– 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమల్లోకి స్లాట్ బుకింగ్
– స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పందన
– మొదటి రోజు 626 రిజిస్ట్రేషన్లు
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : ప్రజలకు సులువుగా న్యాయమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గురువారం నుండి స్లాట్ బుకింగ్ విధానం అమలు లోకి వచ్చిందని ఇక్కడ వచ్చే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామన్నారు. రెవెన్యూ విభాగంలో ఏ సంస్కరణ చేపట్టినా, ఏవిధానపరమైన నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణంలోనే ఉండాలని అధికారులకు సూచించారు. తొలిరోజు స్లాట్ బుకింగ్ అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్లాట్ బుకింగ్‌పై ప్రజలలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తొలిరోజు గురువారం నాడు 626 మంది స్లాట్ బుకింగ్ చేసుకున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చి గంటల తరబడి చెట్ల కింద నిరీక్షించి క్యూ లైన్లలో నిల్చోనే పరిస్దితికి అడ్డుకట్ట వేసేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకు, పారదర్శకతను తీసుకురావడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో క్యూలైన్లకు గుడ్‌బై చెప్పే రోజులు వస్తాయని దళారులు ప్రమేయం కూడా ఉండబోదన్నారు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుండడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ registration.telangana.gov.in స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏరోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుకింగ్ ఉపయోగపడుతుందని అలాగే సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా ప్రజలు మెరుగైన సేవలు అందుతాయని అన్నారు.
స్లాట్ బుకింగ్ ద్వారా అపాయిమెంట్ తేదీ, సమయాన్ని కూడా ముందే తెలుసుకోవచ్చునన్నారు. నిర్దేశిత తేదీ, సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకోవచ్చు అన్నారు. కొనుగోలుదారులు, అమ్మకం దారులు, సాక్షులు తగిన సమయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు చేరుకోవడానికి వీలు కలగనుంది. పారదర్శకతతో మధ్యవర్తుల ప్రభావానికి తెరపడనుందన్నారు.