కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్మీ విద్యార్థుల మనోభావాలకు భిన్నంగా చేసిన నిర్ణయ ఫలితమే ఈ ఆందోళన అన్నారు. దేశభక్తితో సైన్యంలో చేరడానికి సిద్ధపడిన యువత ఇంతలా ఆందోళనకు దిగారంటే ‘అగ్నిపథ్’ సరైనది కాదన్నారు.
ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని రేవంత్ ట్వీట్ చేశారు. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ లేకపోవడం, ఆర్మీలో లక్షల ఖాళీలు ఉండగా.. ఇప్పుడు కేవలం నాలుగేళ్ల సర్వీసుతో కేవలం వేల మందిని మాత్రమే నియమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళన కారులు నాలుగు రైళ్లకు నిప్పు పెట్టారు. వేలాది మంది యువకులు రైలు పట్టాలపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. దాంతో, సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు.