– రేవంత్ రెడ్డి జోకర్ ముఖ్యమంత్రి
– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: తన పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పరిపాలన చేతకాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసుల పేరుతో నాటకాలు ఆడుతున్నాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల క్రితం నోటుకు ఓటు కుంభకోణంలో నోట్లకట్టలున్న నల్లబ్యాగుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో పెండింగ్ లో ఉందన్న విషయం గుర్తు చేసిన కేటీఆర్, ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులున్న నేపథ్యంలో.. ఇద్దరిలో దోషులెవరో, నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టును ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా అని సవాలు విసిరారు. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్దం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా సూటిగా ప్రశ్నించారు.
అబద్ధాలతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వాన్ని నడపడం చేతకాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకు పూటకో వేషం వేస్తున్నాడు. రోజుకో కుట్ర చేస్తున్నాడనీ, కానీ ఈ చిల్లర చేష్టలు, పనికిరాని డ్రామాలతో ప్రతినిత్యం తెలంగాణ ప్రజల గొంతుకై పోరాడుతున్న మమ్మల్ని అడ్డుకోలేరని ఈ దద్దమ్మ సీఎం, ఈ వైఫల్యాల కాంగ్రెస్ సర్కారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.
ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండిఏ అధికారిక బ్యాంకు ఖాతా నుంచి పారదర్శకంగా, సాధికారికంగా పంపిన 44 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్ లోనే ఉన్నా, వాటిని వెనక్కి రప్పించడం చేతకాని ముఖ్యమంత్రి మరోసారి ఏసీబీ నోటీసులు తనకు ఈరోజు పంపించాడని కేటీఆర్ తెలియజేశారు.
హైదరాబాద్ నగరానికి తెలంగాణకు ఎంతగానో పేరు తీసుకువచ్చిన ఫార్ములా ఈ రేసును అర్ధాంతరంగా రాజకీయ దురుద్దేశంతో రద్దు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫార్ములా ఈ సంస్థ వద్ద ఉన్న 44 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం ఉద్దేశాపూర్వకంగా పక్కనపెట్టి, నోటీసుల పేరుతో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేశారన్నారు. తనకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన, విచారణ పేరుతో సాగదీసినా ఫార్ములా ఈ అంశం సంపూర్ణ పారదర్శకంగా జరిగిందని, ఈ విషయం అందరికీ తెలుసు అని కేటీఆర్ అన్నారు.
ఈరోజు తాజాగా మరోసారి ఇదే అంశంలో ఏసీబీ తనకు నోటీసు ఇచ్చిందని తెలిపిన కేటీఆర్, చట్టాలను గౌరవించే పౌరుడిగా, తప్పకుండా సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు హాజరవడంతోపాటు.. విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తానన్నారు.
ఓవైపు మీ దివాళాకోరు విధానాలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఓ ముఖ్యమంత్రిగా నిస్సిగ్గుగా మీ అసమర్థతను చాటుకుంటున్న ఈ తరుణంలో విచారణల కోసం ప్రజాధనాన్ని వృధా చేయడం మానుకుని, వెంటనే లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ సిద్ధం కావాలన్నారు. లై డిటెక్టర్ పరీక్ష ద్వారా ఎవరు నేరస్తులు తెలంగాణ ప్రజలు తేల్చేందుకు అవకాశం ఇయ్యాలన్నారు.