October 8, 2026

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ ఓటు చోరీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు

  • ఓటమి భయంతోనే రాజ్యాంగ సంస్థలపై కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి విషప్రచారం
  • ఎన్నికల సంఘంపై తప్పుడు ప్రచారాలతో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు
  • రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే నైరాశ్యంతోనే ఢిల్లీలో వింత చేష్టలు, డ్రామాలు
  • 13.39 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణలు అబద్ధం, ఏఎస్డీ (ASD) నిబంధనల ప్రకారమే సవరణ.
  • కేసీఆర్ కుటుంబ అవినీతిపై 100 రోజుల్లో చర్యలన్న రేవంత్ నేడు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం
  • బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్

హైదరాబాద్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ రోడ్లపై పడుకుని చేస్తున్న వింత చేష్టలు ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమానించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి. సుభాష్ గారు తీవ్రంగా ఫైరయ్యారు.

గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు డా. రాహుల్ సరిదెన , అభిషేక్ , మహేష్, డా. పల్నాటి వెంకట్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
1993లో టీఎన్ శేషన్ హయాంలో ఏకసభ్య కమిషన్‌గా ఉన్న వ్యవస్థను ముగ్గురు సభ్యుల కమిటీగా మార్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2027 మొదటి ఆరు నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ‘ఇండి’ కూటమికి ఘోర పరాజయం తప్పదని తేలిపోవడంతోనే ఇటువంటి కుట్రపూరిత ప్రచారానికి తెరలేపారని సుభాష్ విశ్లేషించారు. ఢిల్లీ రోడ్లపై కాంగ్రెస్ చేస్తున్న ఈ నిరసనలకు సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్, శరద్ పవార్ ఎన్సీపీ వంటి మిత్రపక్షాలే మద్దతు ఇవ్వకపోవడం వారి ఒంటరితనాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు.

దేశవ్యాప్తంగా 13.39 కోట్ల ఓటర్లను జాబితా నుంచి తొలగించారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అబద్ధాలేనని ఆయన కొట్టిపారేశారు. ఎన్నికల కమిషన్ చట్టబద్ధంగా అమలు చేస్తున్న ఏఎస్డీ ప్రక్రియలో భాగంగానే జాబితా ప్రక్షాళన జరుగుతోందని వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా 2.8 కోట్ల మంది మరణించిన వారి పేర్లు, 1.2 కోట్ల డూప్లికేట్ ఓట్లు, 6.33 కోట్ల మంది వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లు, మరో 3.01 కోట్ల మంది స్థానిక చిరునామాల్లో నివాసం లేని వారి వివరాలను మాత్రమే తొలగించడం జరిగిందన్నారు.

క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, వీఆర్వోలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని, వారు ఇంటింటికి వెళ్లి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటుంటే దానిని కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. 2013లో కాంగ్రెస్ హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కపిల్ సిబల్ రాజ్యసభలో స్వయంగా 13.5 లక్షల బోగస్ ఓట్లను తొలగించడాన్ని సమర్థించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆధారాలుంటే అఫిడవిట్ రూపంలో ఈసీఐకి సమర్పించమని పిలిచినా వెళ్లకుండా, పార్లమెంట్‌లో చర్చించకుండా కేవలం మీడియా ఈవెంట్ల కోసం ఢిల్లీలో విధుల్లో ఉన్న మహిళా పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ రోడ్లపై డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యం గురించి, ఓటు హక్కు గురించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎన్.వి. సుభాష్ ఎద్దేవా చేశారు. అసలు ప్రజాస్వామ్యంలో ఓటు విలువను దిగజార్చి, ఓటు చోరీకి పాల్పడింది రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. 2015లో ‘ఓటుకు నోటు’ కేసులో ఆడియో, వీడియో రికార్డింగులతో కెమెరాల సాక్షిగా అడ్డంగా దొరికిపోయి నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని గుర్తుచేశారు. అటువంటి వ్యక్తి నేడు ‘సీట్ చోరీ, ఓటు చోరీ’ అంటూ బీజేపీపై నిందలు వేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం – బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో 45 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గి మిన్నకుండిపోయారని ఎన్.వి. సుభాష్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ‘100 రోజుల్లో కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటకు తీసి జైలుకు పంపుతాం’ అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి, గొర్రెల కుంభకోణం, విద్యుత్ కొనుగోళ్లు సహా 20 కీలక స్కామ్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వస్తే చాలు సెక్యూరిటీ లేకుండా స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి విలువైన భూములు ఎక్కడున్నాయో చూసుకుని, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, సలహాదారులతో కలిసి ఎక్సెల్ షీట్లలో కబ్జా ప్లాన్లు వేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పగలు కుస్తీ పడుతూ రాత్రిపూట దోస్తీ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

అణచివేత రాజకీయాలు చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్

గతంలో బండి సంజయ్ కుమార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతుతో గ్యాస్ కట్టర్లు, వెల్డింగ్ మిషన్లు తీసుకొచ్చి డోర్లు బద్దలుకొట్టి పాశవికంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్.వి. సుభాష్ గుర్తుచేశారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే స్పందించకపోగా ఒక్క నెలలోనే ఆరుసార్లు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి సింగరేణి ప్రాంతానికి వెళ్తే ప్రోటోకాల్ పాటించకుండా అడ్డుకుని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో బీజేపీ నాయకులను ఇంతలా వేధించిన కాంగ్రెస్ నేతలు, నేడు ఢిల్లీ వీధుల్లోకి వెళ్లి ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అని మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.

Total Visitors: 2,899,780