Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి అన్నట్లుగా ఉంది

– కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు
– ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి తిన్నన్ని తిట్లు ఏ పాలకుడు తిని ఉండడు
– తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన హైదరాబాద్ జిల్లాలో జరిగే దీక్ష దివాస్ సన్నాహాక సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా పార్టీ నేతలకు పిలుపు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం కూడా సంతోషంగా లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఏడాది పాలనలో ప్రజలతో ఇన్ని తిట్లు తిన్న పాలకులు గతంలో ఎవ్వరూ లేరని చెప్పారు. ఈ నెల 29 నిర్వహించననున్న దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా సన్నాహాక సమావేశాన్నితెలంగాణ భవన్ లో నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్…కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వని నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎత్తైన కుర్చీలో కూర్చొని గొప్ప మనిషిని కావాలని భావిస్తున్నాడని….కానీ కేసీఆర్ లా ప్రజలకు మంచి చేసినప్పుడు మాత్రమే వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోగలమని గుర్తించటం లేదన్నారు. మూసీ, హైడ్రా, ఆటో డ్రైవర్లు ఇలా నగర ప్రజలపై పగ పెంచుకోని కాంగ్రెస్ సర్కార్ వారిని వేధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారని…తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మనమే గెలుస్తాం

కాంగ్రెస్ తప్పుడు హామీలను నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. వెలుగు విలువ చీకటి ఉన్నప్పుడే తెలుస్తుందని…కేసీఆర్ గారిని పొగొట్టుకున్నామని ప్రజలంతా ఆవేదనలో ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ అఖండ మెజార్టీ గెలవటం ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర పదవులు అనుభవించిన వారు పార్టీ మారినప్పటికీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ కు కొండంత అండగా ఉన్నారని చెప్పారు. కష్ట సమయంలోనే ఎవరు మనవారు, ఎవరు బయట వాళ్లు అనేది తెలుస్తుందని చెప్పారు.

హైదరాబాద్ ను నాలుగు ముక్కలు చేసే కుట్ర

ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ ని మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఎంపీ ఎన్నికల్లో చెరి ఎనిమిది సీట్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. కానీ బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేత్తలు మొదలు పెట్టగానే… ముందుగా ప్రభుత్వానికి మద్దతిచ్చింది బీజేపీ నేతలు రఘునందన్, బండి సంజయ్ లేనని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ రెండు పార్టీల చీకటి దోస్తానాను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీకి, కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి డబ్బుల మూటలు పంపిస్తున్నారని కేటీఆర్ విమర్శలు చేశారు. బీజేపీ తో కలవాల్సిన అవసరం బీఆర్ఎస్ కు లేనే లేదని తేల్చిచెప్పారు.

ఏ వర్గం సంతోషంగా లేదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని కేటీఆర్ అన్నారు. రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, గురుకులాల్లో విద్యార్థులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ శ్రేణులను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిత్యం జనంలో ఉండి ప్రజల కష్టాల్లో తోడు ఉండే వారందరికీ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ చెప్పారు.

దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE