Suryaa.co.in

Andhra Pradesh

బాబూజీ.. ఇదీ మా పనితీరు!

– వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి కి నివేదిక
– ముఖ్య కార్యక్రమాల కింద 12 కొత్త కార్యక్రమాలు… పనితీరు ప్రస్తావన

అమరావతి: రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గత ఆరు నెలలుగా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ & వైద్య విద్య శాఖ పనితీరు నివేదికను ఆ శాఖ శుక్రవారంనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సమర్పించింది. వివిధ ప్రధాన ఆరోగ్య పథకాల కింద కొత్తగా తీసుకొచ్చిన పన్నెండు కార్యక్రమాలు, మెరుగుపడిన పనితీరును ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించింది:

1.అందరికి క్యాన్సర్ పరీక్షలు (యూనివర్సల్ క్యాన్సర్ స్క్రీనింగ్):
పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ ఏడాది నవంబర్ 14న అందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్‌ను ప్రారంభించింది. ఎన్‌సిడి(NCD) 3.0 (నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్ సర్వే 3.0) కింద ఇప్పుడు మహిళలల్లో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. మునుపటి ఎన్‌సిడి సర్వేలలో కేవలం రక్తపోటు, మధుమేహం, రెండింటితో బాధపడుతున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. ఈ సర్వే కింద ఇప్పటివరకు 33,58,347 మందిని పరీక్షించారు. తదుపరి వ్యాధి నిర్ధారణ, చికిత్స నిర్వహించాల్సిన 29,469 మంది క్యాన్సర్ అనుమానిత మహిళలను గుర్తించారు.

2. రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం (ఆర్‌బిఎస్‌కె):
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది విద్యార్థుల్లో వివిధ వ్యాధులు, వైకల్యాలను ముందుగానే గుర్తించి, దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి వీలుగా పరీక్షలు నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 6 నెలల్లో, 488 శస్త్రచికిత్సలు జరిగాయి, వాటి వివరాలు: 108 చీలిన పెదవులు(క్లెఫ్ట్ లిప్) & చీలిన అంగుడు(క్లెఫ్ట్ పలాటె), 150 పెద్ద కాలు(క్లబ్ ఫుట్), 24 కంబునాడిని తిరిగి అమర్చడం(కాక్లియర్ ఇంప్లాంట్లు), 13 పుట్టుకతో వచ్చే వ్యాధులు, 3 హిప్ డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేయా(పిల్లల్లో నడుము, తొడ ఎముకలు సరిగ్గా అతుక్కోకపోవడం)

3. గ్రామీణ, పట్టణాల్లో పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించడం కోసం, వారికి 87 రకాల డయాగ్నస్టిక్ టెస్ట్‌లు చేయడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో 3 సిటీ డయాగ్నస్టిక్ సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.

4.ఇ-ఐసియు : మారుమూల, అలాగే గిరిజన ప్రాంత ప్రజల ప్రయోజనం కోసం, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సహకారంతో గోల్డెన్ అవర్‌(అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించేందుకు అవకాశమున్న సమయం)లో తక్షణ వైద్య సేవను అందించడానికి ఏరియా హాస్పిటల్‌లో ఈ సర్వీసును తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 8 పడకల సామర్థ్యంతో రంపచోడవరం, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులు ప్రారంభమయ్యాయి.

5.గుండెకు భరోసా (ఎస్‌టిఇఎమ్ఐ (STEMI) ప్రోగ్రామ్): పలు మార్లు ట్రయల్ రన్స్ నిర్వహించిన తర్వాత, గోల్డెన్ అవర్‌లో క్రిటికల్ హార్ట్ కేర్‌ను అందించడం కోసం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. గుండె కండరాల వ్యాధుల(కార్డియో వాస్కులర్ వ్యాధులు)తో మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించడం కోసం 22 పెద్ద ఆసుపత్రులను హబ్‌లుగా, అలాగే 234 సిహెచ్‌సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఇందులో చేర్చారు. గోల్డెన్ అవర్‌లో మరింత క్లిష్టమైన చికిత్సను అందించడానికి వీలుగా టెనెక్‌ప్లేస్ ఇంజెక్షన్‌ను ఇస్తున్నారు, బహిరంగ మార్కెట్‌లో రూ.45,000 ధర ఉన్న ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా అందించడం విశేషం. ఇలా ఇప్పటివరకు 971 మంది రోగులను ప్రాణాపాయం నుండి రక్షించారు.

6.రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి 30 పాయింట్లతో జిజిహెచ్‌లకు కార్యాచరణ ప్రణాళిక
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో రోగి, సందర్శకులు స్నేహపూర్వక వాతావరణం పొందేలా మార్పులు చేయడానికి, అలాగే సకాలంలో నాణ్యమైన, విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సర్వీసులను అందించడానికి 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆగస్టు 13న ప్రకటించారు. అప్పటి నుండి వివిధ కార్యాచరణ అంశాలకు సంబంధించి జిజిహెచ్‌ల పనితీరును ప్రతి నెల ఆయన సమీక్షిస్తున్నారు.

7. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా 2024-25 సంవత్సరానికి ఆయుష్ శాఖ బడ్జెట్ 400 రెట్లు, అంటే రూ.84 కోట్లకు పెరిగింది.

8.విపత్తు సంసిద్ధత, విపత్తు సమయంలో వెంటనే స్పందించేందుకు అవసరమైన ప్రణాళిక కోసం సుమారు రూ.14 కోట్లతో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – వైజాగ్‌లో రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సిబిఆర్ఎన్) మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమైంది.

9. తృతీయ స్థాయి వైద్య సేవల సౌకర్యాలపై పడుతున్న భారాన్ని, అలాగే ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చును తగ్గించే ఉద్దేశంతో అత్యవసర శస్త్రచికిత్స, ఇంటెన్సివ్ కేర్ సర్వీసులను నిర్వహించడానికి జిల్లా స్థాయిలో మొత్తం రూ.230 కోట్లతో, ఒక్కొక్కటి 75 పడకలతో, 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు చేయడమైంది.

10. మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎమ్ఎస్‌యు) ఏర్పాటు: రూ.20 కోట్ల వ్యయంతో జిజిహెచ్ -గుంటూరులో ఎమ్‌ఎస్‌యు ఏర్పాటు చేయడమైంది. ఇది గుంటూరు, విజయవాడ నగరాల్లో వ్యాధి వ్యాప్తిపై రియల్ టైమ్ రిపోర్టింగ్‌తో పాటు వ్యాధి నిఘా కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ చోట్ల నుండి ఆరోగ్య సంబంధిత సంఘటనలపై హెచ్చరికలు పంపుతుంది.

11. 25 బోధన, జిల్లా ఆసుపత్రులలో జన్ ఔషది కేంద్రాల ఏర్పాటును మొదటి దశలోనే చేయడమైంది, అలాగే గడువులోగా విస్తరించడంపై దృష్టి సారించడమైంది.

12. వైద్య విద్య స్థితిని ఆరోగ్య మంత్రి సమీక్షించిన తర్వాత… బోధన, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి, అలాగే ఇతర ప్రముఖ వైద్య సంస్థలతో పోటీ పడటం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో పాల్గొనవలసిందిగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలు సన్నాహాలు ప్రారంభించాయి.

LEAVE A RESPONSE