October 8, 2026

రైతులపై అక్రమ కేసుల నమోదు దారుణం

  • మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి జూరాల ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత దారుణమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తమ హక్కుల కోసం పోరాడుతున్న అన్నదాతల చేతులకు బేడీలు వేయడం, అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు.

ఎంతో కష్టపడి పెంచుకున్న పంటలు కళ్ళముందే ఎండిపోతుంటే తట్టుకోలేక నీటి కోసం నిరసన తెలిపిన రైతులను క్రిమినల్స్‌లా చూడటం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై నమోదైన కేసులను ప్రభుత్వం వెంటనే, బేషరతుగా ఉపసంహరించుకోవాలని కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రైతుల పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాల్సింది పోయి, వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

Total Visitors: 2,899,765