రతిపక్ష పార్టీలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ వ్యవస్ధలను, ప్రభుత్వాన్ని ఏదో రకంగా తప్పుబట్టడం ఫ్యాషన్ అయిపోయింది. తెలుగుదేశం, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్‌లో ఓ ఎమ్మెల్యేగా నిలుచునే ఓ వ్యక్తి వలంటీర్ వ్యవస్ధనే తప్పుపడుతున్నారు.

ప్రతిపక్షాలు చెప్పినట్టు పోలీసులు ఎందుకు ఫాలో అవుతారు? ఏ వ్యక్తి కోసమో పార్టీకోసమే చెప్పినట్టు నడుచుకోవడం కుదరదు. పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మమ్మల్ని బెదిరిస్తారా? నోరు అదుపులో పెట్టుకోని ఉద్యోగుల విషయంలో మాట్లాడాలి.

ఉద్యోగ సంఘ నాయకులు సంతోషంగా ఉంటే విపక్షం చూడలేకపోతోంది. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు మంచిగా ఉంటే తప్పా?

LEAVE A RESPONSE