(కాట్రగడ్డ ప్రసూన, తెలంగాణ సెటిలర్స్ ఫోరమ్ కన్వీనర్)
అమరవీరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారని, ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా? అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడం అభ్యంతరకరం. ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి ఇక్కడ పనులు చేసుకోవచ్చు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, తప్పులేదు కానీ కేవలం ఆంధ్రా వాళ్లు కాంట్రాక్టులు తీసుకుంటే తప్పవుతుందా? ఎందుకు ఆంధ్రా వారిపై మీకింత విద్వేషం?
ఆంధ్రా మూలాలున్న మేమంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. కోదండరామ్, కేసీఆర్ కూడా ఇటువంటి విద్వేష వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇంకా ఇటువంటి విద్వేషపు వ్యాఖ్యలు దేనికి? తెలంగాణలో అన్ని రాష్ట్రాల వారు జీవిస్తున్నారు. ఒక్క తెలంగాణ అని ఏముంది? ఒక జాతీయ పార్టీకి నాయకుడు అయ్యుండి ఈ విధంగా ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టడం సమంజసమేనా?
ఆంధ్రా-తెలంగాణ వారు ఒకరికి ఒకరు వివాహ సంబంధాలు నెలకొల్పుకోవటానికి లేని అభ్యంతరం కాంట్రాక్టుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు వస్తున్నది? రేవంత్రెడ్డి అల్లుడు, మనవడు ఎక్కడివారు? ఆంధ్రా ప్రాంతం వారే కదా!. వారిని రేవంత్రెడ్డి ప్రేమతో ఆదరిస్తాడా? లేదా?. విదేశాలకు చెందిన సోనియాగాంధీ ఇక్కడి పార్టీకి అధ్యక్షత వహించారు. పార్లమెంట్ మెంబర్గా కొనసాగుతున్నారు. ఆమె తెలంగాణ ఇప్పించడంలో కీలకపాత్ర వహించారు. సోనియాగాంధీ విదేశీ మూలానికి లేని అభ్యంతరం ఈ కాంట్రాక్టుల దగ్గర ఎందుకు వస్తున్నది?
తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఇతర రాష్ట్రాలలో కాంట్రాక్టులు చేస్తున్నారు కదా, తెలంగాణ వారు తమ ప్రాంతంలో కాంట్రాక్టుల్ని చేయవద్దని ఆ రాష్ట్రం వారు అంటే ఏవిధంగా ఉంటుంది? భవిష్యత్తులో ఒకవేళ ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి వస్తే రేవంత్రెడ్డి ఇదేవిధంగా ఆంధ్రా వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తారా? ఇదే మాటల్ని మీ అధిష్టానం చేత చెప్పిస్తారా? ఏ రాష్ట్రం వాళ్లు ఆ రాష్ట్రంలోనే కాంట్రాక్టులు చేయాలని రాజ్యాంగంలో రాసి ఉన్నదా?. ఆంధ్రా ప్రాంతం వారు తెలంగాణలో కాంట్రాక్టులు ఎందుకు చేయవద్దో రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలి.
అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందనే విషయాన్ని ఎత్తిచూపారు. ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు. దీనికి మేము కూడా మద్దతిస్తున్నాం. దీనిపై విజిలెన్స్ కమిషన్కు రిఫర్ చేయాలి, దర్యాప్తు సంస్థలకు కంప్లయింట్ చేయాలి. కానీ ఒకరిపై ఒకరు ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టుకోవడం మంచిది కాదు. ఆంధ్రా వాళ్లు దుష్టులు, దుర్మార్గులైనట్లు, అంటరానివాళ్లయినట్లు మాట్లాడటం సరైంది కాదు.
ఒక ప్రాంతంవారు మొత్తం మంచివాళ్లయిండరు, మరోప్రాంతం మొత్తం చెడ్డవారై ఉండరు. తెలంగాణలో సెటిలైన కోటిన్నర మంది ప్రజలు కాంగ్రెస్ పార్టిపై తిరగబడితే పరిస్థితి ఏమిటి? వీరి ఓట్లు కాంగ్రెస్ పార్టీ కావాలనుకోవటం లేదా? ఎవరిని బెదిరించటానికి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు. తెలుగువారందరు అన్నదమ్ముల్లా కలిసి జీవించాలి. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప నిరంతరం విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ జీవించటం మంచిది కాదు. ఇకనైనా ఆంధ్రాప్రాంతం వారిపై విద్వేష వ్యాఖ్యలు చేయటం మానుకుంటే మంచిది.