Suryaa.co.in

Telangana

రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

-వంద రోజులైనా రుణమాఫీ అమలు చేయలేదు
-నీళ్లందించలేని అసమర్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
-రైతులను పరామర్శించకుండా ఎగతాళి చేస్తున్నారు
-రూ.25 వేలు పంట నష్టం చెల్లించాలి
-కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం నాటకం
-కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్‌ తెచ్చిన కరువు
-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్త్త మాటలు ఆపు
-నల్గొండ రైతు మల్లయ్యను కలిసిన కేటీఆర్‌

రైతాంగానికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నల్గొండ మండలం ముషంపల్లి గ్రామంలో సోమవా రం రైతు గన్నెబోయిన మల్లయ్యను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. తమ పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని, మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని గతంలో మల్లయ్య వీడియో వైరల్‌ అయింది. ఆ వీడియో చూసి చలించిన కేటీఆర్‌ ఆయనను తప్పకుండా కలుస్తానని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. చెప్పినట్లే సోమవారం ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. నేటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకు చిహ్నంగా నిలిచిన బోర్ల రామిరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్‌ వందల సార్లు చెప్పారు… ముచంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రామిరెడ్డిగా మారింది… గన్నెబోయిన మల్లయ్య యాదవ్‌, బోర్ల రామిరెడ్డి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతిఒక్కరికీ బాధ కలుగుతుందన్నారు. అందుకే మల్లయ్యను ప్రత్యేకంగా కలిసేందుకు వచ్చాను. రామిరెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, మహిళలను కలిసినా గత పదేళ్లలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పారు. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయా య్‌, తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దీనావస్థను చెప్పుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతిఒక్కరూ చెబుతున్నారు.

కాళేశ్వరం పేరుతో నాటకాలు
ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలని…రిజర్వాయర్లలో నీళ్లు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడిరదని కేటీఆర్‌ విమర్శించారు. కేసీఆర్‌ పర్యటన భయంతో నంది పంప్‌ హౌస్‌ ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్‌కు వదిలారని, నిన్నటిదాకా కాళేశ్వరం ఫెయిల్‌ అయిందని చెప్పి ఇప్పుడు అదే బాహుబలి మోటార్లతో కరీంనగర్‌కు నీళ్లు అందిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్‌ నుంచి మొదలుకుని…టెయిల్‌ ఎండ్‌ దాకా ప్రతిఒక్కరికీ సాగునీరు అందిందన్నారు. పదేళ్లలో ఏనాడు ఒక బోరు వేయాల్సిన పరిస్థితి రాలేదు…కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారు… ఇదీ ఈరోజు రైతాంగం పరిస్థితి అని దుయ్యబట్టారు. చేతగాని కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద పది రోజులు అయినా కూడా నీళ్లు అందించలేని అసమర్థ పరిస్థితి తీసుకువచ్చింది.

కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న దుర్మార్గ పూరిత, చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ఎండబెట్టింది. ఇది మీరు తెచ్చిన కరువు కాబట్టి ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరా నికి 25 వేలు పంట నష్టం అందించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, ఒక్క మంత్రి కానీ, రైతుల వద్దకు వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదని విమర్శిం చారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేము, మా నాయకుడు కేసీఆర్‌ తన ఆరోగ్యాన్ని లెక్కచేయ కుండా మూడు నాలుగు జిల్లాలు తిరిగి రైతులకు పరామర్శించి ధైర్యం చెబుతున్నాం. రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు… సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంకణాల పోతిరెడ్డి రేవంత్‌రెడ్డి ఎక్కడ పోయిండు. వెంటనే రుణమాఫీ చేయనందుకు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర రైతాంగం పక్షాన పోరాటం
ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రైతుల గుండె చెదురవద్దని, ధైర్యంగా ఉండాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. వెంటనే క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఇచ్చిన హామీ లను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు. రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులంతా రాజకీయ చేరికలపై దృష్టి పెట్టారు కానీ రైతాంగం సమస్యల పైన కాదని విమర్శించారు. స్వయంగా ముఖ్య మంత్రి కేశవరావు ఇంటికి వెళ్లినప్పుడు కూడా కరెంటు పోయింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంత బుకాయించినా వాస్తవాలు వాస్తవాలే కానీ, అబద్ధాలు కావని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి కరెంటు కోతలు, సాగునీటి కొరత లేదని చెప్పాలని హితవుపలికారు. ఇదే మాట ముచంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని మంత్రులకు సవాల్‌ విసిరారు.

LEAVE A RESPONSE