Suryaa.co.in

Telangana

చెప్పు చూపిస్తారా? ఇదేం పద్ధతి?

– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

హైదరాబాద్: “ఇవాళ్టి సమావేశాల్లో ఒకే ఒక మంత్రి అసెంబ్లీలో ఉన్నారు. ఆయన భూ భారతి బిల్లు పై చదువుకుంటూ వెళుతున్నారు. రాష్ట్రానికి, దేశానికి ఎంతో ముఖ్యమైన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ గురించి మేం స్పీకర్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించాం. రేసింగ్ పై చర్చ పెట్టండి. ఏం జరిగిందో మేం వివరిస్తాం అని చెప్పాం. కానీ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడులు చేశారు. పేపర్లు విసరడమే కాకుండా, చెప్పు తీయడం, బాటిల్ విసరడం వంటి చర్యలకు పాల్పడ్డారు “అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ విరుచుకుపడ్డారు.

“మాట్లాడితే చాలు. దళిత స్పీకర్, దళిత స్పీకర్ అంటున్నారు. అలా అనడం ద్వారా స్పీకర్ ను వారే అవమానిస్తున్నారు. శాసనసభాపతి అంటే అందరికీ గౌరవనీయమైన వ్యక్తి. అలాంటి స్థానంలో ఉన్న వ్యక్తిని అనవసరంగా దళిత స్పీకర్ అని ప్రస్తావిస్తున్నారు. దళితుడ్ని మీరు అవమానించారంటూ విపక్ష సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్టు ఒకటైతే, మీరు మాట్లాడుతున్నది మరో సబ్జెక్టు” అని తలసాని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం భూ భారతి బిల్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా, విపక్ష బీఆర్ఎస్ సభ్యులు ఈ-కార్ రేసింగ్ ఈవెంట్ పై చర్చకు డిమాండ్ చేశారు. దాంతో సభ ముందుకు నడవని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

LEAVE A RESPONSE