– ఇదేనా మీ కాంగ్రెస్ సంస్కృతి?
– తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
విజయవాడ: ‘‘ నువ్వు ఆంధ్రోడివి. ఆంధ్రోడిలానే ఉండు ఇక్కడ. బతకడానికి వచ్చావు. నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా. మీకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వ్యాపారాలు చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఖబడ్దార్’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, హీరో అల్లు అర్జున్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. విభజన జరిగి ఇన్నేళ్లయినా పరిస్థితి మారలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ… ఏపీ వాళ్లు తెలంగాణలో ఉండాలంటే ప్రత్యేకంగా వీసా తీసుకోవాలా? అని ప్రశ్నించారు. 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి? ఇదేనా మీ కాంగ్రెస్ సంస్కృతి? మీ ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే తెలంగాణ సమాజం సైతం మీ కాంగ్రెస్ పార్టీని క్షమించదు’’ అని విష్ణువర్ధన్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపతిరెడ్డి వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.