– ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు?
– రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇదేనా?
– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వంపై చేసిన తప్పుడు ఆరోపణలను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.
గతంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ నగరాల అభివృద్ధి కోసం స్మార్ట్‌సిటీ కింద కోట్లాది రూపాయల నిధులను కేటాయించింది. అయితే ఆ నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లించి నగరాల అభివృద్ధిని అడ్డుకుంది. ఇప్పుడు అదే పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.
భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరం జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వినియోగించి ఉంటే, ఈరోజు వరంగల్ ఈ దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదు. రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, నిర్లక్ష్య వైఖరే ఈరోజు వరంగల్ రోడ్లు, కాల్వలు, ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.
2024 లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు రూ.5,858 కోట్లు వరద సాయం (NDRF) నిధులుగా విడుదల చేసింది. వాటిలో తెలంగాణకు రూ.416.80 కోట్లు విడుదల చేసింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా అందించలేదు? ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు?
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్లను ఆరబోసుకుంటూ మార్కెట్ యార్డుల్లో ఎదురుచూస్తున్నారు. పంటలు నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం లభించలేదు. ప్రతి సారి పంట నష్టాలు సంభవించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం పేరుతో ప్రకటనలు చేయడం, తూతూ మంత్రంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం తప్పితే.. కార్యాచరణలో మాత్రం ఏమాత్రం నిజాయితీ లేదు.
రైతుల కన్నీళ్లు తుడవకుండా ప్రకటనలకే పరిమితమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఇదేనా? ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతుల పక్షాన బిజెపి పోరాటం ఉధృతం చేస్తుందని హెచ్చరిస్తున్నాం.